Home ఎడిటోరియల్ వచ్చే ఎన్నికల్లో నీళ్లకే పట్టాభిషేకం

వచ్చే ఎన్నికల్లో నీళ్లకే పట్టాభిషేకం

Heavy Flood water to Kadem project in Nirmal District

తమ కృషి, పనితీరుకు అనుగుణంగానే ఎన్నికలలో ప్రజలు తమ వైపు ఉంటారనేది ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు బోధపడింది. బూటకపు వాగ్దానాలు, తప్పు డు మేనిఫెస్టోలకు కాలం చెల్లింది. ఒకప్పటిలా ప్రజలు తాత్కాలికగా లబ్ది కోరుకోవడం లేదు, వాళ్ళు శాశ్వతంగా వారి సమస్యలకు పరిష్కారం కోరుకుంటున్నారు. ప్రజ ల సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే ప్రభుత్వాలు చేయాల్సింది ప్రజల నిత్యావసరాలు, పరిశ్రమలకు ముఖ్యంగా వ్యవసాయానికి కావాల్సింది నీరుకి కొరత లేకుండా చూడడం. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీటి మీదే తమ భవిష్యత్తును కేంద్రీకృతం చేశాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని సంవత్సరాలు గడిచినా అంతర్రాష్ట్ర వివాదాలు, నిధుల కొరత, భూసేకరణ సమస్యలు, అటవీ శాఖ అనుమతులు రాకపోవడం, కోర్టు వివాదాలు, కేసులతో ప్రాజెక్టులు నత్తనడక నడిచాయి. పాలకులకు చిత్తశుద్ధి లేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి అంతే కానీ సమస్యలకు పరిష్కారం లేక కాదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కల్వకుర్తి ప్రాజెక్టు చేపట్టి 30 సంవత్సరాలు గడిచాయి. సమైక్య రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు మాత్రం దశాబ్దాల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోయాయి. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలు ఏళ్ల తరబడి ఫైళ్లలోనే మగ్గుతూ వచ్చాయి.నీళ్లు మాత్రం పారలేదు.
టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉడుం పట్టు తో చేసిన పనుల ఫలితం ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నది. పచ్చటి పొలాలతో కళకళలాడుతున్న గ్రామాలే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ప్రజలకు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే ముఖ్యమంత్రులు కాదు కావాల్సింది, ఆ ప్రాజెక్ట్ లను పూర్తి చేసే ముఖ్యమంత్రులు. అది కెసిఆర్ ఒక్కడే అని ప్రజలు నమ్ముతున్నారు. ఆ నమ్మకం కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తవడంతో బలపడుతుంది. ఇక కెసిఆర్‌కి తిరుగుండదు. కాళేశ్వరంతో తెలంగాణలో ఇక సామాజిక ఆర్థిక మార్పు స్పష్టంగా కనబడబోతున్నది. పంటల దిగుబడులు గతంలో ఎన్నడూ లేనంతగా పెరుగుతాయి. బంగారు తెలంగాణ కళ్లారా చూసే అవకాశం త్వరలోనే రాబోతుంది. తెలంగాణను అన్నిరంగాలలో అగ్రగామిగా నిలపడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తెలంగాణ అభ్యున్నతికి, ఉజ్వల భవిష్యత్తుకు ఇది శుభారంభం.
‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న ప్రాజెక్టులు అనుమతులు, వనరులు అన్నీ ఉన్నా కేంద్ర నాయకులకు కెసిఆర్ కున్న విజన్ , పట్టుదల, చిత్తశుద్ధి లోపించిన కారణంగా నిర్లక్ష్యానికి గురై, ఎన్నో కేంద్ర ప్రాజెక్ట్‌లు ఏళ్ల తరబడి ఫైళ్ళలోనే చెదలు పడుతున్నాయి. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం భారతదేశంలో అరవైకి పైగా ఉన్న చిన్న, పెద్ద నదులను అనుసంధానం చేయడమే దీనికి శాశ్వత పరిష్కారం.
కెసిఆర్ లాంటి నాయకుడి వల్లే ఇది సాధ్యం. ఉత్తర,- మధ్య భారతదేశంలో కర్ణావతి నదిపై ఒక ఆనకట్ట నిర్మించి 227 కిలోమీటర్ల మేర కాలువ నిర్మించి కర్ణావతి నదిని బేత్వా నదితో అనుసంధానం చేయడం, యమునా నదికి ఉపనదులైన ఈ రెండు నదుల అనుసంధాన ప్రాజెక్ట్ లాంటి బృహత్తర ప్రణాళికలు మోడీ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నదుల అనుసంధానం నత్తనడకన సాగుతున్నది.
వీటిని పూర్తి చేయడం కమిట్మెంట్ ఉన్న కెసిఆర్ లాంటి నాయకుడి వల్లే అవుతుంది. దీనికొక్క చిన్న ఉదాహరణ ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ 462 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలెట్టిన గంగానదీ జలశుద్ధి ప్రాజెక్ట్ నుండి మొదలు ఈనాటి నరేంద్ర మోడీ 2014 ఫిబ్రవరి నాటికే 939 కోట్ల రూపాయల నిధులు ఖర్చుచేసినప్పటికీ గంగానదీ ప్రక్షాళన ప్రాజెక్టు లక్ష్యం చేరుకోకపోవడం రాజకీయనేతల బాధ్యతా రాహిత్యానికి అద్దం పడుతున్నది.
దేశానికి ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత దేశ కమిట్మెంట్ ఉన్న కెసిఆర్ లాంటి నాయకుడు ఉంటేనే ఈ నదులు అనుసంధానమై భారతీయుల చిరకాల కోరిక నీటిసమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. భారతదేశం వెలిగిపోతుందని వింటూ వస్తున్నాం తప్ప ఆ వెలుగును చూడలేదు. ఇప్పుడు కెసిఆర్ నాయకత్వంలో వెలుగులను విరజిమ్మే భారతదేశాన్ని చూద్దాం..

నాగేందర్ రెడ్డి కాసర్ల
(అధ్యక్షుడు టిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా)