Home కుమ్రం భీం ఆసిఫాబాద్ జోరుగా మద్యం అక్రమ రవాణా

జోరుగా మద్యం అక్రమ రవాణా

Alcohol smuggling

రైలు మార్గాన కాగజ్‌నగర్ నుంచి మహారాష్ట్రకు
చందపూర్‌లో జిల్లాలో మద్యపాన నిషేధం
అక్రమార్కులకు వరంగా మారిన వైనం
చోద్యం చూస్తున్న స్థానిక ఎక్సైజ్ అధికారులు

మన తెలంగాణ/కాగజ్‌నగర్ : మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు సరిహద్దులో ఉన్న కాగజ్‌నగర్ నుండి ప్రతి నిత్యం అక్రమ మద్యం రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ నుండి ప్రతి రోజు పలు రైళ్ల ద్వారా ఇక్కడి మద్యాన్ని అక్రమార్కులు చంద్రపూర్ జిల్లాలోని బల్లార్‌షా, రాజురా, విరూర్, విహీర్‌గాం వంటి ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో అక్కడి ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తోంది. అయితే మద్యపాన నిషేధం అమలులో ఉండటం, అక్రమార్కులకు వరంగా మారింది. ఉదయం నుండి రాత్రి వరకు అనేక రైళ్లలో స్కూల్ బ్యాగులు, గోనె సంచులలో అక్రమార్కులు మద్యాన్ని రవాణా చేస్తున్నారు. ఒక వైపు రైల్వే రక్షణ దళం, ప్రభుత్వ రైల్వే పోలీస్ శాఖ తరపున తనిఖీలు నిర్వహించినప్పటికీ అక్రమార్కులు ఏదో ఒక రకంగా మద్యాన్ని తరలిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పూట అజ్‌నీ, కాజీపేట ప్యాసింజర్ రైలులో ప్రతి రోజు వేంపల్లి స్టేషన్ నుండి మద్యం కార్టున్లను రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ నుండి వివిధ రైళ్లలో మద్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పటీకి సంబధిత ఎక్సైజ్ శాఖాధికారులు చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ తరపున సిబ్బంది రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేసిన దాఖలాలు ఇప్పటి వరకు లేవని పలువురు ఆరోపిస్తున్నారు. రాంగిరి, అజ్‌నీ, కాజీపేట, భాగ్యనగర్ రైళ్ల ద్వారా ఎక్కువగా మద్యాన్ని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ నుండి కేవలం అర గంటలోనే మహారాష్ట్రలోని విరూర్ స్టేషన్‌కు చేరుకునే వీలు ఉండటంతో అక్రమార్కులు పెద్ద ఎత్తున మద్యాన్ని తరలిస్తున్నారు.
అక్రమార్కులకు వరంగా మారిన ప్లాస్టిక్ సీసాలు ఇక్కడి నుండి మహారాష్ట్రకు మద్యాన్ని అక్రమంగా రవాణా చేసే అక్రమార్కులకు ప్లాస్టిక్ సీసాల్లో లభించే మద్యం వరంగా మారింది. ప్లాస్టిక్ సీసాల్లో లభ్యమయ్యే వివిధ బ్రాండ్ల మద్యాన్ని సంచుల్లో వేసి అక్రమార్కులు తరలిస్తున్నారు. బల్లార్‌షా, విరూర్ తదితర స్టేషన్లు రాక ముందే వాటిని విసిరేస్తున్నారు. రాత్రి పూట నడిచే రైళ్లలోనే అధికంగా మద్యం రవాణా అవుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి.
అక్రమార్కులను సహకరిస్తున్న స్థానిక మద్యం వ్యాపారులు మహారాష్ట్రకు అక్రమంగా మద్యం రవాణా చేసే అక్రమార్కులను స్థానిక మద్యం వ్యాపారులు కొందరు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉదయం పూట రహస్య గోదాంల నుండి మద్యం సీసాలను అక్రమార్కులకు విక్రయిస్తూ కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసే అక్రమార్కులను స్థానిక కొందరు వ్యాపారులు తెల్లవారుజామున 5 గంటలకు సైతం మద్యం సీసాలు అందిస్తున్నారని తెలుస్తోంది. ఎక్సైజ్ నిబంధన ప్రకారం ఉదయం 10 గంటల తర్వాత మద్యం దుకాణాలు తెరవాల్సి ఉండగా, కొందరు నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారని సమాచారం.

రైల్వే స్టేషన్‌లో తనిఖీలను ముమ్మరం చేస్తాం
కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ నుండి అక్రమంగా మద్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు తమ దృష్టికి సైతం వచ్చిందని, అయితే స్టేషన్‌లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలను ముమ్మరం చేస్తాం. మహారాష్ట్ర నుండి ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసే వారిని స్థానిక వ్యాపారులు సహకరించవద్దు. తనిఖీల్లో పట్టుబడే వారి నుండి సమాచారం సేకరించి సహకరించిన వ్యాపారులపై కూడా చర్యలు తీసుకుంటాం. అక్రమంగా మద్యం రవాణా చేసే వారి గురించి ప్రజలు తమకు సమాచారం అందించాలి.
ప్రవీణ్ కుమార్, ఎక్సైజ్ ఇంచార్జి సిఐ కాగజ్‌నగర్