Home లైఫ్ స్టైల్ తండ్రి ఆస్తికి పిల్లలంతా హక్కుదారులే

తండ్రి ఆస్తికి పిల్లలంతా హక్కుదారులే

హిందూ వారసత్వ చట్టం 1986 ప్రకారం తండ్రి ఆస్తికి పిల్లలంతా ఆడ, మగ హక్కుదారులే. కనుక మీ అమ్మగారి సంతకం మాత్రమే వున్నంత మాత్రాన చెల్లదు. మీరు మీ తమ్ముడితో కాంట్రాక్టు కుదుర్చుకున్న బిల్డర్‌కి, మీ తమ్ముడికి కూడా లీగల్ నోటీసులు ఇవ్వండి. మీకు నలుగురు అక్క చెల్లెళ్లకు, తలా ఒక షేర్ ఇవ్వాలి. అలాగే మీ అమ్మగారు వుంటున్న బిల్డింగు అమ్మినా దాంట్లో కూడా మీ నల్గురుకీ షేర్ వుంటుంది. కనుక ముందుగా మీ అమ్మగారూ, మీ నలుగురు అక్కాచెల్లెళ్లు, మీ తమ్ముడు కలిసి సామరస్యంగా మాట్లాడుకోండి. 

Parents-Children-Properties

సమస్య : మా అక్కచెల్లెళ్ల ఉమ్మడి సమస్య. మా నాన్న గారికి మేము నలుగురం ఆడపిల్లలం. మాకు ఒక తమ్ముడు (విక్రమ్). మా నాన్న గారు వంశానికి వారసుడు కావాలని ఆశతో వాడ్ని మా నలుగురు తర్వాత కన్నారు. మా నాన్నకు వాడంటే చాలా ప్రేమ. మా అక్క చెల్లెళ్లందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి. మాకు ఆరు ఎకరాల పొలం మా ఊళ్లో వుంది. అలాగే మా అమ్మ వాళ్లు వుంటున్న బిల్డింగ్‌కాక, ఒక పెద్ద మూడు పోర్షన్ల ఇల్లు (ప్రస్తుతం అది కిరాయిలకు ఇచ్చేశాము) దాని వెనకాల మరో ఇల్లు అయ్యేంత స్థలం వుంది. మా నాన్న గారు మా పెళ్లిళ్ళు అయ్యాక చనిపోయారు. ఆస్తికి సంబంధించి ఏ రకమైన వీలునామా రాయలేదు. మా నాన్న గారిది పెద్ద బట్టల షోరూమ్. ఇప్పుడు అది తమ్ముడు చూసుకుంటున్నాడు. అమ్మకు వాడంటే చాలా ప్రేమ కనుక వాడ్ని గారాబం చేసింది. వాడు మా ఎవ్వరికీ తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నా, అమ్మ వాడ్ని సమర్థించింది. వాడు అమ్మతో సంతకం పెట్టించుకొని, మాకు తెలియకుండా కిరాయిలు వస్తున్న ఇల్లు, దాని వెనుక స్థలం ఒక బిల్డర్‌కి కాంట్రాక్ట్ ఇచ్చాడు. అది ఐదు ఫ్లోర్స్ వేసి మొత్తం 20 ప్లాట్స్ కట్టి అందులో 10 ప్లాట్స్ తమ్ముడికి ఇచ్చేటట్లు రాయించుకున్నాడు. అది మా నాన్న పేర వున్న ఆస్తి. మేము సంతకాలు పెట్టలేదు. మాకు హక్కు వుందా? లేదా? మేము ఏం చేయాలి? ప్లీజ్ సలహా చెప్పండి.

– దేవికారాణి, చేవెళ్ల

సలహా : చూడమ్మా దేవికారాణి. నువ్వు రాసిన ఉత్తరం ద్వారా నీ సమస్య అర్థమైంది. కేవలం మగ పిల్లాడైతే ఇంటికి వారసుడు అనే భావన మీ తల్లిదండ్రులకే కాదు, చాలా మందిలో వుంది. మీ అమ్మగారు ఒకే కొడుకని గారాబంగా చూడడాన్ని మీ తమ్ముడు అలుసుగా తీసుకుని కేవలం ఆవిడ సంతకం మాత్రమే తీసుకుని, ఆస్తి విషయంలో మీ ప్రమేయం (అక్కల ) లేకుండా, మిమ్మల్ని సంప్రదించకుండా, తన ఇష్టానుసారంగా చేస్తున్నాడు. అయితే ఆస్తి మీ నాన్న గారి పేర వున్నదని రాశారు. అయితే, దానిపై మీ అందరికీ (సంతానానికి) హక్కు వుంది. హిందూ వారసత్వ చట్టం 1986 ప్రకారం తండ్రి ఆస్తికి పిల్లలంతా ఆడ, మగ హక్కుదారులే. కనుక మీ అమ్మగారి సంతకం మాత్రమే వున్నంత మాత్రాన చెల్లదు. మీరు మీ తమ్ముడితో కాంట్రాక్టు కుదుర్చుకున్న బిల్డర్‌కి, మీ తమ్ముడికి కూడా లీగల్ నోటీసులు ఇవ్వండి. మీకు నలుగురు అక్క చెల్లెళ్లకు, తలా ఒక షేర్ ఇవ్వాలి. అలాగే మీ అమ్మగారు వుంటున్న బిల్డింగు అమ్మినా దాంట్లో కూడా మీ నల్గురుకీ షేర్ వుంటుంది. కనుక ముందుగా మీ అమ్మగారూ, మీ నలుగురు అక్కాచెల్లెళ్లు, మీ తమ్ముడు కలిసి సామరస్యంగా మాట్లాడుకోండి. మీ తమ్ముడు సమ న్యాయానికి ఒప్పుకోనిచే మీరు చట్టాల్ని ఆశ్రయించవచ్చు. కోర్టు ద్వారా మీకు న్యాయం జరుగుతుంది.

కోర్టులో పిటిషన్ ఫైల్ చేయండి

సమస్య : నేను మా కూతురు గురించి రాస్తున్నాను. మా వారు ప్రభుత్వ ఉద్యోగి. మాకు ఇద్దరు సంతానం. బాబు లండన్‌లో జాబ్ చేస్తున్నాడు. పేరు శ్రీకాంత్. పాప ఇక్కడే బి.కామ్ చదివింది. పేరు నీలిమ. మా వారికి పాప అంటే ప్రాణం. ఎంతో ప్రేమగా పెంచారు. కోరిందల్లా కొనిచ్చేవారు. ఫ్రెండ్స్‌తో సినిమాలు, షికార్లు దేనికీ అడ్డు చెప్పేవారు కాదు. మా వారికి పాపని వాళ్ల చెల్లెలు కొడుక్కి (అనిల్) ఇచ్చి పెళ్లి చేయాలని వుంది. అయితే, మా ప్రమేయం లేకుండా ప్రేమించిన పెళ్లి చేసుకొని నగేష్ అనే అబ్బాయిని తీసుకొని మెడలో పూలదండలతో ఇంటికి వచ్చింది. మేము షాక్ అయ్యాం. ఆయన కోపంతో వెళ్లిపో అని పంపించేశారు. ఆ తర్వాత ఆయన లేనప్పుడు వచ్చి నా కాళ్ల మీద పడి ఏడ్చింది. తప్పు చేశానంది. కానీ మీ నాన్న కోపం తగ్గలేదని చెప్పాను. మౌనంగా వెళ్లిపోయింది. ఒకరోజు ఫోన్‌లో నాకు ఏదో చెబుదామని ఏడ్చి ఏడ్చి ఫోన్ పెట్టేసింది. నన్ను తనుండే ఇంటికి రమ్మని మరి మరి చెబుదామని అనుకుంటున్నాను. ఆకస్మాత్తుగా ఒకరోజు మీ అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయిందని ఫోన్ వచ్చింది. నేను షాక్‌కి గురయ్యాను. మా వారు కోపం, బాధ రెండూ దిగమింగు కోలేకపోయారు. ఎవరికీ చెప్పుకోలేక గుట్టుగా అంత్యక్రియలు పూర్తి చేశాము. మూడు వారాలు గడిచిపోయాయి. కానీ నాకెందుకో ఇది హత్యలా అనిపిస్తుంది. ఎందుకంటే మెడ చుట్టూ గోటితో గాట్లు, చేతితో గట్టిగా పిసికిన ఆనవాళ్ళు నాకు కనిపించాయి. కానీ ఇప్పుడు పోస్టుమారం చేయించడం కుదురుతుందా?

– శారద

సలహా : శారదా గారూ. ఒక తల్లిగా మీరు పడుతున్న బాధ నాకు అర్థమైంది. ఇంత దారుణమైన పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. మీరు తల్లిదండ్రులుగా స్వేచ్ఛని, సంతోషంతో ప్రేమగా పెంచారు. కానీ మీకు విషాదం మిగిల్చి, ఘోరంగా తనువు చాలించింది మీ పాప. అయితే మీరు రాసిన ప్రకారం మూడు వారాలు దాటిపోయాయి అంటున్నారు. అలాంటపుడు పోస్టుమార్టమ్ కష్టమే. మీరు కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి, కోర్టు అనుమతితో పోస్టుమార్టమ్ చేయించవచ్చు. మీరు ముందుగా పి.ఎస్.లో ఫిర్యాదు చేసి వుండి వుంటే వెంటనే శవపంచనామా జరిపి, శవాన్ని పరీక్షకోసం ఆసుపత్రికి పంపిస్తారు. వెంటనే డాక్టర్లు దానికి శవపరీక్ష చేస్తారు. దాన్ని పోస్టుమార్టమ్ అంటాము. శవంపై ఎక్కడెక్కడ గాయాలు వున్నాయి, గోళ్ల రక్కులు, అన్నీ రాస్తారు. ఒక్కో గాయాన్ని వివరంగా పొడవు, లోతు కొలిచి, ఏం ఆయుధం ఉపయోగించి గాయపరిచారో అన్నీ వివరంగా రాస్తారు. పైన వున్న గాయాలు పరీక్షించాకా శరీరపు లోపలి భాగాల్లో కూడా గాయాలున్నాయో, లేవో పరీక్షిస్తారు. చనిపోయే ముందు ఏమైనా గాయాలున్నాయా? చనిపోక ముందు లేదా తర్వాత అనేది తేల్చేస్తారు. అలాగే తీసుకున్న ఆహారం వల్లనా లేదా అనేది కూడా పరీక్షిస్తారు. తిన్న ఎంతసేపటికి మరణించారనేది కూడా తెలిసిపోతుంది. శవపరీక్షలో హత్యా, ఆత్మహత్యా అన్నది తేలిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఫలితాలను (పోలీస్ లేదా డాక్టర్స్)తారుమారు చేసే అవకాశాలు కూడా వుంటాయి.