Home జాతీయ వార్తలు ఫెడరల్ ఫ్రంట్‌కు అఖిలేశ్ ప్రశంస

ఫెడరల్ ఫ్రంట్‌కు అఖిలేశ్ ప్రశంస

Akhilesh

 

త్వరలోనే కెసిఆర్‌ను కలుసుకుంటానని ప్రకటన

యుపిలో పొత్తులపై త్వరలోనే మీ ముందుంటాం : అఖిలేష్

లక్నో : జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేస్తున్న ప్రయత్నాలను యుపి మాజీ సిఎం అఖిలేశ్ ప్రశంసించారు. త్వరలోనే ఆయనతో సమావేశమవుతానని పునరుద్ఘాటించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ, మాయావతి నేతృత్వంలోని బిఎస్‌పిల మధ్య పొత్తు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో సమాజ్‌వాది అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పొత్తులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. లక్నోలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అందరి ఆలోచనల సంగమం జరుగుతుందని, త్వరలోనే దాని గురించి మీకు తెలుస్తుందని అన్నారు.‘ ఉత్తరప్రదేశ్‌లో జన సంగమం, ఆలోచనల సంగమం జరగనుంది. అతి త్వరలోనే అది మీ ముందుంటుంది’ అని పొత్తులపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా అఖిలేశ్ చెప్పారు.

ఈ కూటమిలో కాంట్రెస్ పర్టీ కూడా ఉంటుందా అని అడగ్గా, ‘జన సంగమం, ఆలోచనల సంగమం ఉంటుందని నేను చెప్పాను. ఈ ప్రశ్నతో సహా అన్ని ప్రశ్నలకు దానిలోనే సమాధానం ఉంది’ అని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతు అందించినప్పటికీ అఖిలేశ్, మాయావతిలు కాంగ్రెస్‌కు దూరంగానే ఉంటున్న విషయం తెలిసిందే. మధ్య ప్రదేశ్‌లో తమ పార్టీకి చెందిన ఏకైక ఎంఎల్‌ఏకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంపై అఖిలేశ్ తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆ పని చేసి ఉంటే ఉత్తరప్రదేశ్‌లో పొత్తుకు మార్గం సుగమం చేసి ఉండేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కాగా బిజెపిని అధికారానికి దూరం చేయడం కోసమే తాను మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు మాయావతి చెప్పడం తెలిసిందే.

Akhilesh is going to meet the KCR soon on Federal Front

Telangana Latest News