Home ఎడిటోరియల్ అచ్చేదిన్ పాయె… అజేయ భారత్ వచ్చె

అచ్చేదిన్ పాయె… అజేయ భారత్ వచ్చె

Ajay Bharat is narendra modi slogan for Elections 2019

మాట మార్చటం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజలు జ్ఞాపకశక్తిహీనులని వారికి అపార నమ్మకం. గత ఎన్నికల్లో ‘మంచి రోజులు రానున్నాయి’ అని మభ్యపెట్టి విజయం సొంతం చేసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ, వచ్చే ఎన్నికలకు సరికొత్త నినాదాన్ని వదిలారు. అది ‘అజేయ భారత్, అటల్ (దివంగత మాజీ ప్రధాని పేరు కాదు సుమా!) బిజెపి’ (విజేత భారత్, దృఢచిత్తం గల బిజెపి). బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో రెండో రోజు ప్రధాని ప్రసంగించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్టా అధ్యక్ష పదవీకాలం పొడిగించబడిన అమిత్ షా మహా బీరాలకు పోయారు. ‘ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం… 2019 లో విజయం సాధిస్తే పార్టీ అధికారానికి మరో 50 ఏళ్ల వరకు తిరుగులేదు’ అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో బిజెపి దేశ నిర్మాణంగావిస్తుంటే కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం చేయటంలో మునిగి ఉందని నిందారోపణ చేశారు. బిజెపిని ఓడించేందుకు ఐక్యంగా పోటీ చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నించటమే బిజెపికి విజయమని మోడీ అన్నారు.

పాలక పార్టీ కాబట్టి మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకోవటం, ప్రయత్నించటం నిరాక్షేపణీయం. అది జాతీయ కార్యవర్గ సమావేశం కాబట్టి, మీడియా కోసం మోడీ, షా ద్వయం పై మాటల తూటాలను బయటకు వదిలినా, రాష్ట్రాల వారీ బిజెపి పరిస్థితిపై అంతర్మథనం తప్పక జరిగి ఉంటుంది. ఎందుకంటే, బిజెపికి బలమైన ఉత్తర భారత్‌లో అది మూడు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటున్నది. 80లో 73 సీట్లు గెలిచిన ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌సి, బిఎస్‌పి ఐక్యంగా పోటీ చేయటం, బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను తమ బండి ఎక్కించుకున్నా ప్రతిపక్ష ఆర్‌జెడి బలపడుతుండటం, కొత్త మహాకూటమి ఆవిర్భావం. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ పునరుజ్జీవనం, గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో తిన్న ఎదురు దెబ్బలు బిజెపిని బేజారెత్తిస్తున్నాయి. గత సంవత్సర కాలంలో జరిగిన ఓ అరడజను లోక్‌సభ, మరికొన్ని అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటర్లు బిజెపిని ఓడించటం గుర్తు చేసుకోదగింది.

రెండు, బిజెపి పునాది అయిన అగ్రవర్ణాల్లో బయలుదేరిన అసంతృప్తి, తిరుగుబాటు. మోడీ, షా నాయకత్వం ఓట్ల కోసం దళితులు, ఒబిసిల్లోని వెనుకబడిన కులాలను బుజ్జగిస్తుండగా, అగ్రవర్ణాలు తమ కులాల్లో వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ, ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం కోరలు పీకిన సుప్రీంకోర్టు తీర్పును వమ్ము చేస్తూ పార్లమెంటులో చేసిన చట్టాన్ని రద్దు చేయాలంటూ వీధుల కెక్కుతున్నారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఆందోళన తీవ్రంగా ఉంది. మూడు, అన్నిటికన్నా ప్రధానమైంది మోడీ నాలుగున్నరేళ్ల పాలనపట్ల అప్పుడే వ్యక్తమవుతున్న ‘వ్యతిరేక భావన’. ఏకపక్ష మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం అయినందున సాధారణంగా అటువంటి భావన అప్పుడే రాకూడదు. అది ఏర్పడుతున్నదంటే స్వయంకృతం. ‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’ నినాదానికే పరిమితమైంది. పెద్దనోట్ల రద్దు వంటి తీవ్రమైన చర్యతో ఆర్థిక వ్యవస్థను, పేద, సామాన్య ప్రజలను కడగండ్ల పాల్జేసిన ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో విఫలమైంది, నిరుద్యోగం పెంచింది.

ప్రజలపై భారాలు మోపుతూ కొద్ది మంది పెట్టుబడి దారులకు అనుకూలంగా వ్యవహరించటాన్ని ప్రజలు చూస్తున్నారు. విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకురావటం, ఒక్కొక్కరి బ్యాంక్ ఖాతాలో రూ. 15 లక్షలు వేయటం ‘ఎన్నికల తమాషా’ అయినట్లే ‘అచ్చేదిన్’, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కూడా తమాషా అయినాయి. వ్యవసాయదారులు అసంతృప్తికి గురైనారు. అన్నిటికీ మించి సామాజిక సామరస్యాన్ని చిన్నాభిన్నం చేసింది. అధికారం తలకెక్కిన హిందూత్వ శక్తులు దళితులు, మైనారిటీలను హింసించటం, బరితెగించి హత్య చేయటం అణగారిన తరగతులను భయోత్పాతంలోకి నెట్టింది. ఆ విధంగా మోడీ పాలన పట్ల సానుకూలత కన్నా వ్యతిరేకత పెరిగింది. ఈ ప్రభుత్వాన్ని బ్యూరోక్రాట్లు లేక బ్యూరోక్రాటిక్ దృక్పథం కలిగిన రాజకీయ నాయకులు నడుపుతున్నట్లున్నారు. పెట్రోలు, డీజిల్ రేట్లు విపరీతంగా పెరగటంపై ప్రజల్లో అసంతృప్తి పెల్లుబుకుతున్నా రాజకీయ నాయకత్వం జోక్యం చేసుకోకపోవటమే ఇందకు ఉదాహరణ.

‘నవ భారతం’ కొరకు మోడీ దార్శనికతను కొనియాడుతూ హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాన్ని జాతీయ కార్యవర్గం ఆమోదించింది. అవినీతి, కులతత్వం, మతతత్వం, టెర్రరిజం లేని నవ భారతాన్ని దేశ స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవమైన 2022 నాటికి సాధించటం లక్షం. నమ్మటం నమ్మకపోవటం ప్రజల ఇష్టం.