Home లైఫ్ స్టైల్ గర్భిణీలు తాగితే వికారపు పిల్లలు

గర్భిణీలు తాగితే వికారపు పిల్లలు

Born Babyగర్భంతో ఉండగా పొగతాగినా,మద్యం సేవించినా,వంట పొయ్యి పొగ తగిలినా పిల్లలకు ముఖ వైకల్యం: ఎయిమ్స్ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: గర్భిణులు మద్యం సేవించినా, పొగత్రాగినా, పొయ్యి పొగ పీల్చినా, అత్యధికంగా మందులు వాడినా పుట్టే బిడ్డలకు మొర్రి, మూతి వంకర వంటి ముఖ వైకల్యాలు వస్తాయని అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ(ఎయిమ్స్) అధ్యయనం వెల్లడించింది. వ్యసనాలకు లోనైన గర్భిణులు పౌష్టికాహార సమస్యను కూడా ఎదుర్కొంటే అది పుట్టబోయే బిడ్డకు నరకమే అవుతుంది. పుట్టే బిడ్డలు వికార ముఖాలతో మూతివంకర, మొర్రి వంటి అవలక్షణాలతో జన్మిస్తారని, పలు విధాలుగా అనుక్షణ గండం ఎదుర్కొంటారని ఎయిమ్స్ బృందం జరిపిన సర్వేలో వెల్లడైంది. పెదవులు పగిలి, మొర్రితనంతో శిశు జననం జరుగుతుంది. దీనితో కాలక్రమేణా బిడ్డకు సరిగ్గా మాటలు రాకపోవడం, ముఖం వికారం కావడం వంటి సమస్యలు తీవ్రతరం అవుతాయి. దంతాల అమరిక దెబ్బతింటుంది. దవడల అమరిక సరిగ్గా ఉండదు. ముఖం అంతా దెబ్బతింటుందని తెలిపారు.

మొర్రి వంటి అవలక్షణం గర్భస్థ దశలో సోకే ముప్పులలో అత్యధిక స్థాయిలో అంటే మూడింట ఒక వంతు స్థాయిలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లెక్కచూస్తే ప్రతి 700 మంది గర్భస్థ శిశువులలో సగటున ఒక్కరికి ఇది ఏర్పడుతుంది, పిండం దశలో తలెత్తే ముఖ ప్రాంత క్లిష్టత తల్లి దుర్వసనాలతోనే సంక్రమిస్తుందని ఎయిమ్స్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించిన లెక్కలతో పోలిస్తే ఆసియా దేశాలలో ఇది వేరే విధంగా ఉంటుంది. ప్రతి వేయి మంది నవజాత శిశువులలో ఇటువంటి ఇబ్బందులకు దాదాపు 1.7 అంతకు మించి గురవుతారు. ఇక భారతదేశం విషయానికి వస్తే దీనిపై జాతీయ సంక్రమిత వ్యాధుల గణాంకాలు అందుబాటులో లేవు. కానీ దేశంలో వివిధ ప్రాంతాలలో జరిపిన అధ్యయనాలతో పిల్లల్లో తలెత్తే మొర్రి, పెదవుల అస్తవ్యస్థ పరిస్థితి క్రమంలో తేడాలు ఉన్నట్లు వెల్లడైంది.

అయితే ప్రతి ఏటా దేశంలో 35000 మంది శిశువులు కొత్తగా ఇటువంటి ఇబ్బందులతో పుడుతున్నట్లు వెల్లడైంది. ఎయిమ్స్‌కు చెందిన దంత విద్య, పరిశోధనాకేంద్రం (సిడిఇఆర్) వారు 2010 నుంచి గర్భిణులపై, వారికి పుట్టిన బిడ్డలపై అధ్యయనం జరుపుతూ వస్తున్నారు. మూడు దశలలో దీనిని గర్భిణులపై ఈ అధ్యయనం జరిపారు. తొలి దశలో 2010 నుంచి 2012 వరకూ జరిపిన సర్వేలో సమగ్ర అధ్యయనానికి అవసరమైన విధివిధానాలను రూపొందించారు. దంత, శ్రవణ లోపాలు, మాట్లాడటంలో ఏర్పడే ఇబ్బందులపై విశ్లేషణకు సరైన ప్రక్రియను ఈ క్రమంలో రూపొందించారు. రోగుల అనారోగ్య అవలక్షణాల చరిత్రను సరైన రీతిలో రికార్డు చేసేందుకు ఈ విధమైన ఏర్పాటు అవసరంఅయిందని ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన ఎయిమ్స్‌కు చెందిన సిడిఇఆర్ విభాగం అధినేత ఒపి కర్బందా తెలిపారు.

ఇక ప్రయోగాత్మక పరీక్షల దశ 2012 నుంచి 2014 వరకూ సాగింది. ఇందులో భాగంగా అవలక్షణాలతో పుట్టిన 164 మంది పిల్లల పూర్వాపరాలను, వారి తల్లుల అలవాట్లను సేకరించారు. అత్యధికంగా ఇటువంటి పిల్లలు పుట్టడానికి కారణం కేవలం తల్లులు గర్భం దాల్చినప్పుడు సిగరెట్లు తాగడం, ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవడం కారణం అని వెల్లడైంది. ప్రస్తుతం మూడో దశ అయిన బహుళ కేంద్రీకృత దశ అధ్యయనం సాగుతోందని తెలిపారు. దీనిని న్యూఢిల్లీ, హైదరాబాద్, లక్నో, గువహతిలోని సాగిస్తున్నారు. గర్భం దాల్చిన తొలినాళ్లలో సిగరెట్లు తాగడం, చివరికి సిగరెట్లు తాగే వారి మధ్య ఉండటం వంటి పరిణామాలు బిడ్డకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయని విశ్లేషించారు. పెదవుల వంకరతనం, మొర్రి వంటి అవలక్షణాలు శారీరక గోచర లోపాలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ బాల్ స్వస్థత కార్యక్రమ నిర్వాహకులు గుర్తించారు.

Alcohol drink in Pregnancy time is effects on baby says AIIMS