Home ఎడిటోరియల్ ఆశలన్నీ ఎఫ్‌డిఐ పైనే!

ఆశలన్నీ ఎఫ్‌డిఐ పైనే!

sampadakeyam

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పణకు సన్నద్ధమవుతున్న నరేంద్రమోడీ ప్రభుత్వం నత్తనడకలో పడిన ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)పై ఆశలు పెంచుకున్నట్లు దాని తాజా ఎఫ్‌డిఐ విధాన నిర్ణయాలు సూచిస్తున్నాయి. మోడీ నాయకత్వంలో బిజెపి రాజకీయంగా విజయాలు సాధిస్తున్నప్పటికీ, ఆయన ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సజావుగా నడపడంలో విఫలమవుతుంది. జిడిపి వృద్ధి రేటు తగ్గుదల, బడ్జెట్ ద్రవ్యలోటు అంచనాను మించి పెరగడం, దేశీయ పెట్టుబడులు తగ్గుదల, బ్యాంక్ రుణాల తగ్గుదల, ఉపాధి కల్పన వెనుకపట్టు, ద్రవ్యోల్బణం పెరుగుదల ఇత్యాది సమస్యలతో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి బలవర్ధక ఆహారం అవసరం. ఎఫ్‌డిఐలకు ద్వారా లు మరింత బార్లా తెరవడమే మార్గంగా ప్రభుత్వం భావించినట్లుంది. భారత అధికారిక విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నష్టాల్లో ఉన్న కారణంగా దాని పెట్టుబడి విలువలో 49శాతాన్ని విదేశీ పెట్టుబడికి అనుమతించడంతో పాటు సింగిల్ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలోకి నూరు శాతం ఎఫ్‌డిఐని స్వేచ్ఛగా అనుమతించాలని కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలు ఈ కోవలోకే వస్తాయి. ఈ నిర్ణయాలు తీసుకున్న సమయానికి కూడా ప్రాధాన్యత ఉంది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్లనున్న ప్రధాని మోడీ ఆర్థిక సంస్కరణలను పరిపూర్తి చేసే బాటలో తమ ప్రభుత్వం ఒడివడిగా అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొని, ప్రపంచ ద్రవ్య పెట్టుబడి సంస్థల, పెట్టుబడి ప్రపంచ నాయకుల ప్రశంసలు పొందేందుకు ఈ నిర్ణయాలు ఉపకరిస్తాయి.
ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో ఉన్నమాట నిజం. అయితే అంతకుమించి ఆస్తులు కూడా ఉన్నాయి. అయితే దానికి సరికొత్త జవసత్వాలు చేకూర్చటానికి ఖజానా నుంచి ధనం వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. దాని వాటాలు విక్రయించాలని ఆరు మాసాల క్రితమే నిర్ణయించింది. ఇప్పుడు కార్యరూపమిస్తున్నది. విదేశీ లేదా విదేశీ భాగస్వామ్యం ఉన్న స్వదేశీ పెట్టుబడిదారులు దాని నిర్వహణ చేబడతారు. స్వదేశీ ‘మహారాజా’ (ఎయిరిండియా చిహ్నం) కు విదేశీ రెక్కలు తొడుగుతారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణ బాట పడుతుంది. విమానయాన రంగంలో ప్రైవేటు రంగం విరివిగా ప్రవేశించినందున ప్రభుత్వానికి సొంత సంస్థ అవసరం లేదన్న అభిప్రాయం ఈ విధంగా నెరవేరుతుంది. ఇతర ప్రైవేటు సంస్థల్లోకి విదేశీ పెట్టుబడులకు కూడా ఈ విధానం మార్గం సుగమంచేస్తుంది.
సింగిల్ బ్రాండ్ (ఏకవస్తువు) రిటైల్ వ్యాపారంలోకి 100 శాతం పెట్టుబడిని ఆటోమేటిక్ రూట్‌లో (ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా) అనుమతించడం తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం 50 శాతం ఆటోమేటిక్ రూట్‌లో, మిగతా 50 శాతం ప్రభుత్వ అనుమతితో తెచ్చుకోవచ్చు. ఇది ఇంతటితో ఆగదు బహుళ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలోకి విస్తరించవచ్చని వర్తక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. అదే జరిగితే ఉద్యోగ కల్పన జరగకపోగా కోట్లాదిమంది చిరువర్తక కుటుంబాలు వ్యాపారాలు కోల్పోయి రోడ్డున పడతాయి. అటువంటి వారు 5 కోట్ల వరకు ఉంటారని అంచనా.
యుపిఎ ప్రభుత్వం 2010లో రిటైల్ రంగంలోకి ఎఫ్‌డిఐని అనుమతిస్తూ ఎఫ్‌డిఐ విధానాన్ని ప్రకటించినప్పుడే ఈ అంశం తీవ్ర ప్రతిఘటనకు గురైంది. ఆనాడు వామపక్షాలే కాదు, బిజెపి, దాన్ని బలపరిచే వర్తక సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేక ఆందోళన చేశాయి. యుపిఎ ప్రభుత్వం ఒక అడుగు వెనక్కు తగ్గి సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో ఆటోమేటిక్ రూట్‌లో 50, అప్రూవల్ రూట్‌లో 50 శాతం, బహుళ బ్రాండ్ వర్తకంలో అప్రూవల్ రూట్‌లో 51 శాతం అనుమతించాలని నిర్ణయించింది. అలాగే అట్టి విదేశీ సంస్థలు తమ వస్తు సేకరణలో 30 శాతాన్ని మన దేశంలోని ఉత్పత్తుల నుంచి కొనుగోలు చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఇష్టంలేని రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు జరపకుండా ఉండే స్వేచ్ఛ ఇచ్చింది. నాడు తీవ్రంగా అడ్డుపడిన బిజెపి, ఇప్పుడు అధికారంలో ఉండి ఎఫ్‌డిఐని ఆటోమేటిక్ రూట్‌లో 100 శాతం అనుమతించటమేగాక 30 శాతం కొనుగోలు నియమాన్ని ఐదేళ్లపాటు ఎత్తివేసింది. బిజెపి రెండు నాల్కల ధోరణికిది ప్రత్యక్ష నిదర్శనం.