Home లైఫ్ స్టైల్ పోషకాల ఉ’సిరి‘

పోషకాల ఉ’సిరి‘

Health Benefits of Indian Amlas

కార్తీకంలో ఉసిరిని తప్పకుండా తినాలంటారు. ఉసిరికాయల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఉసిరికాయను ఇంగ్లీషులో గ్రూస్‌బెర్రీ అంటారు. దీని పేరులాగే ఇవి తినడానికి కూడా పుల్లగా, వగరుగా ఉంటాయి. ఆకుపచ్చగా ఉండే వీటిలో ఔషధ గుణాలు  పుష్కలంగా ఉంటాయి.  విటమిన్ సి, విటమిన్ ఇ అధికం.  ఉసరి అనగానే నోరూరించే ఉసరి ఆవకాయ, మిగతా పచ్చళ్లు గుర్తొస్తాయి..

ఉసిరి నువ్వుల పచ్చడి

కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు- 1కేజీ, నువ్వులు-1/4 కేజీ, కరివేపాకు రెబ్బలు-2, నిమ్మకాయలు-7, వెల్లులి-60గ్రా., పోపు దినుసులు-3 టీస్పూన్లు, ఎండుమిర్చి-5, మెంతిపొడి-50గ్రా., కారం-తగినంత, ఉప్పు-తగినంత
తయారీ విధానం: నువ్వులను దోరగా వేయించాలి. చల్లారాక పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయల పొట్టు తీసి దంచుకోవాలి. ఉసిరికాయలను కడిగి తడిలేకుండా తుడవాలి. తర్వాత చాకుతో చిన్నచిన్న గాట్లు పెట్టి నూనెలో మగ్గించాలి. నూనె చల్లారాక అందులో కారం, మెంతిపొడి, ఉప్పు, వెల్లులి ముద్ద, నువ్వుల పొడి వేసి బాగా కలియతిప్పాలి. ఇప్పుడు చిన్న బాణలిలో నూనె కొద్దిగా వేడి చేసి అందులో ఎండుమిర్చి, కరివేపాకు, పోపుదినుసులు, వేయించి దించేయాలి. ఆ తాలింపులో నిమ్మరసం చేర్చి..ఉసిరికాయల్లో కలపాలి.

కొబ్బరి పచ్చడి

కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ ముక్కలు-1/4 కప్పు, కొబ్బరి ముక్కలు-1/2 కప్పు, పసుపు-చిటికెడు, పచ్చిమిర్చి-6, ఎండుమిర్చి-4, నూనె-3టేబుల్ స్పూన్లు, ఆవాలు-1/4 టీస్పూన్, జీలకర్ర-1/4 టీస్పూన్, సెనగపప్పు-1/4టీస్పూన్, మెంతులు-1/4 టీస్పూన్, ఉప్పు-తగినంత
తయారీ విధానం: కళాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మెంతులు, పసుపు, ఎండుమిర్చి వేయించుకోవాలి. అవి చల్లారాక ఉసిరికాయలు ముక్కలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఉసిరి, కొబ్బరిపచ్చడి తయారైనట్లే.

ఆవకాయ పచ్చడి

కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు-1/2 కిలో, నువ్వుల నూనె-1+1/2 కప్పులు, పసుపు- 1టీస్పూన్, జీలకర్ర-1 టీస్పూన్, ఆవపొడి-3 టీస్పూన్లు, నిమ్మకాయలు-4, రాతి ఉప్పు-1+1/4 కప్పులు
తయారీ విధానం: ఉసిరికాయల్ని కడిగి పొడిబట్టతో తుడిచి ఎక్కడా తడి అంటకుండా కాసేపు ఎండనివ్వాలి. కాయలకు నిలువుగా గాట్లు పెట్టి ఉంచాలి. రాతి ఉప్పుని మెత్తగా దంచుకోవాలి. తర్వాత కాయల్ని ఓ జాడీలో వేసి ఉప్పు, కారం, పసుపు, ఆవపొడి, మెంతిపొడి వేసి బాగా కలిపి 3 రోజులు ఊరనివ్వాలి. ఊరి పచ్చడిలో నీళ్లు వస్తాయి. ఇప్పుడు గరిటెతో బాగా కలపాలి. తర్వాత వేడి చేసి, నూనె బాగా ఆరిన తర్వాత పచ్చడిలో కలిపి నిమ్మరసం పిండుకుంటే ఉసిరి ఆవకాయ తయారయిపోతుంది.

పల్లి పచ్చడి

కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు-8, పల్లీలు-1/4 కప్పు, పచ్చిమిర్చి-10, జీలకర్ర-2 టీస్పూన్లు, వెల్లులి రెబ్బలు-5, పసుపు-చిటికెడు, కరివేపాకు-5 రెబ్బలు, ఆవాలు-1/4 టీస్పూన్, ఎండుమిర్చి-2, మినపప్పు-1టీస్పూన్, పచ్చిసెనగపప్పు-1 టీస్పూన్, నూనె-3 టీస్పూన్లు, ఉప్పు-తగినంత
తయారీ విధానం: ముందుగా ఉసిరికాయల్ని ఉడికించి గింజలు తీసేయాలి. పల్లీలను నూనె లేకుండా వేయించి తీయాలి. పాన్‌లో నూనె వేసి పచ్చిమిర్చి, 1 టీస్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఇప్పుడు ఉడికించిన ఉసిరికాయ ముక్కలు, వేయించిన పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, పసుపు, వెల్లుల్లి, వేయించిన పల్లీలు అన్నీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. కళాయిలో నూనె వేసి కాగాక 1 టీస్పూన్ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిసెనగపప్పు, కరివేపాకు వేసి వేయించుకుని పచ్చడిలో కలుపుకోవాలి.

Health Benefits of Indian Amlas

Telangana Latest News