Search
Sunday 19 August 2018
  • :
  • :
Latest News

అడవి అక్షరాలు నేర్చింది

Amazing Telugu Story about Sweet Memories

ఆ దృశ్యాలు చూసినప్పటి నుండి తన చిన్ననాటి సంఘటనలు ఒంటి రెక్క సీతాకోక చిలుకలై కౌశల్ కనురెప్పలపై వాలుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు? చెరిపే ప్రయత్నం చేసినా! ఆ దృశ్యాలు నేరుగా కళ్ళలోకి ఇంకిపోయి గుండెను గుచ్చేస్తున్నాయి. విశాలమైన ఏసీ గది చల్లటి గాలిని తింటోంది. మరో పక్క సమయం పడమర గోడ పై నుండి రాలుతోంది. మరోసరి కంప్యూటర్ ఓపెన్ చేసి అదే వీడియో ప్లే చేశాడు. ప్లే అవుతున్న దృశ్యాన్ని చూడగానే కన్నుల గగనం నుండి నిశబ్దంగా కన్నీటి బొట్లు రాలిపడ్డాయి. మసక మసక కన్నులతోనే వీడియో కిందున్న కామెంట్స్ నుండి రెండు ఫోన్ నంబర్స్ నోట్ చేసుకున్నాడు. రాత్రి పక్షి నెమ్మదిగా గగనాన్ని ఎక్కడం గమనించిన కౌశల్ వెంటనే ఫైల్స్ సర్దుకొని ఇంటికి బయలుచేరాడు. ఇంటికీ చేరుకోగానే భార్య తన మూడు సంవత్సరాల పాపకి బుజ్జగిస్తూ అన్నం పెడుతోంది. పాప మారం చేస్తూ నాకు వద్దమ్మ నేను తిననంటూ గుమ్మంలోకి వచ్చిన కౌశల్ కాళ్ళకు పెనవేసుకొని, చూడండి నాన్న! వద్దంటే అమ్మ ఇంకా తినిపిస్తూనే ఉంది, అని ముద్దు ముద్దుగా చెప్పడంతో వెంటనే పాపను ఎత్తుకొని బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించాడు కౌశల్.

చేతిలోని ల్యాప్ ట్యాప్ బ్యాగ్ అందుకొని వెళ్లి స్నానం చేసిరండి వంట సిద్ధం చేస్తానన్నది కౌశల్ తో భార్య బుజ్జమ్మ. కౌశల్ గదిలోకి వెళ్ళగానే.., భర్త బాధను ముఖ మేఘంలో గమనించిన బుజ్జమ్మ, భోజనం చేసిన తర్వాత విషయం చెప్తారులే అనుకుంటూ భోజనం సిద్ధం చేసింది. కౌశల్ నైట్ డ్రెస్ వేసుకొని డైనింగ్ టేబుల్ ముందు డీలా పడిన ముఖంతో బుజ్జమ్మను గమనించకుండానే భోజనం చేసి నిద్ర వస్తోంది పడుకుంటానని చెప్పి పడక గదిలోకి వెళ్ళిపోయాడు. కౌశల్ ప్రవర్తనతో విస్తుపోయిన బుజ్జమ్మ విషయం ఏంటో? వెంటనే అడిగి తెలుసుకోవాలి లేదంటే తనలో తనే మదనపడిపోతారు. ఈయనతొ వచ్చిన చిక్కే ఇది. ‘విషయాన్నీ చెప్పి బాధను దించుకోరని మనసులో అనుకుంటూ పడకగదిలోకి వెళ్లి భర్త పక్కన పాపను పడుకోబెట్టి తను కూడా నిద్రకు సిద్దమైంది. కౌశల్ అటు ఇటు కదులుతూనే ఉన్నాడు. పాపను పడుకోబెట్టి కౌశల్ వైపుకు జరిగి తన చేతులు కౌశల్ భూజలపై అలంకరించింది బుజ్జమ్మ. ఏంటి? అన్నటుగా కౌశల్ తన వైపు తిరిగాడు. వెంటనే కౌశల్ ఎదపైకి చేరి తన గుండె చప్పుడు వింటూ ఏంటే? ఏమైంది? ఎందుకలా ఉన్నావు? బుజ్జిదానా! నాతో కూడా చెప్పవా? అన్నది.

భార్య నుదుటిపై తన వెచ్చని పెదువుల గుర్తులు అద్ది అందుకే నువ్వంటే నాకు అమితమైన ఇష్టం. ఏది తొందరపడవు ఎలా వ్యవహరించాలో? నీ దగ్గర ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నీతో కాకుండా ఇంకెవరితో చెప్తాను బుజ్జమ్మ జరిగిన విషయం బుజ్జమ్మకు చెప్పడం మొదలు పెట్టాడు కౌశల్. బాలునాయక్, గురువమ్మ ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులో ఉన్న గొల్లపల్లి తండాలో నివాసముండేవారు. వారికి ఎనిమిది మంది సంతానం, అందు లో ఐదవ సంతానం కౌశల్. బాలునాయక్ తనకున్న పొలంలో కూరగాయలు, పూలు పండించి వారం వారం భార్య భర్తలిద్దరూ కలిసి.., పండిన కూరగాయలు, పూలు సంతలో అమ్మి జీవనం కొనసాగించేవారు. వచ్చిన కాస్త డబ్బు పిల్లల కడుపు నింపేది కాదు. కౌశల్‌కి చదువుకోవడమంటే ఇష్టం కానీ..,అక్కడ ఉన్న అంగన్ వాడి కేంద్రంలో చెప్పే తెలుగు అర్థమయ్యేది కాదు.ఇంట్లో లిపి లేని భాష మాట్లాడటం అంగన్ వాడి కేంద్రంలో తెలుగు భాష చెప్పడం వల్ల చదువుపై ఎంత ఆసక్తి ఉన్నా సరిగా చదవలేకపోయేవాడు. కానీ.., ఇంట్లో కొన్ని సంఘటనలు చూసిన తర్వాత ఎలాగైనా చదువుకోవాలనే తపనతో బి.టెక్ దాక చదివి ఇప్పుడు అమెరికాలోని గూగుల్ కంపెనీలో సీనియర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

కౌశల్ ఇంటర్మీడియట్ చదివే రోజులలో తల్లి గురువమ్మ గర్భవతి అయ్యింది. భర్త బాలునాయక్ తో నీకు ఎన్ని సార్లు చెప్పాను? నాకు పిల్లలు వద్దని ఇప్పటికే ఏడు మంది పిల్లలు ఉన్నారు. వారికే మనం కడుపు నిండా భోజనం పెట్టడం లేదు.ఇప్పుడు మళ్ళీ నన్ను గర్భవతిని చేశావు. పుట్టబోయే బిడ్డను ఈ లోకంలోకి తెచ్చి పస్తుపెట్టి చంపమంటావా? అంటూ ఏడ్చింది.ఏ తల్లి అయినా బిడ్డకు జన్మనివ్వడం వద్దు అనుకోదు కానీ.., గురువమ్మ బాధ ఏంటంటే? బిడ్డకు జన్మనించి పస్తు పెట్టడం ఇష్టం లేదు. బాలునాయక్ మాత్రం బిడ్డలు దేవుడు ఇచ్చిన వరం, ఎంత మంది ఉంటే అంత గౌరవంగా భావిస్తాడు. పైగా పిల్లలను అడివి తల్లే చూసుకుంటుంది అంటాడు.ఆ తండాలో చాలా మంది పిల్లలకి.., వేసుకోడానికి బట్టలు ఉండవు, కడుపు నిండా అన్నం ఉండదు.ఆ పరిస్థితులను అనుభవించిన కౌశల్ పట్టుదలతో చదివి తల్లిదండ్రులను, తోబుట్టువులను తండా నుండి పట్నంలో నివాసం పెట్టి అందరీని స్థిరపరిచాడు.

బుజ్జమ్మ.., నేను ప్రొద్దున్న ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉండగా! ఫేస్ బుక్ నోటిఫికేషన్ రావడంతో ఓపెన్ చేసి చూశాను. అదొక వీడియో! అందులో ఒక తల్లి పడుకొని ఉంటే నలుగురు చిన్న పిల్లలు తల్లి పాలిండ్ల కోసం తారాడుతున్నారు. నిజానికి ఆ తల్లికీ పాలు కూడా రావడం లేదు, పిల్లల కేకలు వేస్తున్నారు. నిర్జీవంగా బక్క చిక్కి పడిపోయిన ఆ తల్లిని చూసి మా అమ్మ గుర్తొచింది. చిన్నప్పుడు తను పస్తులు ఉండి, ఉన్న కాస్త అన్నంతో మా కడుపులు నింపేది. నేడు నా కుటుంబాన్ని పట్నంలో పెట్టాను, వారికీ మంచి జీవితాన్ని ఇచ్చాను. ఆ వీడియో చూసిన తర్వాత అక్కడ కామెంట్స్ లో ఉన్నా నెంబర్ కి ఫోన్ చేశాను. ఆ వీడియోలోని దృశ్యాలు ఎక్కడివో కాదు మా ఊరిలోనివే! దాదాపు దశాబ్దం దాటిన అవే పరిస్థితులు మా ఊరులో ఉండటం నేను తట్టుకోలేకపోతున్నాను.ఏమి చేయాలో అర్థమవ్వడం లేదు! కళ్ళు మూసినా.., తెరిచినా అదే వీడియో ప్లే అవుతోందని చెప్పి భార్యను గట్టిగా కౌగలించుకొని బాధపడ్డాడు కౌశల్. ఏంటండి? చిన్నపిల్లాడిలా బాధపడకండి, నాతో విషయం చెప్పారు కదా! నేను అలోచించి మీకు ఒక మంచి సలహా ఇస్తాను. ఈ విషయం మర్చిపోండి, నాకు ఒక వారం రోజులు గడువు ఇవ్వండని కౌశల్ ని గట్టిగా హత్తుకుంది.

బుజ్జమ్మ అసలు పేరు కోకిల చదివింది M.S.W (మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్). పెళ్లి కాకముందు ఒక ప్రైవేట్ సంస్థలో క్లర్క్ గా పనిచేసేది.పెళ్లి అయ్యి అమెరికాకు వచ్చిన తర్వాత ఇంట్లో ఉంటోంది. ఇప్పడు పాపకి మూడు సంవత్సరాలు, ఇంకా పేరు పెట్టలేదు. వారి కుటుంబ సంప్రదాయం ప్రకారం ఆరు సంవత్సరాలలో పేరు పెడతారు.భర్త చెప్పిన విషయాన్నీ ఆలోచిస్తూనే ఉంది. ఇప్పడు ఆ గ్రామానికి ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నాడు కౌశల్ అని అర్థం చేసుకుంది.కానీ.., అమెరికాలో నెలకు పాతిక లక్షలు సంపాదిస్తున్న కౌశల్, ఎంతో కష్టపడి అంచలు అంచలుగా ఎదిగి ఇక్కడి వరకు వచ్చాడు. తన ఊరిలోని దృశ్యాలను చూసి తట్టుకోలేక మదనపడుతున్నాడు.నేను తనకు సహకరించాలి దీని కోసం నేను కూడా కొన్ని త్యాగాలు చేయాలనుకుంది. సుదీర్ఘంగా అలోచించి ఒక నిర్ణయానికీ వచ్చింది. ఇంటికీ ఫోన్ చేసి తల్లిదండ్రులకు జరిగిన విషయమంత చెప్పింది. బుజమ్మ ఆలోచనలతో తల్లితండ్రులు ఏకీభవించి మేము కూడా మీకు తోడుగా ఉంటాము తల్లీ,అల్లుడుగారినీ బాధపడద్దు అని చెప్పమన్నారు.వారంరోజుల తర్వాత కౌశల్ కి తన నిర్ణయాన్ని చెప్పింది.కౌశల్ కు బుజ్జమ్మ చెప్పిన సలహా అసలు రుచించలేదు. వద్దే వద్దు నువ్వు,పాప లేకుండా ఎలా ఉండాలి? అని బాధపడ్డాడు.మిమ్మల్నే కాదు మీ ఆలోచనలు, అభిప్రాయాలను మనస్పూర్తిగా ప్రేమించే వ్యక్తిని నేను మీరు అధైర్యపడద్దు. నేను మీ ఆలోచనలకూ అనుగుణంగా పనిచేస్తాను,మనం సేవ చేయాల నుకున్నప్పుడు చిన్ని చిన్ని త్యాగాలు చేయాలని కౌశల్ కి నచ్చచెప్పి ఒప్పిం చింది. మరుసటి రోజే బుజమ్మ ఇండియాకి ప్రయాణమైంది.

మామయ్యతో కలిసి గొల్లపల్లి తండా చేరుకొని ముందుగా ఎన్ని గుడిసెలు, ఎన్ని కుటుంబాలు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారో? వారం రోజుల్లో ఒక ఫైల్ రెడీ చేసి కౌశల్ కి మెయిల్ చేసింది.మొత్తం వంద కుటుంబాలు ఉన్నాయి. అందులో ముప్పై మంది పిల్లలు ఐదు సంవత్సరాల లోపు ఉన్నారు. ఇరవై మంది పది సంవత్సరాల లోపు ఉన్నారు. మిగతా ముప్పై మంది పదవ తరగతి చదివి ఆపేశారు.అందరికీ జీవనోపాధి వారికున్న పొలాలలో పంటలు పండించుకొని ఉన్నది తినడమే. ప్రభుత్వం నుండి ఎలాంటి సదుపాయాలు అందడం లేదని కూడా తెలుసుకుంది బుజ్జమ్మ. మొదట అందరికీ ఏదైనా జీవనోపాధి కల్పించాలి. పిల్లలకు మంచి విద్య అదించే స్కూల్ నిర్మించాలి అనుకుంది.ఉపాధి కోసం పాడి పరిశ్రమ నెలకొల్పాలని భావించి ప్రభుత్వానికి అర్జి పెట్టింది. ప్రభుత్వం కూడా వెంటనే అనుమతి ఇవ్వడంతో పరిశ్రమ పనులు మొదలయ్యాయి. నెమ్మదిగా బుజ్జమ్మ తమ కోసం వచ్చిన దేవతని తండా ప్రజలందరూ అనుకున్నారు.

చిన్న పిల్లలకు పాటలు,ఆటలు రూపంలో చదువు చెప్పడానికి ఒక కేంద్రాన్ని నిర్మించి చదువు చెప్పిస్తూ, మంచి పౌష్టిక ఆహారం కూడా పిల్లలకు అందించారు.అలా ఆ గ్రామానికీ మంచి నీటి సౌకర్యం, రోడ్లు,పరిశుభ్రత,కుటుంబ నియంత్రణ,వయో విద్య లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసింది బుజ్జమ్మ.ఆ తండాను చూసి చుట్టుపక్కల తండాల వారు కూడా బుజ్జమ్మకు మా జీవితాలు కూడా మార్చండని ప్రాధేయ పడ్డారు. వారి దీన గాధలు విని తట్టుకోలేక పోయింది. కానీ.., భర్త సంపాదనతో సేవా కార్యక్రమాలు మరింత విస్తరింప చేయడం కష్టమని భావించింది. విషయం మొత్తం కౌశల్ కి ఫోన్ చేసి చెప్పింది.కౌశల్ ఫండ్ రైజ్ చేసి మరింత డబ్బు సమకూర్చడంతో మరికొంతమంది లబ్ధి పొందారు.అప్పటివరకు చేసిన వివిధ కార్యక్రమాలు ఫేస్ బుక్, వివిధ సామాజిక వెబ్ సైట్ లో పోస్ట్ చేయడం ద్వారా ఎంతో మంది దాతలు ముందుకు రావడంతో సేవా కార్యక్రమాలు విస్తరింపజేసి రాష్ట్రం మొత్తం గురువమ్మ సేవ సంస్థ పేరుతో వేల మందికి సహాయం చేశారు.కోట్లు సంపాదించినా సంతృప్తి కలగని కౌశల్ కి భార్య చేసే సేవ కార్యక్రమాలతో ఆనందపడ్డాడు. ఇదంతా గమనించిన గూగుల్ కంపెనీ కౌశల్ ని ఇండియాకి ట్రాన్స్‌ఫర్ చేయడమే కాక వంద కోట్ల రూపాయలు విరాళంగా గురువమ్మ సేవ సంస్థకి ప్రకటించింది.కౌశల్, బుజ్జమ్మ ఇద్దరూ కలిసి అడివికి అక్షరాన్ని నేర్పించడమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

-విరాజిత, సామాజిక విశ్లేషకురాలు

Comments

comments