Home తాజా వార్తలు బడ్జెట్‌పై మోడీకి అఖిలేష్ లేఖ

బడ్జెట్‌పై మోడీకి అఖిలేష్ లేఖ

AKHILESH-1

లక్నో : కేంద్ర బడ్జెట్‌ను యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రవేశ పెట్టడం సరికాదని, బడ్జెట్‌ను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తూ యూపీ సిఎం అఖిలేష్‌యాదవ్ ప్రధాని నరేంద్రమోడీకి శుక్రవారం లేఖ రాశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలని ఆయన కోరారు. యూపీలో ఫిబ్రవరి 11 నుంచి ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రబడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సుప్రీంకోర్టు ఇప్పటికే పచ్చ జెండా ఊపింది. ఎన్నికల కారణంగా బడ్జెట్‌ను వాయిదా వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి పథకాలను బడ్జెట్‌లో ప్రవేశ పెట్టరాదని ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించింది. దీనిపై స్పందించిన అఖిలేష్ ఎన్నికలముందు బడ్జెట్ ప్రవేశపెడితే యూపీ అనేక పథకాలు కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మోడీకి ఆయన లేఖ రాశారు.