Home ఎడిటోరియల్ అంబేడ్కరా! మా వెలుగు నీవేనయ్యా!

అంబేడ్కరా! మా వెలుగు నీవేనయ్యా!

dr-br-ambedkarభారత స్వాతంత్య్ర సమరంలో, తరువాత దేశ నవ నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం రాజకీయ ప్రక్రియతో బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు న్యాయమైన వాటా కోసం రచించిన వ్యూహాలపై నిర్దేశించిన విధానాలపై నిర్వహించిన సమరశీల పోరాటాలపై చెరగని ముద్ర వేసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్. ఈ దేశ సామాజిక వ్యవస్థ భౌగోళిక స్వరూ పం ఆధారంగా నిరుపమాన అధ్యయనంతో జాతీయోద్యమ ప్రజల ఆకాంక్షలతో ప్రతిబింబించే రాజ్యాంగాన్ని అందించాడు . విసుగు, విరతిలేని జ్ఞాన అన్వేషణ, పీడిత ప్రజల పట్ల అనుకంపనతో జీవించాడు. ప్రపంచ జ్యోతి బుద్ధుడు సామాజిక విప్లవ ఆరంభకుడు ఫూలేల దివిటీని అందుకుని ఒక ఇతిహాసంగా సామాజిక ఆర్ధిక విప్లవాన్ని గొప్ప ముందంజ వేయించి దేశ చరిత్ర గతిని మార్చిన మహోన్నతుడు అంబేడ్కర్.

ఆయన మేధస్సు, ఆచరణ ప్రతిష్ఠ కొన్ని రంగాలకు పరిమితం చెయ్యడం న్యాయం కాదు. అసమానతల దొంతరగా ఉన్న అమానవీయ సమాజాన్ని మార్చిన తాత్వికుడిగా, అభివృద్ధి ఫలాలు అందరికీ అందించే నిర్మాతగా, యుగకర్తగా చరిత్రలో నిలిచిపోయారు. అంబేడ్కర్ చేసిన సేవలు, ఆలోచనలు మానవ మర్యాద కోసం, అంతరాలులేని సమాజం కోసం, దోపిడీ పీడనలులేని వ్యవస్థ నిర్మాణం కోసమనే స్పృహను భారతీయ సమాజం కలిగి ఉన్నందువల్లే ఆయన దూరమయ్యి అరవై మూడు సంవత్సరాలు దాటిన ఈ నాటికీ ప్రజలు ఆయన జయంతి, వర్ధంతులు జరుపుకుంటున్నారంటే తమ జీవిత వెలుగులకు అంబేడ్కర్ చేసిన త్యాగభరిత కృషిపట్ల కృతజ్ఞత, ఆయన చెప్పిన విషయాలు ఎంతటి సమకాలీనతను, ప్రాసంగికతను కలిగి ఉన్నాయనడానికి నిదర్శనం.

భారతదేశ భవితవ్యానికి సంబంధించిన అనేక విషయాల గురించి అంబేడ్కర్ అలోచించి, విశ్లేషించి వివరించాడు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, స్వరూపం, స్వభావాల గురించి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు, ఏర్పాటు చేసిన ప్రకరణ ౩ మన తెలంగాణ రాష్ట్ర పోరాటానికి దిక్సూచిగా తాత్విక సమర్ధనను ఇచ్చాయి. అంబేడ్కర్ చూపించిన మార్గంలో అరవై ఏళ్ళ స్వరాష్ట్ర తెలంగాణ పోరాటానికి జాతీయ స్థాయిలో బలమైన మద్దతు లభించి స్వరాష్ట్ర కల సాకారమయ్యింది. తెలంగాణ హృదయంలో అంబేడ్కర్ చిరస్మరణీయుడయ్యారు. రాష్ట్రాల ఏర్పాటుపై మాట్లాడుతూ భాషా ప్రాతిపదికలపై రాష్ట్రాల నిర్మాణం జరగడం శ్రేయస్కరం కాదని వివరించాడు. భాషా దురభిమానం పెరిగి విచ్చిన్న ధోరణులు ఏర్పడే అవకాశముందన్నారు. అల్ప సంఖ్యాకులు అణచివేతకు గురయ్యే అవకాశముందని తెలిపారు. ఇది స్పర్దలకు, ఘర్షణలకు దారి తీస్తాయి.

ఒకవేళ రాష్ట్రాల ఏర్పాటుకు భాషా ప్రాతిపదిక అనివార్యం అయినప్పుడు ‘ఒక రాష్ట్రానికి ఒకే భాష కాని ఒక భాషకు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే రాష్ట్రాల ఏర్పాటుకు జనాభా, భౌగోళిక విస్తీర్ణం, ఆర్ధిక స్వాలంబన అనే కొలమానాలు ప్రతిపాదించారు. ఇవన్నీ తెలంగాణకు సరిగ్గా వర్తిస్తాయి. చిన్న రాష్ట్రాలు సమర్ధవంతమైన పరిపాలన ఏర్పాటు చేసుకోడానికి, ఆ ప్రాంత ప్రత్యేక అవసరాలను తీర్చటానికి వీలవుతుంది. ప్రజల మనోభావాలు తృప్తిపడుతాయి. ఈ విధంగా అంబేడ్కర్ తన మేధో శ్రామికత్వంతో ఇచ్చిన విలువైన సూచనలు, రాజకీయ సాంఘిక విప్లవ కొనసాగింపుకు ఆయన అనుసరించిన రాజ్యాంగబద్ధ సమరశీలతను ఆవాహన చేసుకున్న కెసిఆర్ అంతిమ విజయాన్ని సాధించి పెట్టారు. నీళ్ళు, నిధులు, నియామకాలపట్ల జరుగుతున్న దారుణ వివక్ష నుండి, తెలంగాణ అస్తిత్వ జవజీవమైన సాంస్కృతిక గుర్తింపు చెదిరి పోతున్న సందర్భంలో ఒక ఇతిహాసమై, చరిత్రలో మహోజ్వల ఘట్టంగా తెలంగాణ ఆవిర్భావం జరిగింది.

ఆధునిక భారతీయ పునరుజ్జీవన ఉద్యమ వెలుగుగా కొనసాగిన అంబేడ్కర్ తాత్విక ధారలో ముఖ్యమైన ‘సంక్షేమ రాజ్యభావన’ ను కెసిఆర్ గత ఐదు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. ప్రజలకు సాధ్యమైనంత తక్కువ కాలంలో సాధ్యమైనంత ఎక్కువ ప్రమాణంలో సంక్షేమ రాజ్య ఫలాలను అందచేస్తున్నారు. స్వరాష్ట్ర ఉద్యమంలో ప్రజలు తనపై మోపిన బృహత్తర బాధ్యతను అగ్రగామిగా నిర్వహిస్తూ నిరంతర చలనశీలతతో తన సహచరులతో, పాలనాధికారులతో మమేకమవుతూ ప్రస్థానాన్ని కొనసా గిస్తున్నారు.

అంబేడ్కర్ వ్యవసాయాన్ని మౌలికమైన పరిశ్రమగా గుర్తించారు. ఆహార ఉత్పత్తికి సంబంధించినది కాబట్టి అధిక ప్రాధాన్యతను ఇచ్చి భూమి సక్రమ వినియోగానికి సరైన పెట్టుబడిని, ఉత్పత్తి సాధనాలను సమకూర్చాలని, పంటల బీమాను అమలు చేయాలని, నీటిపారుదల సౌకర్యాలను కలిగించాలని వీటికే రాజ్యం బాధ్యత వహించాలని అన్నారు.ఈ వెలుగులో స్వాతంత్య్ర భారత్ చరిత్రలోనే తొలి సారిగా రైతుబంధు పథకాన్ని విజయవంతంగా కెసిఆర్ అమలు చేస్తున్నారు. భూ కమతాల విభజనలను, చిక్కులను ధరణి ద్వారా తొలగిస్తున్నారు. కోటి ఎకరాల సతత హరిత తెలంగాణ మాగాణంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రజల తక్షణ బాగోగుల కోసం పుట్టుక నుండి జీవితాంతం వరకు కెసిఆర్ కిట్స్ , కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, ఆరోగ్య రక్షణ, సన్న బియ్యం, గృహాలకు ఉచిత విద్యుత్‌లను అందిస్తూ, ఎస్‌సి, ఎస్‌టిల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను ఏర్పాటు చేస్తూ భారీ కేటాయింపులు చేస్తున్నారు.

వృత్తిపని నైపుణ్య శిక్షణ కేంద్రాలను బాగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. స్త్రీలు సాధించిన అభివృద్ధి ఆధారంగా సమాజ ప్రగతి నిర్ధారించబడుతుందనే అంబేడ్కర్ దార్శనికతలో శిశు సంక్షేమం, స్త్రీల అభివృద్ధి కి అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నారు. అంగన్‌వాడి టీచర్ల, ఆశ వర్కర్ల జీతాలను పెంచారు. బాధిత మహిళలను రక్షించటం కోసం సఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాలికల డ్రా పవుట్స్‌ని తగ్గించడం కోసం హెల్త్ కిట్స్, భారీ సంఖ్యలో గురుకుల బడులను , కళాశాలను ప్రారంభించారు. వీధి బాలలను, బాల కార్మికులను రక్షించి విద్యను అందివ్వడం కోసం ఆపరేషన్ ముస్కాన్. ఆపరేషన్ స్మయిల్‌లను నిర్వహిస్తున్నారు.

అంబేడ్కర్ విద్యపై ‘నాగరికత వలన లభించే భౌతిక ప్రయోజనాలను వదులుకోవచ్చు కాని విద్యను పొందే అవకాశం హక్కు దాని ఫలాలను అందుకోవడంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపరాదు’ అని బోధించాడు. గురుకుల విద్యను అందించడం ద్వారా శ్రామిక వర్గాల పిల్లలు ఎలాంటి ఒత్తిడి, సమస్యలు లేకుండా గుణాత్మక విద్యను అందించవచ్చని చెప్పారు. స్వరాష్ట్రం సిద్ధించాక ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలకు 900లకు పైగా గురుకులాలలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఇవన్నీ ఉత్కృష్ట స్థాయిలో నిర్వహించబడుతున్నాయి. జనరల్ విద్యా సంస్థలను కూడా గురుకులాలుగా మార్చాలని పౌర సమాజం డిమాండ్ చేస్తున్నది. ఈ విధంగా ప్రభుత్వ విద్యను ప్రజల హక్కుగా మార్చిన అంబేడ్కర్ బాటలో తెలంగాణ ప్రభుత్వం తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది.

అంబేద్కర్ ‘సమాఖ్య’ పాలనా రూపం గురించి వివరిస్తూ ‘రాజ్యాంగ శాసనం ద్వారా ఏర్పడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిమితులు ఏర్పరుచుకుని అధికారాలను విభజించుకోవటం, ఇతరుల అధికారాలను పరిమితం చేసే అధికారం ఉండకూడదు’ అని చెప్పారు. కాలక్రమంలో జాతీయ పార్టీల పాలకులు ఆర్ధిక, రాజకీయ అధికారాలను ఎక్కువగా తమ గుప్పెట్లో ఉంచుకుని రాష్ట్రాల పై పెత్తనం చలాయిస్తున్నారు. పెఢరల్ ఫ్రంట్ దిశగా అంబేడ్కర్ సూచించిన సమాఖ్య స్ఫూర్తి అమలు కోసం కెసిఆర్ జాతీయస్థాయి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.

వివేకి, మంచివాడు, దేశకాల అవసరాలు తెలిసిన విజ్ఞుడు, సమాజాన్ని సన్మార్గంలో నడిపించిన సాహసిగా అంబేడ్కర్‌ను కాలం మనకు అందించినది. చరిత్రను వెనక్కు నడిపించే ప్రతిఘాతక శక్తుల నుండి చరిత్రను ముందుకు నడిపించిన వైతాళికుడిగా అంబేడ్కర్ చిరస్మరణీయుడు. సమకాలీన భారతంలో ప్రజల ప్రగతిని, సమాజాన్ని ముందుకు సాగకుండా చేసే ఆధిపత్యాన్ని పునరుద్ధరించే శక్తులు పొంచి ఉన్నాయి. పాత అలవాట్లు, పాత ధోరణులు, పాత ఆలోచనలతో తిరోగమనంలో ముందంజ వేయడానికి మోడీ, సంఘ్‌పరివార శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజల సంక్షేమమే పరమావధిగా నడవాల్సిన రాజకీయాలు వ్యక్తిగత విశ్వాసాలైన మతం, ఆరాధనా స్థలాల చుట్టూ తిరుగుతూ వాటి ఆధారంగా మరల అధికారాన్ని పొందే అవాంఛనీయ ధోరణులు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో అంబేడ్కర్ అలోచనా ధార లో స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణం ఆయన సాధించి పెట్టిన అపూర్వ ఫలితాలను కాపాడుకుంటూ మనపై మోపిన బాధ్యతలను కొనసాగించడంలో ముందువరసలో ఉండాలి. అంబేడ్కర్ మన మధ్య ఉంటే ‘తను నిర్ధారించిన ప్రమాణాల వెలుగులో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంటందని’ సంతోషపడేవారు. అంబేడ్కర్ సంక్షేమ రాజ్య భావనను కొనసాగిస్తూ వాటి ఫలాలను ప్రజలకు అందిస్తూ ఆయనను కొనసాగిస్తున్న తెలంగాణను దేశానికి ఒక నమూనాగా నిలబెట్టే కృషిలో మమేకమవ్వడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి.

Ambedkar jayanti 2019

ఆస్నాల శ్రీనివాస్ (సభ్యులు, తెలంగాణ
గెజిటెడ్ అధికారుల సంఘం)