Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

భూరికార్డులు సాఫు

మిగిలినవి 13 గ్రామాలే
10,804 ఊళ్లలో పరిపూర్ణం
2.13 కోట్ల ఎకరాలలో 1.96 కోట్లు సక్రమం
వివాదంలో దాదాపు 17 లక్షలు
సక్రమ భూ ఖాతాలు 63 లక్షలు
31 కల్లా నిశ్శేషం
మొదటి వారంలో కలెక్టర్లతో సిఎం సమీక్ష

land-surveyహైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం దాదాపు పూర్తయింది. రాష్ట్రంలో ని మొత్తం 10,817 గ్రామాల్లో శుక్రవారం నాటికి 10,804 గ్రామాల్లో పూర్తయింది. ఇంకా 13 గ్రామాల్లో పూర్తి కావాల్సి ఉంది. అందులో పెద్దపల్లిలో తొమ్మిది, ఆదిలాబాద్‌లో రెండు, మహబూబాబాద్‌లో రెండు గ్రామాల్లో ప్రక్షాళన పూర్తికావాల్సి ఉంది. ఈ నెల 31 వరకూ గడువు ఉన్నందున లక్షం పూర్తవుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. నాలుగు నెలల వ్యవధిలోనే రాష్ట్రంలోని సుమారు రెండున్నర కోట్ల ఎకరాల మేర భూ రికార్డుల ప్రక్షాళన చేయడం సవాలు వంటిదని అభిప్రాయపడిన రెవెన్యూ అధికారులు, సిఎం కెసిఆర్ ఆదేశం మేరకు సిబ్బంది పూర్తి సహాయ సహకారాలతో పూర్తి చేయగలిగామని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు జరిగిన ప్రక్షాళనలో మొత్తం భూ రికార్డుల్లో దాదాపు 8 శాతం (16,93,791.29 ఎకరాలు) మేర కోర్టు కేసులు, రెవెన్యూ తగాదాలు, అటవీ విభాగంతో వివాదం తదితరాలు ఉన్నట్లు తేలింది. భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియను విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో సిఎం కెసిఆర్ జనవరి మొదటివారంలో ప్రగతిభవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. తేదీ లు ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ బహుశా జ నవరి 3 లేదా 5 తేదీల్లో ఈ సమావేశం ఉండవచ్చని సమాచారం. మొత్తం 31 జిల్లాల్లో కేవలం మూడు జిల్లాలు మినహా మిగిలిన 27 జిల్లాల్లో పూర్తి స్థాయిలో రికార్డుల ప్రక్షాళన జరిగింది. ఈ వివరాలన్నింటినీ మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణ శుక్రవారం మధ్యాహ్నమే సిఎం కెసిఆర్‌కు వివరించారు. మొత్తం 2.13 కోట్ల ఎకరాల భూ రికార్డులను పరిశీలించిన అనంతరం 1.96 కోట్ల ఎకరాలు పగడ్బందీగా ఉన్నట్లు అధికారులు తేల్చా రు. అంటే దాదాపు 92% భూ రికార్డుల పరిశీలన అనంతరం సవరణలు పూర్తయ్యాయి. రికార్డుల ప్రక్షాళన ప్రక్రియకు డిసెంబరు 31 గడువుగా నిర్ణయించుకున్నప్పటికీ ఆ తర్వాత కూడా భూముల వివరాల్లో మార్పులు చేర్పులు చేసే పనులు కొనసాగుతాయని, ఇదంతా నిరంతరం జరిగే ప్రక్రియేనని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు దే శంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత సంచలన నిర్ణయాన్ని తీసుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోవ డం మాత్రమే కాకుండా ఆశించిన లక్ష్యాన్ని సా ధించిందని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ప్రతి శనివారం సిఎం కెసిఆర్ ఈ ప్రక్రియపై మిషన్ డైరెక్టర్‌తో పాటు పలువురు అధికారులతో, అవసరాన్ని బట్టి జిల్లా కలెక్టర్లతో సమీక్ష జరుపుతూ ఉన్నారు. గడువు తేదీ దగ్గర పడుతున్నందువల్ల నాలుగైదు రోజులుగా ప్రతిరోజూ సమీక్ష జరుపుతున్నట్లు సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వ్యా ఖ్యానించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వివాదంలో ఉన్న భూములపై ప్రభుత్వం దృష్టి సా రించనుంది. అసైన్డ్ భూములు ఎన్ని చేతులు మా రాయో అధ్యయనం చేసి భూమిలేని నిరుపేదలకు కేటాయించడంపై దృష్టి సారించనుంది.
భూ ప్రక్షాళన వివరాలు :
మొత్తం గ్రామాలు : 10817
ప్రక్రియ పూర్తయిన గ్రామాలు : 10804
మిగిలిన గ్రామాలు : 13
పరిశీలించినవి : 2,13,18,724.31 ఎకరాలు.
సక్రమమైనవి : 1,96,24,923.18 ఎకరాలు
వివాదంలో ఉన్నవి : 16,93,791.29 ఎకరాలు
సక్రమంగా ఉన్న భూఖాతాలు : 63 లక్షలు
వివాదంలో ఉన్న భూముల వివరాలు :
సివిల్ కోర్టు కేసులు : 85,702.06 ఎకరాలు
రెవిన్యూ కోర్టు కేసులు : 37,818.11 ఎకరాలు
అటవీ, రెవెన్యూ వివాదాలు : 2,09,556.09
ఎకరాలు
పిఒటి కేసులు : 2,26,891.28 ఎకరాలు
సాదా బైనామా : 2,30,002.16 ఎకరాలు
ఎల్‌టిఆర్ కేసులు : 82,925.37 ఎకరాలు
వివాజీ జమేదార్ భూములు : 1,18,172.03
ఎకరాలు
ఇతరాలు : 7,02,727.18 ఎకరాలు

Comments

comments