Home అంతర్జాతీయ వార్తలు ‘పారిస్’పై పట్టువీడేది లేదు

‘పారిస్’పై పట్టువీడేది లేదు

వాతావరణ ఒప్పందంపై అమెరికా పునరుద్ఘాటన

White-House

వాషింగ్టన్: పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా ఉపసంహరించుకోవాలనుకుంటుందని, మరిన్ని అనుకూలతులు ఇస్తేనే ఒప్పందంలోకి తిరిగివస్తుందని వైట్‌హౌస్ ఆదివారం తెలిపింది.  ఒప్పందం వైఖరిలో మెత్తబడుతున్నట్లు వచ్చిన వార్తలను అమెరికా ఖండించింది. ‘పారిస్ ఒప్పం దం నుంచి ఉపసంహరించుకోబోదని, అనుకూలతలుంటే  తిరిగి వచ్చే విషయంలో మాంట్రియల్‌లో జరిగే చర్చల సందర్భంగా ట్రంప్ పాలకవర్గం ఓ ప్రకటన చేయగలదు’అని వార్తలు వచ్చిన నేపథ్యంలో వైట్ హౌస్ స్పష్టీకరణ ఇస్తూ ప్రకటనను వెలువరించింది. ‘పారిస్ ఒప్పందంపై అమెరికా వైఖరి ఏమీ మారలేదు’ అని వైట్‌హౌస్ ప్రతినిధి లిండ్సే వాల్టర్ అన్నారు. ‘మా దేశానికి మరిన్ని అనుకూల షరతులుంటేనే తిరిగి చేరతాం లేకుంటే ఉపసంహరణ ఖాయం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు’ అని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్‌లో జర్మనీలోని బాన్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో పారిస్  ఒప్పందాన్ని బలహీనపరిచేందుకు  అమెరికా చేసిన ప్రయత్నాలపై  ఇప్పుడు మాంట్రియల్‌లో 34 దేశాల ఆర్థిక మంత్రులు సమావేశమవుతున్నారు. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా ఉపసంహరించుకుంటుందని, ఒప్పందంపై ఇదివరకటి ఒబామా పాలకవర్గం 190 దేశాలతో చేసుకున్న ఒప్పందంపై తిరిగి చర్చిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏడాది మొద ట్లో ప్రకటించారు. ఈ వాతావరణ ఒప్పందంతో చైనా, భారత్ వంటి దేశాలే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నాయని అమెరికా వాదిస్తోంది. వాతావరణ మార్పు ముప్పు దృష్టా భూతాపాన్ని ఈ శతాబ్దాంతానికి పారిశ్రామికీకరణకు ముందున్న వాతావరణ స్థాయికన్నా 2 డిగ్రీల సెల్సియస్ తగ్గించాలన్నదే పారిస్ వాతావరణ ఒప్పందం లక్షం. భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్నది అసలు లక్షం. కానీ దీనికి అమెరికా తూట్లు పొడిచేలా ఉంది. ఇప్పటికే వాతావరణ మార్పు కారణంగా అనేక ప్రకృతి విపత్తులను అనేక దేశాలు ఎదుర్కొంటున్నాయి. అమెరికాకు సైతం హరికేన్ వంటి ప్రకృతి విపత్తు లు తప్పడంలేదు. అయినా అమెరికా తన ధోరణినే ఆమోదించాలంటోంది.