Home ఆఫ్ బీట్ భాషా రాజకీయాలపై ఆళ్వారు నిరసన

భాషా రాజకీయాలపై ఆళ్వారు నిరసన

ఉస్మానియా  పాలక వర్గపు ఎత్తుబిడ్డ 

బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని     ఉద్యమాలు చేసినందుకు చాలా మంది         కమ్యూనిస్టులతో పాటు వట్టికోట ఆళ్వారుస్వామిని కూడా నిజాం ప్రభుత్వం అరెస్టు చేసింది. ‘పోలీసు చర్య’ అనంతరం ఎం.కె.వెల్లోడి నేతృత్వంలో ‘బాధ్యతా’యుత ప్రభుత్వం ఏర్పడింది. అయినా ఆళ్వారుస్వామి 1951 వరకూ      జైలులోనే గడిపిండు. 1952లో ఒక వైపు విద్యార్థులు బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ ‘ముల్కీ ఉద్యమాని’కి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమానికి, స్థానిక భాషలకు మద్దతునిస్తూ, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు భాష విషయంలో చేస్తున్న రాజకీయాలను  నిరసిస్తూ ‘ధర్మరాజు’ పేరిట వట్టికోట ఆళ్వారుస్వామి తెలుగు స్వతంత్ర 1952లో జూన్ 27 సంచికలో రాసిన వ్యాసమిది.  ‘భాషా రాజకీయాల’ను, మాతృభాషలో విద్యాబోధన, అసఫ్‌జాహీలు, కాంగ్రెస్ పార్టీల దమన నీతిని ఆళ్వారుస్వామి ఈ వ్యాసంలో ఎండగట్టినాడు. 

Nehru

(కాలం మారినా, పాలక వర్గాల పోకడలు మారలేదు. అసఫ్ జాహీ నవాబులు ఉర్దూ అంటే  కాంగ్రెస్   నవాబులు హిందీ అంటున్నారు. స్థానిక ప్రజల            అవసరాలు ఎప్పుడూ విస్మరించడమే    జరుగుతున్నది.)

పుట్టుక
ఉస్మానియా విశ్వవిద్యాలయము పుట్టిందీ మొదలు నేటి వరకు ఎన్నియో సమస్యలకు కారణమైంది. 1917లో ఉస్మానియా విశ్వ విద్యాలయావశ్యకత, నాడు హైదరాబాద్ ప్రభుత్వ శాఖా కార్యదర్శులుగా నుండిన కీ.శే. అక్బర్ హైదరీ గమనించి ఆ విషయాన్ని నిజాం నవాబు (ప్రస్తుత రాజ ప్రముఖు)నకు దిగువ విధంగా నివేదించారు. “విదేశీ భాషలలో విద్యాబోధనా పద్ధతి వల్ల విద్యార్థుల మెదడుపై అపరిమితమైనట్టియు అనవసరమైనట్టియు భారం పడుతున్నది. విదేశీ భాషలలో ప్రావీణ్యమును పొందుటకై చేయు శ్రమ, బోధనా విషయమును ఉన్నదున్నట్లు గ్రహించుటకై లోనగు కష్టాలకు గురి అగుటయేగాక తమ విజ్ఞానమును తోడి దేశీయుల మాతృ భాష ద్వారా వ్యాప్తి నొందించవీలు కాదు. అందువల్ల విద్యాంతులకు అసంఖ్యాక జన సామాన్యమునకు మధ్య పెద్ద అగాధమేర్పడుట జరుగుతున్నది”.
కాబట్టి ప్రభుత్వ భాషయును, అధిక సంఖ్యాకుల అర్థము చేసికొను ఉర్దూ భాషను బోధనా భాషగా ఉస్మానియా విశ్వవిద్యాలయము స్థాపించుట అవసరమని కీ.శే. అక్బర్ హైదరీగారు సూచించారు.
మాతృభాష పేరును ఊతగాగొని, విదేశీ భాషలవల్ల హానిని బయల్పెట్టుతూ, క్రియలో మాత్రము ఉర్దూ భాషను బోధనా భాషగా నిర్ణయించుటలోనే మాయయంతయు ఇమిడి ఉంది. ప్రభుత్వ భాషయైనంత మాత్రాన ప్రజాభాషగా పరిగణించుట యే విధముగను న్యాయ మనిపించదు. పైగా “అధిక సంఖ్యాకులు అర్థము చేసుకొను నెపమున, అల్ప సంఖ్యాకుల మాతృ భాషను బోధనా భాషగా నిర్ణయించడం ప్రజాస్వామ్యానికి వెక్కిరింత.
వివిధ సంపర్కములచే సంస్కరణలను బొంది తుదకు మహమ్మదీయుల మాతృ భాషగా వ్యవస్థాపూర్వకముగా నిర్ణయింపబడిన ఉర్దూ హైదరాబాద్‌నందలి అధిక సంఖ్యాలకు విద్యా, విజ్ఞాన సంస్కృతులకు మూలాధారముగా నిర్ణయించుట అతిసాహసము. ఇట్టి సాహసమును నిజాం నవాబు విభ్రమము కలిగించు ఎట్టిమాటలతో ప్రశంసించెనో దిగువ వాక్యాలవల్ల బోధపడుతుంది: “ప్రాచీన, ఆధునిక కాలాలకు సంబంధించిన విధానము, సంస్కృతికి సమాన అవకాశము కలిగించి, ప్రస్తుత విద్యా విధానము నందలి లోపాలను తొలగించవలెను, ప్రాచీన ఆధునిక సంస్కృతికి సంబంధించిన ఉత్తమ విషయాలన్నింటికీ చక్కని అవకాశము కలుగునట్లు చూడవలెను. అంతేగాక విజ్ఞాన వ్యాప్తికై మొత్తము శాస్త్రీయ విషయాలలో పరిశోధనకు చక్కని అవకాశమిచ్చు నైతిక శిక్షణ విద్యార్థులకివ్వబడవలెను. కాబట్టి విశ్వ విద్యాలయము యొక్క ఉన్నత విద్యా బోధనా పద్ధతి ఉర్దూలో జరుపబడవలెను. మరియు ఇంగ్లీషు భాషా పరిచయమునకుగాను విద్యార్థులెల్లరికీ ఇంగ్లీషు విధిగా నేర్పబడవలెను.” ఫర్మాన్ 1917

Allvaru Strike on Language Political Problems

నిజాం నవాబు యొక్క పై వాక్యాలలో “ ప్రాచీన, ఆధునిక” అను పదాలకు అర్థము తుదిలో పేర్కొన్నట్లు “ఉర్దూ, ఇంగ్లీషు” అని ధ్వనిస్తుంది. ప్రాచీనమైన ఉర్దూ, ఆధునికమైన ఇంగ్లీషును ప్రోత్సహించుటయని స్పష్టముగా తెలియచున్నది.
తాను మహమ్మదీయుడు కాబట్టి ఉర్దూను, తన నెత్తిపై కూర్చొనియుండిన ఆంగ్లేయుల సంతోషపెట్టుటకై ఇంగ్లీషును, ఉద్ధరించ ఉద్యుక్తుడైన సంగతి తేటతెల్లమే. కీ.శే. అక్బర్ హైదరీ మాతృ భాషోద్ధరణపేర, విద్యావంతులు, అసంఖ్యాక జన సామాన్యము మధ్యనున్న అగాధమును “తొలగించు” పేర ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపనకు కారకుడైతే “ప్రాచీన, ఆధునిక” విద్య, సంస్కృతి, విజ్ఞానముల ఉన్నత సంప్రదాయముల కలయికనెపమున ఉర్దూ భాషాభివృద్ధికి నిజాం నవాబు తోవ తీశాడు.
ఇరువురి ముఖ్య ధ్యేయం
ఇక్కడ ఉభయుల ముఖ్య ధ్యేయ మొక్కటే. “అసంఖ్యాకులైన జన సామాన్యము” గా హైదరాబాద్ సంస్థాన జనాభాలో అధిక సంఖ్యాకులైన ఆంధ్ర, మహారాష్ట్ర,కర్నాటక ప్రజల మాతృభాషలు పూర్తిగా విస్మరించబడ్డాయి. అడగడుకునకు అలవిగాని అడ్డంకులు కల్పించబడ్డాయి. ప్రాథమిక విద్యా విధానంలో కూడా ఉర్దూ నిర్బంధము చొప్పించబడ్డది. కొన్ని గ్రామాలలో అసలు ఆయా ప్రాంతీయ భాషల నేర్పించు ఉపాధ్యాయులే లేకుండిరి. “ఆలీఫ్‌”, “బే”లు నేర్పు వ్యవస్థ వుండెనుగాని “అ”, “ఆ” లు నేర్పు శ్రద్ధ లేకుండెను. రెండింటి వ్యవస్థ ఉన్న చోట “అ”, “ఆ” లతో పాటు “ఆలీఫ్‌”, “బే” లు సాగాల్సిందే. ఇట్టి నిర్బంధ విధానానికి విసిగి చేయునదేమీ లేక దేశీయులు స్వంత పాఠశాలలు స్థాపించుకొనసాగారు. వాటిపై కూడా ప్రభుత్వం ఎడతెగని అవరోధాలు కల్పించింది. అట్టి పాఠశాలలకు ప్రభుత్వ సహాయమటుండ సాధ్యమైనంతవరకు అవి మూసివేయబడుటకు తీవ్రమైన ఒత్తిడి తేబడేది. గ్రాంట్స్ ఇచ్చెదమని ఆశ చూపి, ఇచ్చి ఆయా పాఠశాల అందలి విద్యా బోధనా పద్ధతిని తమ నీతి కనుగుణంగా మార్చించే సంఘటలెన్నో జరిగాయి. ఆర్థిక పరిస్థితికి లోబడి ఆశయాలను, ఆదర్శాలను విడనాడిన పాఠశాలలెన్నో అవతరించాయి.
ప్రభుత్వమునకు చేయూత
రెండోవైపు ప్రభుత్వ అతిథులుగాను, స్నాతకోపన్యాసకులగాను విచ్ఛేయు దేశీయ, విదేశీయ ప్రముఖ విద్యావేత్తలు కీ॥ శే॥ తేజ్ బహద్దర్ సప్రూ మొదలుకొని సర్ మారిస్ గయర్‌తో సహా, శ్రీమాన్ రాజాజీ వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయము యొక్క కీర్తి ప్రతిష్ఠలను గుక్క తిప్పకుండా శ్లాఘించిన వారే!
సంస్థాన ప్రజల మాతృభాషలకు కలుగుతున్న అన్యాయముగాని, ఉర్దూ కృతిమ పద్ధతిని విద్యార్థులందరికి అంటగట్టి, “అపరిమితమైనట్టియు అనవసరమైనట్టియు బాధ మెదడుకు కలిగించి అసంఖ్యాక జన సామాన్యము నకు విద్యావంతుల మధ్య పెద్ద అగాధము ఏర్పడుటకు” కారణమై ఉర్దూ ద్వారా బోధన జరుగుతున్న సంగతి ఎరిగియు, ఎరుగనట్లు మరుగుపరచి “భారత దేశములో భారతీయుల భాషలో ఉన్నత విద్య జరుపు పద్ధతి అవలంబించింది మొత్తము భారతదేశములో ఉస్మానియా విశ్వ విద్యాలయ మొక్కటే” అని ప్రయత్నపూర్వకముగా ప్రచార ధోరణికి పాల్పడ్డారు. ముఖ్యముగా కృతిమ విధానాన్ని ఉన్నత స్థాయిలో చిత్రించుటకు చేసిన వ్యయము కృషి, అంతింత కాదు. తుదకు ఉస్మానియా విశ్వవిద్యాలయము కేవలము ఉర్దూ బోధనా పద్ధతి అనగా మహమ్మదీయుల కొరకే అన్నంత వరకే దిగింది.
ప్రజాందోళన
హైదరాబాద్ ప్రజాహిత జీవనానికి, రాజకీయ చైతన్యానికి ప్రధాన సంస్థలైన ఆంధ్ర, మహారాష్ట్ర, కర్నాటక మహాసభలు అవకాశము కలిగినప్పుడల్లా, ప్రతి సమావేశములోను, విద్యా విధాన సమస్య బయలుదేరినప్పుడల్లా ఉస్మానియా విశ్వ విద్యాలయపు ఉర్దూ విధానాన్ని తీవ్రంగా విమర్శించాయి. ఆంధ్ర, మహారాష్ట్ర, కర్నాటక భాషలకు కలుగుతున్న అన్యాయమును, ఆయా ప్రాంతీయ సంస్కృతి, సభ్యతా విషయాలు విస్మరించు నిరంకుశ చర్యను యెలుగెత్తి చాటాయి. ప్రత్యేకముగా హైదరాబాద్ ప్రజల విద్యా విషయిక సమస్యలను న్యాయ బద్ధముగా పరిష్కరించుటకును, ఆయా ప్రాంతాల భాషల ద్వారానే బోధన గరిపించుటకును ప్రత్యేక కార్యక్రమమును నిర్ణయించుకొని పుట్టిన హైదరాబాద్ ప్రజా విద్యా మహాసభ ఎంతో ఆందోళన జరిపినది. ఈ సంస్థకు హృదయనాథ్ మంజ్రూ, డాక్టర్ రాంప్రసాద్ త్రిపాఠి (అలహాబాద్ విశ్వ విద్యాలయాచార్యుడు) వంటి మహామహుల నేతృత్వము కూడా చక్కని నిర్మాణ కృషి జరిపింది.
ప్రజల ఆశయాలు ఆశలు
ప్రభుత్వము కేవలము నిరంకుశత్వముతో కూడి వుండి, ఆంగ్లేయుల కనుసన్నలతో ఆటలాడుతున్న పర ప్రభుత్వమని, అట్టి ప్రభుత్వపు ఇట్టి చేష్టలు, ఏర్పడిన విషమ స్థితి, ఆదర్శమైన ప్రజా ప్రభుత్వమును సాధించుటవల్లనే తొలగిపోవునని, బాధలకు గురియైన ప్రజలు భావించారు. తమ భావి నిర్మాణానికి తామే కర్తలుగా, కర్తవ్యాన్ని గుర్తించి, యథాశక్తి చేయగల త్యాగాన్ని పోరాటాన్ని చేశారు.
భారత ప్రభుత్వ పోలీసు యాక్షన్‌తో తమ కృషికి ఫలితాలు కలుగునని ఆశించి, ఆనందించారు. ప్రతి జాతి, దేశము యొక్క సర్వతో ముఖాభివృద్ధిని సూచించునది ఆయా దేశాల యొక్క సంస్కృతి, సభ్యత, సత్సంప్రదాయాలే అని, ఆయా దేశ ప్రజల మాతృభాషాభివృద్ధిపైననే ఆధారపడి ఉండునని తెలిసికొని ఇక తమ మాతృభాషాభివృద్ధికి చక్కని అవకాశం లభించినదని, ఇట్టి సదవకాశమును చక్కగా ఉపయోగించుకొనుటచే, తమ దుర్గతి మారి తమ భావి సమాజము, సంతానము, తమ దేశము జాతి యొక్క ఉజ్జల సందేశమును, మరిగియున్న మహిమను అణచివేయబడిన, అమూల్య విజ్ఞాన సంపదను పెకలించి ప్రజ్వలింప చేయుదుమని ఉవ్విళ్లూరారు.ఊహాసౌధాలు నిర్మించుకున్నారు.
పిడుగువంటి వార్త
ఇంతలో పిడుగువంటి వార్తచే దిక్కులు పిక్కటిల్లినవి. ఉర్దూకు బదులు హిందీ బోధనా భాషగా నిర్ణయింపబడునని, కేంద్ర ప్రభుత్వము ఉస్మానియా విశ్వ విద్యాలయము యొక్క యాజమాన్యము వహింపనున్నదని విని ప్రజలు నిర్విణ్ణులైనారు.
ఉస్మానియా విశ్వ విద్యాలయములో ఉర్దూ బోధనా పద్ధతికి పునాదియైన వాదమే నేడు హిందీ పద్ధతి విషయములో చేయబడుతున్నది. ఈ రోజు ఉస్మానియా విశ్వ విద్యాలయముపై యాజమాన్య మెవరిదై యుండాలని కాదు ప్రధాన ప్రశ్న. ఉస్మానియా విశ్వ విద్యాలయ నిర్మాణములో ఏ ప్రజల వ్యయ ప్రయాసలు వినియోగింపబడినవో ఆ ప్రజలైనట్టి ఆంధ్ర, మహారాష్ట్ర, కర్నాటకులు దానితో లాభము పొందుటా? లేక రాజభాష, అసంఖ్యాక ప్రజలు అర్థము చేసికొను (నాటి ఉర్దూ నేటి హిందీ) భాష పేర స్థానికుల అవసరాలను, ఆదర్శాలను ఆశించిన ఫలితాలను ప్రక్కకుతోసి కేవలం ప్రభుత్వ ధోరణిలో సాగనీయటమా? అనునదే ముఖ్య ప్రశ్న.
నాడు నేడు
1917లో ఉర్దూను బోధనా భాషగా నిర్ణయించి, దానిని సఫలపరచుటకై మానసిక, ఆర్థిక వ్యయ ప్రయాసలు పడి బోధనా గ్రంథాలను సిద్ధము చేసినట్లే నేడు హిందీ విషయముతో జరుగవలసి యుండును కదా? అయినప్పుడు అట్టి కృషి ఆయా ప్రాంతీయ భాషలలో జరిపి, ఆ భాషలు బోధనా భాషార్హత కలుగు స్థితికి తెచ్చుటకై ఏల కృషి చేయరాదు? అది హిందీయైనా ఉర్దూయైనా మాతృభాష తర్వాతనే వాని యోగ్యతా యోగ్యతలు ఆలోచించాల్సి ఉంటుంది. మాతృ భాష జాతికి దేశానికి, జీవము వంటిది. తరగని సంపద వంటిది. తన దేశము, జాతి నిజ స్వరూపమును తెలిసికొని, తన భావి కర్తవ్యమును తెలిసికొని నిర్ణయించుకొనుటకు మాతృ భాషాజ్ఞానము రాజబాట. తన సంగతి తెలిసికోజాలనివాడు ఎదుటి వానిని అతి సులభముగా బానిసగా పరిణతి పొందుననుటకు చరిత్రలో అడుగడుగుకు ఎన్నియో దృష్టాంతరములు గలవు. తన విషయములో విజ్ఞుడగువాడే, తోడివారి విజ్ఞానమును గ్రహించును. తన యందలి లోపాలను సంస్కరించుకొని, తోడివారి యందలి ఉన్నత విషయాలను సహృదయతతో ఇతరులకు చొప్పించి వారి లోపాలను సరిదిద్దును.
దుష్పరిణామము
మాతృభాష ద్వారా బోధనా పద్ధతి వల్ల కలుగు ఇట్టి సత్ఫలితాలు, నిర్బంధముగా, ఇతర భాషలు అంటగట్టబడుటచే కలుగకపోవుట అటుండ చైతన్య పూరితమగు నేటి వాతావరణములో ఇతర భాషల యెడ వైషమ్య భావమేర్పడును. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వ విధానమువల్ల హిందీ భాష యెడనున్న సద్భావం అంతరించును. హిందీ ప్రచార సభ, హిందూస్తానీ ప్రచార సభ మొదలగు సంస్థల నిర్మాణ కృషి ద్వారా దేశములలో కలిగిన హిందీ భాషా శక్తి కుంటుబడును. తమ మాతృ భాషాభివృద్ధిని అరికట్టి కృత్రిమముగా ఉర్దూను అంటగట్టుటచే రెచ్చిపోయి తపించుతున్న హృదయాలు హిందీ విషయములో బెదురుటకు అవకాశము కలుగుతుంది.
ఒక ఉన్నతమైనట్టి, విశాలమైనట్టి, సర్వజనులు ఆమోదించునట్టి, ప్రాతిపదిక సూత్రము ప్రకారము ఆయా దేశాలు, అందలి ప్రజల మాతృభాషలు, తద్వారా వారి సంస్కృతి, సభ్యత, సత్సంప్రదాయాల అభివృద్ధికి సంపూర్ణ అవకాశము కలిగినప్పుడే పరస్పర అవిశ్వాసము, విరక్తి విద్వేషాలు లేకుండాపోవును. అదే రాజమార్గము, దానిని సాధించుటకై ఎల్లరి నిర్మాణ కృషి అవసరము.
మెదడుకు మేత
ఈ సందర్భమున, 1944లో హైదరాబాద్ పట్టణమున జరిగిన హైదరాబాద్ ప్రజా విద్యా మహాసభలో ఆహ్వాన సంఘాధ్యక్షులుగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు (ప్రస్తుత ప్రధాన మంత్రి) గారి చిరస్మరణీయ వాక్యాలు దిగువ పేర్కొంటున్నాను. వారి ఉత్తేజ పూరితమైన వాక్యాలు కార్యాచరణలో పెట్టబడు దినమునకు ఎల్లరు ఎదురు చూస్తుంటారు. అంత వరకు వాక్యాలను మాత్రము మరువజాలము.
“మాతృభాషయే బోధనా భాషగా నుండవలెనను సూత్రాన్ని అంగీకరించి, కొంతవరకు (అనగా మహమ్మదీయుల యెడ ధ. రా.) అమలు జరుపుతున్నప్పుడు ఉర్దూ మాతృభాష కానట్టి విద్యార్థులకు ఉర్దూలో బోధన జరుపుట యెంత వరకు నైతికతపై ఆధారపడి యున్నదో అను ప్రశ్న బయలుదేరును. ఇంగ్లీషు కంటె ఉర్దూ సులభ గ్రాహ్యమనియు, అందువల్ల ఇంగ్లీషుకు బదులు ఉర్దూ ద్వారానే బోధన జరుపుట మెరుగైన విషయమను ప్రభుత్వ వాదనలో సత్యము లేకపోలేదు. అయినప్పటికి తోడి విద్యార్థులు (మహమ్మదీయులు ధ. రా.) తమ మాతృభాష ద్వారా బోధనా సౌకర్యము కలిగి ఉన్నప్పుడు, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్నాటక మాతృభాషగల విద్యార్థులు, తమ భాషలో తరగని సాహిత్య సంపద కలిగియుండియు, ఎందువల్ల వారు ఇతర భాషలతో విద్యా భ్యాసము చేయుటకు నిర్బంధింపబడుచున్నారో అర్థము కాదు. మొత్తము దేశానికి సంబంధించిన భాషావాద, వివాదాల ముసుగులో మాతృభాషా సమస్యలను ప్రభుత్వము సులభముగా ప్రక్కకు తోయజాలునని నేను భావించను. మొత్తము జాతికి సంబంధించిన భాషా విషయములతో మాతృభాషా సమస్యను లంకెపెట్టుట అనవసరము. తుదకు మొత్తము దేశీయుల జాతీయ భాషగా అది ఊర్దూ. హిందీ లేక హిందుస్తానీ కానిండు మొత్తము భారతదేశములో ఎల్లరు అంగీకరించినప్పటికీ, ఎట్టి తీవ్రవాదియగు జాతీయ నాయకుడు కూడా, వేల ఏండ్ల చరిత్రగల ప్రాంతీయ భాషలను రూపుమాప సమకట్టునని నేను భావించను. ప్రాంతీయ భాషలు, వాటి నెవరూ సహించినా, సహించకపోయినా, ఈ విశాలమైన మన దేశములో ఎన్నో భాషలు ఉండితీరుననియు అందువల్ల ఈ సమస్యను ప్రభుత్వము తలచినట్లు సామాన్య సమస్యగా తలచినచో ఎట్టి సత్ఫలితాలు కలుగబోవనియు, నా దృఢాభిప్రాయము”. (2811 44 “మాతృభాషయే బోధనా భాషగా నుండ నాడు యిచ్చిన ఉపన్యాసము )
అడుగడుగునా అమల్లో ఉన్న నిరంకుశత్వానికి కారకుడెవడో తెలుసుకోడానికి అవకాశం లేని వ్యవస్థనే ప్రజాస్వామికం అంటారు
అమెరికా సామెత.

సంగిశెట్టి శ్రీనివాస్