Home రాష్ట్ర వార్తలు తెలంగాణ: 2017 రౌండప్

తెలంగాణ: 2017 రౌండప్

Parties

కారు… పదవుల జోరు

మన తెలంగాణ/ హైదరాబాద్ : టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారం చేపట్టిన మూడేళ్ళ తరువాత ఈ ఏడాది పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించారు. గత ఏడాది రాజకీయ పునరేకీకరణలో భాగంగా వివిధ పార్టీల నుండి ఎంఎల్‌ఏలు, ఎంపిల చేరికలతో గడిచిపోయింది. ఈ ఏడాది ఎంఎల్‌ఏల పనితీరుపై సర్వేలు, పార్టీ కమిటీలు, పదవుల నియామకాలతో కోలాహలంగా సాగింది. ముఖ్యంగా ఎంఎల్‌ఏలపై సర్వేలు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మూడుసార్లు నిర్వహించిన సర్వేల్లో ఇప్పటి కిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టిఆర్‌ఎస్‌కు 106 స్థానాలని ఒకసారి, 111 స్థానాలు వస్తాయని మరోసారి టిఆర్‌ఎస్‌ఎల్‌పి సమావేశాల్లో సిఎం వెల్లడించారు. అలాగే ఎంపిలకు సంబంధించిన సర్వే వివరాలను ఒక్కసారే బయట పెట్టారు. ఒక సర్వేలో ఐదుగురు మంత్రులకు 50 శాతం కంటే తక్కువ ప్రజామోదం లభించడం కలకలం సృష్టించింది. దీంతో మంత్రులు, ఎంఎల్‌ఏలు తమ పనితీరు మెరుగుపరుచుకోవడంలో తలమునకలయ్యారు. అధికార పార్టీ ఎంఎల్‌ఏలు మరింత చురుకుగా మారేందుకు ఈ సర్వేలు ఉపయోగపడ్డాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
పార్టీలో కీలక మార్పులు : ఈ ఏడాది ఏప్రిల్ నెలలో హైదరాబాద్‌లో ప్లీనరీ నిర్వహించి పార్టీ నిర్మాణంలో పలు కీలక మార్పులు తీసుకువచ్చారు. గతంలో రెండేళ్ళు ఉన్న పార్టీ అధ్యక్ష పదవి, కమిటీల కాలవ్యవధిని నాలుగు సంవత్సరాలకు పెంచారు. అంతే కాకుండా అనూహ్యం గా జిల్లా కమిటీలను ఎత్తివేసి, వాటి స్థానంలోఅసెంబ్లీ నియోజకవర్గాల కమిటీలను ఏర్పాటు చేస్తూ పార్టీ నిబంధనావళిని మార్చారు. నియోజకవర్గంలో జరిగే మంచి చెడూ, గెలుపోటములకు ఎంఎల్‌ఏలనే బాధ్యులుగా చేస్తూ కెసిఆర్ కొత్త వ్యూహాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఎంఎల్‌ఏనే సర్వాధికారులుగా మారుస్తూ పార్టీ నియోజకవర్గ కమిటీలకు వారినే అధ్యక్షులుగా నియమించారు. ఎంపిలైనా, ఎంఎల్‌సిలైనా ఆ నియోజకవర్గంలో ఎంఎల్‌ఏ ఆధ్వర్యంలోని కమిటీలో పని చేయాల్సిందే. ఎవరైనా ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదన్న కెసిఆర్ స్పష్టం చేశారు.

ఇప్పటికే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎంఎల్‌ఏ గంపా గోవర్ధన్‌ను ఇబ్బంది పెడుతున్న ఎంఎల్‌సి భూపతిరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలనే తీర్మానం ద్వారా బలమైన సంకేతాలిచ్చారు. సభ్యత్వం విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 72 లక్షల సభ్యత్వంతో టిఆర్‌ఎస్ రికార్డు సృష్టించిందని ప్లీనరీలో సిఎం ప్రకటించారు. సుదీర్ఘ విరామం తరువాత సెప్టెంబర్‌లో పార్టీ రాష్ట్ర కమిటీని వేశారు. టిఆర్‌ఎస్ ఏర్పడినప్పటి నుండి అధినేత కెసిఆర్‌కు తెరవెనుక చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్న టిన్యూస్ ఎండి జోగినేపల్లి సంతోష్‌రావును పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం కీలక పరిణామం. రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ సంఘాల కమిటీల ఏర్పాటు పూర్తయినప్పటికీ ముఖ్యమైన పొలిట్‌బ్యూరోను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఈ ఏడాది పెద్ద ఎత్తున పదవుల పందేరం సాగింది. కార్పొరేషన్ పదవుల్లో పార్టీ కష్టనష్టాల్లో నిలబడ్డ అనేక మందికి పదవులు లభించడం ఊరట కలిగించింది.

కలవని పాత కొత్త : పాత, కొత్త నాయకులు, కార్యకర్తల మధ్య అంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధినేత కెసిఆర్ పాత కొత్త తేడా లేకుండా అందరూ పాలు నీళ్ళలా కలిసి పోవాలని ఎన్ని సార్లు చెప్పినప్పటికీ వారి మధ్య పొసగక గొడవలు వస్తూనే ఉన్నాయి. తాండూరులో మంత్రి సమక్షంలోనే టిఆర్‌ఎస్ నాయకుడు అయూబ్ ఖాన్ ఉద్యమ కాలం నుండి ఉన్న తనకు పదవుల్లో ప్రాధాన్యం లభించలేదని ఆత్మాహుతికి పాల్పడి మరణించిన విషాధ ఘటన ఈ ఏడాది చోటు చేసుకుంది. గత ఏడాది వరకు ఇతర పార్టీల నుండి ఎంఎల్‌ఏలను చేర్చుకున్న టిఆర్‌ఎస్ ఈ ఏడాదిలో బలమైన మాజీ ఎంఎల్‌ఏలు, పోటీ చేసి ఓడిపోయిన వారిని పార్టీలో చేర్చుకుంది.

టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏల చేతిలో ఓడిపోయిన మాజీ ఎంఎల్‌ఏ రమేశ్ రాథోడ్(ఖానాపూర్), మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి(భువనగిరి), గండ్ర సత్యనారాయణరావు(భూపాలపల్లి) వంటి వారు ఉన్నారు. ఇతర పార్టీల నుండి చేరిన ఎంఎల్‌ఏలు నాయకులను సర్దుబాటు చేసేందుకు నియోజకవర్గాల పునర్విభజనపైనే సిఎం కెసిఆర్ ప్రధానంగా ఆధారపడ్డారు. ఒకవేళ అది జరగనట్లయితే వారిని సర్దుబాటు చేయడమే టిఆర్‌ఎస్‌కు పెద్ద సవాలుగా నిలిచే అవకాశముంది. ఇప్పటికే ఖానాపూర్‌లో సిట్టింగ్ ఎంఎల్‌ఏ రేఖా నాయక్, రమేశ్ రాథోడ్ వర్గాల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. ఈ ఏడాది టిఆర్‌ఎస్ నాయకులు కొందరిపై అవినీతి, అక్రమాలు, బెదిరింపు వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా కలెక్టర్‌లతో ఎంఎల్‌ఏలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్ నాయక్‌ల వివాదం, ఇద్దరు మార్కెట్ కమిటీ చైర్మన్‌లు పదవి కోసం ఎంఎల్‌ఏలకు డబ్బులు ఇచ్చామని ఆరోపణలు చేయడం, ఎంఎల్‌ఏలే అధికారులను, ఇతరులను బెదిరించిన ఆడియో బయటకు రావడం వంటివి ఇబ్బంది కలిగించాయి. తెలంగాణ వచ్చాక ప్రతి ఎన్నికల్లో భారీ మెజారిటీలో అప్రతిహత విజయం సాధించిన టిఆర్‌ఎస్ తన అనుబంధ కార్మిక సంఘాన్ని సింగరేణి ఎన్నికల్లో గెలుపించుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.

విరబూయని కమలం

మన తెలంగాణ/హైదరాబాద్: ఈ ఏడాది రాష్ట్ర రాజకీయాల్లో సునామీ సృష్టిస్తామన్న బిజెపి కనీసం టీ కప్పులో తుఫాను కూడా సృష్టించలేకపోయింది. వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని  ప్రకటించినప్పటికీ  కాంగ్రెస్  మాజీ ఎంఎల్‌ఎ నందీశ్వర్‌గౌడ్, టిఆర్‌ఎస్ ఎంపి డి. శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి అరవింద్ మినహా  పేరున్న నాయకులెవరూ కమలం తీర్థం పుచ్చుకోలేదు. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని, రాబోయేది బిజెపి ప్రభుత్వమేనంటూ 2017 సంవత్సరాన్ని ఆరంభించిన బిజెపి నేతలు  అలాంటి వాతావరణం కల్పించకుండానే గడిపేశారు. పైగా కేంద్ర క్యాబినెట్‌లో  రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక తెలంగాణ వ్యక్తి బండారు దత్తాత్రేయను కూడా కేంద్ర మంత్రి పదవి నుండి తప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఒక వైపు రాష్ట్ర నాయక త్వం విమర్శలు, నిరసనలు చేస్తుంటే  మరో వైపు రాష్ట్రానికి వచ్చిన బిజెపి కేంద్ర మంత్రులే  టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పొగడుతుండడాన్ని ఆ పార్టీ నేతలు, క్యాడర్‌కు మింగుడుపడడం లేదు. పైగా ఉన్న నలుగురైదుగురు నాయకుల చుట్టూనే పార్టీ కేంద్రీకృతమవడం, కొత్త వారికి ప్రోత్సాహం లభించకపోవడం వంటి అంశాలు కూడా ఆ పార్టీ వైపు ఇతరులు చూడపోవడానికి కారణంగా చెబుతున్నారు.

నిత్యం క్రియాశీలంగా ఉండే మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి బిజెపిలో చేరిన తరువాత మౌనముద్రలోకి వెళ్ళిపోయారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని  ఈ ఏడాది బిజెపి రాష్ట్ర అధ్యక్షులు  లక్ష్మణ్ నేతృత్వంలో వారం పాటు బస్సు యాత్ర నిర్వహించారు. శాసనసభ జరిగిన సమయంలో నిరుద్యోగ సమస్యలపై బిజెవైఎం ఆధ్వర్యంలో లో అసెంబ్లీని విజయవంతంగా నిర్వహించారు. తెలంగాణలో స్వంతంగా అధికారంలోకి వస్తామని చెబుతున్న బిజెపి ఆశలన్నీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షాపైనే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో అమిత్ షా మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివి ధ పార్టీల నుండి, ముఖ్యంగా కాంగ్రె స్ నుండి చేరికలు ఉంటాయని చెప్ప డంతో అందరి దృష్టి ఆ పార్టీపై నిలి చింది. అందుకు భిన్నంగా ఎలాంటి చేరికలు లేకపోవడంతో క్యాడర్ ఉసూరుమన్నారు. అన్నిటికి మించి అమిత్‌షాపై  సిఎం కెసిఆర్ విరుచుకుపడినా ఆ పార్టీ నేతలు సరిగా కౌంటర్ ఇవ్వకపోవడంతో వారు నిరాశ చెందారు. మరోసారి కొత్త సంవత్సరం  జనవరిలో  అమిత్‌షా, ప్రధాని మోడి రాష్ట్రంలో పర్యటిస్తారని, ఈ సందర్భంగా బిజెపి దిశను నిర్దేశిస్తారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

హస్తం కదనోత్సాహం

మన తెలంగాణ/ హైదరాబాద్ : రెండేళ్ళ పాటు ఎంఎల్‌ఏలు పార్టీని వీడడం, వరుస ఎన్నికల్లో ఘోర పరాజయం పొందడం వంటి ఘటనలతో ఉక్కిరిబిక్కిరైన కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది కొంత కుదుటపడింది. వివిధ అంశాలపై వరుస ఉద్యమాలు, ఇటీవల రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మాజీ ఎంఎల్‌ఏలు, ఇతర పార్టీల నాయకుల చేరిక ద్వారా క్యాడర్‌లో సమరోత్సాహం నెలకొంది. రైతు సమస్యలపై ప్రభుత్వం మీద వత్తిడి తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ సఫలమైంది. ముఖ్యంగా విడతల వారీ రుణమాఫీ వల్ల రైతులపై పడిన వడ్డీ భారాన్ని ప్రభుత్వమే చెల్లించాలని, పాత చట్టం ప్రకారమే భూసేకరణ చేపట్టాలని, మిర్చి, పత్తి రైతులకు మద్దతు ధరనివ్వాలనే అంశాలపై పాలకులను ఎండగట్టంలో విజయవంతమైంది. ఖమ్మంలో మిర్చి రైతులను అరెస్టు చేయడం, బేడీలతో కోర్టుకు తీసుకెళ్ళడం, నేరెళ్ళలో దళితులపై పోలీసుల దాష్టీకంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.

అదే సమయంలో కొన్ని కీలకాంశాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆశించిన స్థాయిలో ఉద్యమాలను చేయలేదనే వాదన కూడా ఉంది. అధికార పార్టీ నేతల పేర్లు వినిపించిన మియాపూర్ భూ కుంభకోణం, నయీం గ్యాంగ్ అరాచకాలు, కబ్జాల వ్యవహారంలో ప్రకటనలకు పరిమితమడమే తప్ప పోరాటాలు నిర్వహించలేదనే వాదన సర్వత్రా వ్యక్తమైంది. రైతు గర్జన పేరుతో సంగారెడ్డిలో నిర్వహించిన రాహుల్‌గాంధీ బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్‌ను నింపింది. అలాగే నోట్ల రద్దుతో సామాన్యుల ఇక్కట్లను జనావేదన సభల ద్వారా జనాల్లో చొచ్చుకెళ్ళారు.ఇక రైతులకు లక్ష రూపాయల వడ్డీ మాఫీ చేసినప్పటికీ, విడతల వారీగా చేయడంతో ఒక్కో రైతుపై పాతిక వేలకు పైగా భారం పడిందని, దానిని ప్రభుత్వమే చెల్లించాలనే డిమాండ్‌ను ముందుకు తీసుకురావడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీనిపై అసెంబ్లీ ముట్టడి నిర్వహించడమే కాకుండా, స్వయంగా ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలంతా అసెంబ్లీ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. చివరకు వడ్డీ మాఫీపై కాంగ్రెస్ నాయకులు రైతుల నుండి దరఖాస్తులు తీసుకువస్తే ఆ మొత్తాన్ని చెల్లిస్తామని స్వయంగా సిఎం కెసిఆర్ చేత అసెంబ్లీలో ప్రకటింపజేయడంలో పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకులు కుందూరు జానారెడ్డిలు సఫలమయ్యారు.

నేరెళ్ళకు మీరాకుమార్ : మంత్రి కెటిఆర్ స్వంత నియోజకవర్గం పరిధిలోని నేరెళ్ళలో ఇసుక మాఫియాపై ఆందోళన చేస్తున్న దళితులు, బిసిలపై స్వయంగా జిల్లా ఎస్‌పి దాష్టీకం చేశారనే ఘటనను కాంగ్రెస్ అందిపుచ్చుకుంది. తొలుత ఈ ఆందోళనను స్థానిక బిజెపి నాయకులు చేపట్టిన్నిప్పటికీ, వెంటనే స్పందించి టిపిసిసి తరుపున వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించడం, ఆ తరువాత రాష్ట్ర కాంగ్రెస్ ఆందోళన చేపట్టడం చోటు చేసుకున్నాయి. దీనికి తోడు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ను కూడా సిరిసిల్లకు రప్పించడం ద్వారా జాతీయ స్థాయికి నేరెళ్ళ ఘటనను తీసుకెళ్ళారు. తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంలో తన వంతు పాత్ర పోషించిన నాటి స్పీకర్ మీరాకుమార్‌కు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతునివ్వాలని కోరడం ద్వారా టిఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో దశాబ్దం పాటు తన ముద్ర వేసిన దిగ్విజయ్‌సింగ్ స్థానంలో ఇంఛార్జ్‌గా డాక్టర్ రామచంద్ర కుం టియా నియమితులయ్యారు.

పై చేయి సాధించిన ఉత్తమ్: రెండేళ్ళ పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం విషయంలో ఏర్పడిన అస్థిరత క్రమంగా తొలిగిపోతున్న సూచనలు కనిపి స్తున్నాయి. నాయకత్వ రేసులో పోటీ పడుతున్న ఇతర నాయకులపై టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పైచేయి సాధించారు. ఢిల్లీ స్థాయిలో సంబంధాలు, రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం ద్వారా పిసిసి అధ్యక్ష పదవికి పోటీ పడిన కోమటిరెడ్డి బ్రదర్స్, డి.కె.అరుణ, ఇతర నాయకులకు చెక్ పెట్టారు. వచ్చే నెలలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే రెండవ సారి టిపిసిసి అధ్యక్షునిగా నియమిం చడం దాదాపు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. అయితే, పార్టీని నడిపించే నాయకుడు అందరినీ కలుపుకుపోవాలని, నాయకత్వం కోసం పోటీపడినవారు పార్టీకి వ్యతిరేకం కాదని గ్రహించాలని పార్టీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు.

వామపక్షాల  పోరుయాత్ర

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై పాదయాత్రలు, బస్సు యాత్రలతో ఏడాది పాటు వామ పక్షాలు నిరంతర కార్యక్రమాలు నిర్వహించాయి. వామపక్షాలకు ప్రజా చైతన్య కార్యక్రమాల కాలంగా 2017 నిలిచింది. టిఆర్‌ఎస్ ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను వామపక్షాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కొంత మేరకు సఫలీకృతమయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రజా ఉద్యమాలకు వేదికగా నిలిచిన ‘హైదరాబాద్‌లోని ‘ఇందిరాపార్క్ ధర్నా చౌక్’ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయడాన్ని నిరసిస్తూ, తెలంగాణ జెఎసి భాగస్వామ్యంతో వామపక్షాల ఆధ్వర్యంలో సాగిన ‘ధర్నా చౌక్ పరిరక్షణ’ ఉద్యమం ప్రముఖంగా నిలిచింది. ఈ పోరాటానికి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రజా ఉద్యమాల పట్ల ప్రభుత్వ వైఖరిపై ప్రజలను ఆలోచింపజేసింది. సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధుంభవన్‌లో నెల రోజుల పాటు ప్రజా సంఘాలు నిరహార దీక్షలు చేయడం ఉద్యమంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ ఉద్యమంలో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో సిపిఐ కీలక పాత్ర పోషించింది. ధర్నా చౌక్ పరిరక్షణ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి జంతర్‌మంతర్‌లో రెండు రోజులు నిరసన నిర్వహించడం ద్వారా దేశం దృష్టిని ఆకట్టుకుంది. ‘ఆక్యుపై ధర్నా చౌక్’ ఉద్యమం వామపక్ష, ప్రజా సంఘాలకు, తెలంగాణ జెఎసికి నైతిక విజయాన్ని అందించింది. మరోవైపు ఇసుక లారీల కింద ప్రాణాలు కోల్పోయిన నేరేళ్ళ బాధితులకు న్యాయం కోసం జరుగుతున్న పోరాటాన్ని ప్రతిపక్షాలతో కలిసి వామపక్షాలు సిపిఐ ఎంపి డి.రాజా నేతృత్వంలో రాష్ట్రపతిని కలవడం బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసాను కల్పించింది.

‘సామాజిక తెలంగాణ సమగ్రాభివృద్ధి’ నినాదంతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నేతృత్వంలోని నాయకుల బృందం నిర్వహించిన ‘పోరుబాట’ బస్సు యాత్ర కమ్యూనిస్టు పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని కలిగించడమే కాకుండా టిఆర్‌ఎస్ ప్రభుత్వ హామీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామన్న ధీమా శ్రేణుల్లో గోచరిస్తుంది. దాదాపు 7000 కిలోమీటర్ల పాటు యాత్ర చేయడం ద్వారా సిపిఐ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టింది. జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిణామల నేపధ్యంలో లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో కలిసికట్టుగా సిపిఐ ముందుకు సాగుతున్నది.‘సామాజిక న్యాయం’ ఎజెండాగా సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలోని నాయకుల బృందం గత ఏడాది అక్టోబర్‌లో చేపట్టిన ‘మహాజన పాదయ్రాత’ ఈ ఏడాది మార్చి 20వ తేదీన ముగిసింది. పాదయాత్రకు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలతో పాటు ముఖ్యంగా సామాజిక న్యాయ నినాదమెత్తుకోవడం కుల సంఘాలు గ్రామాల్లో పాదయాత్రతో కలిసివచ్చాయి.

మొత్తం 154 రోజులు, 4200 కిలోమీటర్ల పొడవునా పాదయాత్ర చేసిన తమ్మినేని వీరభద్రం తెలంగాణకు వ్యతిరేకమనే ముద్రపడిన సిపిఐ(ఎం)కు తిరిగి ప్రజాదరణను తీసుకువచ్చేందుకు ప్రయత్నించినట్లు కనబడింది. సామాజిక న్యాయం కోసం బహుజన వామపక్ష కూటమి ఏర్పాటుకు సిపిఐ(ఎం) ప్రయత్నిస్తుంది. వామపక్షాల ఐక్యత అని సిపిఐ(ఎం) అంటున్నప్పటికీ, సింగరేణి ఎన్నికల్లో అన్ని పక్షాలు సిపిఐ అనుబంధమైన ఎఐటియుసికి మద్దతునివ్వగా, సిపిఐ(ఎం) అనుబంధ సిఐటియు మాత్రం ఎన్నికల బరిలో దిగింది. ప్రభుత్వం చేపట్టిన ‘హరితహరం’ వల్ల పోడు సాగుదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఐ, సిపిఐ(ఎంఎల్) న్యూడెమాక్రసీ ఉభయ పార్టీలు పెద్దఎత్తున పోరాటాలు చేశాయి. డి.వి.కృష్ణ నేతృత్వంలోని సిపిఐ(ఎంఎల్) న్యూడెమాక్రసీ పోడుసాగుదారుల సమస్యలపై ఆదిలాబాద్ నుంచి జాతా నిర్వహించింది. మరోవైపు సిపిఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ నాయకులు కె.గోవర్ధన్ నేతృత్వంలో మహాబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో వేలాది మందితో రెండు బహిరంగ సభలను నిర్వహించి పోడుసాగుదారులకు అండగా నిలిచింది.తెలంగాణ సాధన ఉద్యమంలో సాంస్కతికంగా క్రియాశీలపాత్ర పోషించిన అరుణోదయ సాంస్కృతిక సంస్థ నాయకురాలు విమలక్క కార్యాలయంపై పోలీసులు దాడి చేయడాన్ని అన్ని వర్గాలు ఖండించాయి. ధర్నా చౌక్ పరిరక్షణ, మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు, పోడు సాగుదారులకు, నేరేళ్ల బాధితులకు న్యాయం కోసం, టిఆర్‌ఎస్ ప్రభుత్వ హామీల అమలు కోసం సాగిన పలు ఉద్యమాలు, ఆందోళనలతో సిపిఐ, సిపిఐ(ఎం), సిపిఐ(ఎంఎల్) న్యూడెమాక్రసీ, ఎంసిపిఐ, సిపిఐఎంఎల్, ఎస్‌యుసిఐయు, ఆర్‌ఎస్‌పి, ఎస్‌యుసిఐసి, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ తదితర వామపక్ష పార్టీలు క్రియాశీలకంగా మారాయి. ఏడాది చివరలో మావోయిస్టు నేత జంపన్న మూడున్నర దశాబ్దాల అజ్ఞాత జీవితాన్ని వీడి పోలీసులకు లొంగిపోయిన ఘటన, భద్రచలంలోని సిపిఐ(ఎంఎల్) సిపి బాట పార్టీకి చెందిన 8 మంది నాయకుల ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.

సైకిల్ కుదేల్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర టిడిపికి ఈ ఏడాది చేదు అనుభవాలనే మిగిల్చింది. ఓటుకు కోట్లు కేసు దెబ్బ, 12 మంది టిడిపి ఎంఎల్‌ఎలతో పాటు కీలక నేతలు గడిచిన రెండేళ్ళలో అధికార టిఆర్‌ఎస్‌లో చేరడంతో చిధ్రమైన టిడిపి, ఈ ఏడాది రేవంత్ రెడ్డితో పాటు పలువురు మాజీ ఎంఎల్‌ఏలు, నియోజకవర్గ అధ్యక్షులు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో పార్టీ పూర్తిగా కుదేలైంది. ఏడాది తొలినాళ్ళలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి కాస్త దూకుడు పెంచి, పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన తెలంగాణ టిడిపి మహానాడు సమావేశాలకు వారే ఊహించని రీతిలో పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరై జోష్ నింపారు. అయితే మొదటి నుం డి కాంగ్రెస్‌తో పొత్తుండాలని పట్టుబడుతున్న రేవంత్‌రెడ్డికి ఆ పార్టీలో సీనియర్ నేతలు ఎల్. రమణ, మోత్కుపల్లి నర్సింహులు వంటి వారు బాహాటంగానే వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇక తనకు టిడిపిలో భవిష్యత్తు లేదని నిర్థారణకు వచ్చిన రేవంత్‌తో పాటు టిడిపిలో క్రియాశీలంగా వ్యవహరించే నాయకులు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి కూడా కాంగ్రెస్‌లో వెళ్తారని భావించినా టిఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో తెలంగాణలో టిడిపి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణలో సరైన నాయకుడు లేకపోవడంతో కార్యకర్తలు తమ భవిష్యత్తును వెతుక్కునే పనిలో పడ్డారు.టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు వారిని ఆకర్షించడంలో తలమునకలయ్యాయి.