Home మంచిర్యాల అన్ని హంగులతో ఆధునీకరిస్తాం

అన్ని హంగులతో ఆధునీకరిస్తాం

 

talk

రూ. 40 కోట్లతో అభివృద్ధి పనులు
తాగునీటి సమస్య శాశ్వతంగా దూరం చేస్తాం
హైటెక్ సిటీ పార్కు కోసం రూ. 3 కోట్లు
భూదాన్ భూముల్లో ఇండోర్ స్టేడియం ఏర్పాటు
పెద్దపల్లి ఎంపి బాల్కసుమన్

మనతెలంగాణ/మంచిర్యాలప్రతినిధి ః మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని అన్ని హంగులతో ఆధునీకరించేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ సమితి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై  ప్రసంగించారు. జిల్లా  కేం ద్రంలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను  ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని రూ.40 కోట్ల ప్రణాళికలతో తగిన నివేదికను రూపొందించి మూడు రోజుల్లోగా అందించాలన్నారు. జిల్లా కేంద్రంలో ఇంటి స్థలాల అనుమతుల పర్యవేక్షణ రోజు వారీగా ఉండాలనీ, పనులు  పారదర్శకంగా జరిగే విధంగా చూడాలన్నారు.  పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు   తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.  నగరంలో హైటెక్ సిటీ పార్కు అభివృద్ధికి రూ. 3 కోట్లు , మరో 4 పార్కుల ఏర్పాటుకు  ఒక్కోక్క దానికి రూ. కోటి చొప్పున నిధులతో రోడ్డుకు ఇరువైపులా సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని సూచించారు. మైనార్టీ, క్రిస్టియన్ ఫంక్షన్ హాల్ కోసం ప్రతి పాదన తయారు చేయాలని, స్మశాన వాటికలో  ఆధునీకరణ పనులు, పచ్చదనం కోసం రాళ్ల వాగు, గోదావరి నది తీరం కనీసం రెండు ఎకరాల స్థలం కేటాయించి, మౌళిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. విద్యుత్ సౌకర్యం, అంతర్గత రోడ్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  గర్మిళ్ల శివారులోనే భూదాన్ భూముల్లో  ఒక ఇండోర్ స్టేడియం, మరో అవుట్ డోర్ స్టేడియం, ఈత కొలనుల ఏర్పాటు కోసం రూ. 3 కోట్లు వెచ్చించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  రాముని చెరువు ప్రక్షాళన, పిల్లల పార్కు, వాకింగ్ ట్రాక్, బోటింగ్, లైటింగ్ సదుపాయాలతో  మినీట్యాంక్ బండ్, ఓపెన్ జిమ్, తరహాలో  రూ.5 కోట్ల  నిధులతో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.  పోచమ్మ చెరువు, తిలక్‌నగర్ చెరువు, సాయి కుంట కుమ్మరి కుంట చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, శాశ్వత హద్దులను ఏర్పాటు చేసి, అభివృద్ధి చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో కూరగాయలు, మటన్ మార్కెట్లను అభివృద్ధి చేయాలని వివిధ ప్రాంతాలలో ప్రజల సౌకర్యార్థం మూత్రశాలలు నిర్మించాలన్నారు. కమ్యూనిటీ హాళ్ల  నిర్మాణాలు చేపట్టడంతో పాటు  డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో  పాత్రికేయ సంఘాల ప్రతినిధుల వినతి మేర కు  ప్రెస్‌క్లబ్ కోసం  స్థలాన్ని కేటాయించేందుకు  మం చిర్యాల ఆర్‌డిఓకు  ఆదేశాలు జారీ చేశారు. సత్వరమే స్థల సేకరణ  కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి ఎంపి కోటా నుంచి నిధులు విడుదల చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎంఎల్‌ఏ నడిపెల్లి దివాక ర్‌రావు, ఎంఎల్‌సి పురాణం సతీష్‌కుమార్, మున్సిపల్ చైర్మన్  వసుంధర రమేష్,  ఆర్‌డిఓ శ్రీనివాస్, సిపిఓ సత్యనారాయణరెడ్డి,  మున్సిపల్ కమీషనర్ శ్రీకాంత్, ఆర్‌డబ్లుఎస్ ఎస్‌ఇ  శ్రీనివాస్‌తో పాటు పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.