Home దునియా చెదరని సాక్షం భీమని సముద్రం

చెదరని సాక్షం భీమని సముద్రం

Bhimuni-cheruvu

తరాలచరిత్రకు,సంస్కృతికి,వారసత్వానికి చెరగని చిరునామాగా గత రాజులపాలనకు మౌనసాక్ష్యాలుగా తెలంగాణలోని చెరువులు నేటికి సాగుభూములకు నీరు అందిస్తున్నాయి. గ్రామాలను నిర్మించి, చెరువులను తవ్వించి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన రాజుల చరిత్రలు శాసనాల్లో నేటికి భద్రంగా ఉండి తరతరాలకు ఆనాటి వైభవాన్ని చాటుతున్నాయి. ప్రాచీన వర్తమానపురంలోని భీమని సముద్రం చరిత్రకు చెరగని సాక్ష్యం. వర్తమాన మహావీరుడు నడయాడిన ప్రాంతమిది. ఆయన బోధనలతో పునీతమైన నగరమిది. ఇక్కడ ప్రతి అణువులోను చరిత్ర నిక్షిప్తమైఉంది. వర్తమానపురం మహబూబ్‌నగర్ జిల్లాలోని నందివడ్డెమాన్ పట్టణమే వందలాది సంవత్సరాల క్రితంనాటి వర్తమాన పురంలోని భీమని సముద్రం నేటికి వ్యవసాయరంగానికి బాసటగా నిలిచింది. క్రీస్తుశకం 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన జైన మతప్రచారకులు ఇక్కడ నివాసం ఏర్పరుచుకున్నారు. ఆ పరంపరలో జైనమత తీర్థంకరులలో 24వ వర్థమాన మహావీరుడు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో ఆయన పేరుతో వర్తమానపురంగా విరాజిల్లింది, కాలక్రమేణ వడ్డెమాన్గా ప్రసిద్ధిచెందింది.

ఇదిప్రాచీన చరిత్రకాకుంగా అనేక రాజవంశాలు భీమని సముద్రం ప్రాంతాల్లోనే పాలనచేయడం గమనార్హం. సుమారు రెండువేల సంవత్సరాల చరిత్రను దాచుకున్న వడ్డెమాన్ ప్రాంతాన్ని కందూరు చోడుల నుంచి కాకతీయరాజులు స్వాధీనం చేసుకుని గోనబుద్దారెడ్డిని సామంతరాజుగా నియమించారు. ఇక్కడ గోనబుద్దారెడ్డి రంగనాథరామాయణం రాసి తెలంగాణ సాహిత్య వైభవాన్ని ద్విగుణీకృతం చేశారు. ద్విపద చందస్సులో రంగనాథరామాయణం పుట్టిన వర్తమానపురాన్ని బుద్దారెడ్డి అనంతరం గోనగన్నారెడ్డి పరిపాలించారు. ఆ తర్వాత గన్నారెడ్డి అల్లుడు మల్యాలగుండ దండీశుడు పరిపాలించినట్లు ఆధారాలు లభ్యమవుతున్నాయు. గోనబుద్దారెడ్డి కూతురు గుండేశ్వర ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు. అనేక రాజవంశాలకు నెలవై సుమారు రెండువేల సంవత్సరాల చరిత్రకు శాసనాధారమైన ప్రాచీన వర్తమాన పురంలోని భీమసముద్రం నిర్మాణ తేదీలు ఆరవశతాబ్దంలోనివి లభ్యంకాకున్నా గంగాపురశాసనం మేరకు క్రీస్తుశకం 1116 వ సంవత్సరంలో నిర్మించినట్లు స్పష్టం అవుతుంది. భీమనసముద్రం చెరువు సహజసిద్దమైన ఊటలతో నీరునింపుకున్న ఈ చెరువు శతాబ్దాల నుంచి ప్రజల నీటి అవసరాలను తీర్చుతుంది. చెరువు కింద నేటికి 550 ఎకరాల ఆయకట్టు ఉంది. మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్ధరణ పనులు జరగడంతో జలకల అలరాలుతుంది.

మహాత్మగాంధీ ఎత్తిపోతల పథకం లో భాగంగా కాలువలతో చెరువు నింపారు. చెరువు నిండటంతో వర్తమానపురం వ్యవసాయక్షేత్రాలతో నిండిపోయింది. ఇదిలా ఉండగా వడ్డెమాన్ లో ఆనాటి ఆలయాలు, కట్టడాలు,గ్రామంచుట్టూ కందకాలు నేటికి అగుపిస్తాయి. బాదామి చాళుక్యులు, కళ్యాణచాళుక్యులు, కాకతీయులు ,జైన మత ఆనవాళ్లు నేటికి భద్రంగా ఉన్నాయి.గ్రామంలో గోనగన్నారెడ్డి కాలం నాటి శాసనం నల్లరాతి బండపై చెక్కు చెదరక ఉంది. కాకతీయురాజ్యానికి పశ్చిమాంధ్ర రాజధానిగా నిర్ణయించి గోనబుద్దారెడ్డిని సామంతరాజుగా నిమించడంతో కాకతీయ వైభవం ఇక్కడ విరాజిల్లింది. తాగునీటి బావులు ఆలయాల నిర్మాణాలు జరిగాయి. క్రీస్తుపూర్వం నుంచి అనేక రాజవంశాల ఏలుబడిలో ఉన్న వర్తమానపుర నిర్మాణానికి అక్కడి జలవనరులే ప్రధానం అయ్యాయి. నీరు ఎక్కడ సమృద్దిగా ఉంటుందో అక్కడ నాగరికత విరాజిల్లుతుందనేది చారిత్రిక సత్యం.. అందుకే ఊరికి తల్లిలాంటి చెరువులను భద్రంగా కాపాడుకోవడం మన బాధ్యక కాదా…!