Home జిల్లాలు అన్నదాతలకు అన్నీ కష్టాలే!

అన్నదాతలకు అన్నీ కష్టాలే!

wastreధాన్యం కొనుగోలు కేంద్రాలలో రోజుల తరబడి పడిగాపులు
కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బు చెల్లింపులు నిల్
చిరిగిన గన్నీ బ్యాగులతో తప్పని తిప్పలు
ధాన్యం రవాణా లారీల ఏర్పాటులో అధికారులు విఫలం
రెండేళ్లుగా హమాలీల కూలీ డబ్బును జమ చేయని సర్కార్
నల్లగొండ ప్రతినిధి:జిల్లాలో విలయతాండవం చేస్తున్న కరువు పరిస్థితులకు ఎదురొడ్డి ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనై రబీ సీజన్‌లో సాగు చేసిన పంటల ధాన్యం దిగుబడులను విక్రయించుకునేందుకు జిల్లాకు చెందిన అన్నదాతలు కన్న కష్టాలను ఎదుర్కోవల్సి వస్తోంది. జిల్లాలో రబీ ధాన్యం దిగుబడులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు అరకొరగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. విక్రయానికి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులు తాము తెచ్చిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు పది నుంచి ఇరువై రోజుల పాటు పడిగాపులు కాయాల్సి వస్తోందంటే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ళు ఏ విధంగా సాగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. బస్తాలుంటే.. హమాలీలు ఉండరు, చినిగిన బస్తాలు తప్ప, కొత్త గన్నీ బ్యాగులు ఉండవు, ధాన్యం బస్తాలను కుట్టేందుకు పురికోస ఉండదు. రైతన్నలే పురికోసను తెచ్చుకోవాలే. ఇక హామాలీలు రైతులు తెచ్చిన ధాన్యాన్ని కాంటా వేసేందుకు తమ ఇష్టానుసారంగా డబ్బును రైతుల నుంచి దండుకుంటున్నారు. పానగల్ ఐకెపి కొనుగోలు కేంద్రంలో క్వింటా ధాన్యం కాంటా వేసినందుకు హమాలీలు రూ. 25లను తీసుకుం టుంటే అదే తిప్పర్తిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో క్వింటాలకు రూ. 30 చొప్పున హామాలీలు రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. కంకణాలపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో క్వింటాకు హమాలీలు రూ. 35 చొప్పున ముక్కుపిండి రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. వాస్తవానికి హమాలీలకు సంబంధించిన కూలీని ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది. కాని విక్రయించిన ధాన్యం డబ్బుతో కలిపి హమాలీ కూలీ మొత్తాన్ని కూడా ఇస్తామని అధికారులుచెబుతూ వస్తున్నారు. అధికారుల మాటలను నమ్మి హమాలీలకు కూలీని అందజేసిన రైతులకు గత రబీ, ఖరీఫ్ సీజన్‌లకు సంబంధించి హమాలీలకు చెల్లించిన మొత్తం ఇప్పటి వరకు అందలేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలలోపే కొనుగోలు చేసిన ధాన్యం డబ్బును చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్ధలు ధాన్యం కొనుగోళ్ళను ప్రారంభించి పక్షం రోజులు దాటినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ధాన్యం విక్రయించిన ఒక రైతుకు ప్రభుత్వం చెల్లించకపోవడం విశేషం. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాంలకు తరలించేందుకు అవసరమైనన్ని లారీలను కూడా ఏర్పాటు చేయలేని దుస్థితి జిల్లాలో నెలకొంది. రబీ సీజన్‌లో సాగు చేసిన పంటల నుంచి లభించే ధాన్యం దిగుబడులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్ధలైన ఐకెపి, పిఏసిఎస్‌ల ద్వారా మొత్తం 227 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఐకెపి ఆధ్వర్యంలో 146 కేంద్రాలను, పిఏసిఎస్‌ల ద్వారా 81 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఐకెపి ద్వారా 94 కొనుగోలు కేంద్రాలు, పిఏసిఎస్‌ల ద్వారా 64 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఐకెపి కొనుగోలు కేంద్రాల ద్వారా 23 వేల మెట్రిక్ టన్నులు, పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా 16,900 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికార వర్గాలు అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. వాటి విలువ రూ. 60 కోట్ల వరకు ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన… ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్షంగా పెట్టుకున్న అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లను చేయడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు రైతుల నుంచి బహిరంగంగా వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రోజుకు ఏడువేల మెట్రిక్ టన్నుల మేరకు ధాన్యం కొనుగోళ్ళు జరుగుతున్నాయి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రతి రోజుగోదాంలకు తరలించడంలో అధికారులు విఫలమవుతున్నారు. రోజు కొనుగోలు చేస్తున్న ధాన్యంలో కేవలం మూడు, నాలుగు వేల క్వింటాళ్ళ ధాన్యాన్ని గోదాంలకు తరలిస్తూ అధికారులు చేతులు దులుపు కుంటుండటంతో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు పెద్ద సంఖ్యలో పేరుకుపోతూ వస్తున్నాయి. గోదాంలకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు అవసరమైనన్ని లారీలను కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో అధికారులు ఉన్నారంటే వారి భాద్యతరహిత్యం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. జిల్లాలోని 59 మండలాలను 11 బ్లాక్‌లుగా ఏర్పాటు చేసి ఆయా బ్లాక్‌ల పరిధిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు ఒక బ్లాక్‌కు ఆరు లారీలను కేటాయించారు. అయితే బ్లాక్ వారిగా కేటాయించిన లారీలు ధాన్యాన్ని తరలించేందుకు సరిపోకపోవడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఇబ్బందికరంగా మారింది. ప్రతిబ్లాక్‌కు అదనంగా మూడు నుంచి నాలుగు లారీలను కేటాయిస్తే గాని సకాలంలో కొనుగోలు కేంద్రాల నుంచి గోదాంలకు ధాన్యాన్ని తరలించే అవకాశం ఉంటుందని అధికార వర్గాలే చెబుతున్నాయి. అధికారులు అంచనా ప్రకారంలో రబీ సీజన్‌లో విక్రయానికి రానున్న 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సుమారు 50 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా అధికారుల వద్ద ఉన్న పాత గన్నీ బ్యాగులతో పాటు కొత్త గన్నీబ్యాగులు కలిపి మొత్తం 18 లక్షల వరకు మాత్రమే ఉన్నట్లు సమాచారం. కొనుగోలు కేంద్రాలకు పాతగన్నీ బ్యాగులను అధిక మొత్తంలో సరఫరా చేస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పానగల్‌లో ఏర్పాటు చేసిన ఐకెపి కొనుగోలు కేంద్రంలో శనివారం 159 ధాన్యం కుప్పులు ఉండగా సుమారు 50వేల క్వింటాళ్ళ ధాన్యం విక్రయానికి ఉంది. ఇక్కడ సరిపడ హమాలీలు ఉన్న ధాన్యాన్ని తరలించేందుకు సరిపడ లారీలు లేకపోవడంతో నిర్వాహకులు పూర్తిస్ధాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదు. 20 రోజుల క్రితం ధాన్యాన్ని విక్రయానికి తెచ్చిన రైతులు తమ ధాన్యం కుప్పల వద్ద రోజు పడిగాపులు కాస్తున్నారు.

ఇంత వరకు డబ్బురాలేదు…
పానగల్ ఐకెపి కొనుగోలు కేంద్రంలో 509 బస్తాల ధాన్యాన్ని విక్రయించాను. వారం అవుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం డబ్బుచెల్లించలేదు. 24 గంటలలోపే ధాన్యం డబ్బు చెల్లిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అధికారులు మాత్రం ఇవ్వడంలేదు.
-ఉపేందర్‌రెడ్డి, ఆర్జాలబావి

హమాలీల కూలి డబ్బు ఇవ్వడంలేదు…
గత ఖరీఫ్, రబీ సీజన్‌లలో ప్రభుత్వ రంగ సంస్ధలలో ధాన్యాన్ని విక్రయించాను. ఆ సమయంలో హమాలీలకు తాను కూలీగా చెల్లించిన డబ్బును ప్రభుత్వం ఇప్పటివరకు నా ఖాతాలో జమ చేయలేదు. ఎవరితో చెప్పుకోవాలనో అర్ధం కావడంలేదు.
-రంగారెడ్డి, గడ్డికొండారం