Home స్కోర్ దాయాదిపై దరువు

దాయాదిపై దరువు

india-viratవిశ్వకప్పులో పాక్‌పై మళ్లీ టీమిండియాదే విజయం
భారత్‌ను గెలిపించిన కోహ్లి
కోల్‌కతా : మార్పు లేదు. అదే దూకుడు. అదే విజయం. విశ్వకప్పులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఓటమే ఎరుగని టీమిండియా మరోసారి విజయాన్ని సొంతం చేసుకుంది. ఛేజింగ్ మొనగాడు విరాట్ కోహ్లి(37 బంతుల్లో 55 నాటౌట్, 7×4, 1×6)కి తోడు యువరాజ్ సింగ్(23 బంతుల్లో 24, 1×4, 1×6) రాణించ డంతో 119 పరుగుల లక్షాన్ని 15.5 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. అంతకుముందు వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ భారత బౌలర్లను ఎదుర్కొని వేగంగా పరుగులు చేయలేకపోయింది. పిచ్‌పై తేమ ఉండడం సద్వినియోగం చేసుకున్న భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాక్ ఓపెనర్లు షర్జీల్ ఖాన్(17), షెహజాద్(25) ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్, డబుల్స్‌తోనే స్కోరు బోర్డును నడిపించడంతో పాక్ 7 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 34 పరుగులే చేయగలిగింది. ఇక రైనా వేసిన ఎనిమిది ఓవర్‌లో భారీషాట్‌కు ప్రయత్నించిన షర్జీల్ ఖాన్.. మిడాన్‌లో హార్దిక్ పాండ్య పట్టిన మెరుపు క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. మరికొద్దిసేపటికే అహ్మద్‌షెహ్ జాద్, కెప్టెన్ ఆఫ్రిదీ(8) కూడా అవుటవడంతో పాక్ ఒత్తిడిలో పడినట్లు కనిపించింది. అయితే మధ్య ఓవర్లలో షోయబ్ మాలిక్(26), ఉమర్ అక్మల్(22) దూకుడుగా ఆడటంతో పాక్ 100 పరుగుల మార్కును చేరుకోగలిగింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో మాలిక్, అక్మల్ చెరో సిక్స్ బాది మొత్తం 15 పరుగులు పిండుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని జడేజా విడదీశాడు. జట్టు స్కోరు 101 పరుగుల వద్ద ఉమర్ అక్మల్‌ను జడేజా ఔట్ చేయగా.. మరో నాలుగు పరుగుల వ్యవధిలో దూకుడుగా ఆడుతున్న షోయబ్ మాలిక్‌ను ఆశిష్ నెహ్రా బోల్తా కొట్టించాడు. చివరగా సర్ఫరాజ్(8 నాటౌట్), హఫీజ్(5 నాటౌట్) నెమ్మదిగా ఆడటంతో పాకిస్థాన్ 119 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించగలిగింది. భారత్ బౌలర్లలో నెహ్రా, బుమ్రా, జడేజా, రైనా, పాండ్య తలో వికెట్ తీశారు.