Home ఎడిటోరియల్ టిడిపి గడుసుతనం

టిడిపి గడుసుతనం

TDP

లోక్‌సభలో తమ అవిశ్వాస తీర్మానం చర్చకు రానందుకు తెలుగుదేశం పార్టీ వారు టిఆర్‌ఎస్‌ను నిందించటం కేవలం గడుసుతనం. వారికి తమ తీర్మానం చర్చకు రావాలనే ఆతురత ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు. కాని అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు, పార్టీలకు తమ సమస్యల గురించి అంతే ఆతురత ఉంటుందన్నది వారు అర్థం చేసుకోలేని విషయమా? ఎంతమాత్రం కాదు. అయినప్పటికీ టిఆర్‌ఎస్‌నుగాని, అన్నా డిఎంకెను గాని నిందించటంలో కనిపించేది వారి స్వార్థం. టిడిపి ఒక్కటే కాదు. సీమాంధ్ర ధనిక వర్గాలు మొదటినుంచి కూడా ప్రపంచంలో అన్నీ తమ ప్రయోజనాలకు అనుగుణంగా జరగాలని, అందరూ వారి అవసరాలను వదలుకుని తమకు అనుకూలంగా నడుచుకోవాలని ఆలోచించటం మామూలూ పోయింది. ఆ విధమైన స్వభావం నేటికీ మారలేదు. పైగా హోదా, ప్యాకేజీ విషయమై స్వయంగా వారే రకరకాల డ్రామాలు ఆడుతున్నారు గతం నుండి కూడా.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న బిజెపి ఇపుడది సాధ్యం కాదంటున్నది గనుక నరేంద్రమోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీ సు ఇచ్చింది తెలుగుదేశం. దీనంతటిలో మనకు పేచీ ఉండవలసింది ఏమీ లేదు. పైగా, ఆ రాష్ట్రానికి ప్రత్యే క హోదా ఇవ్వటమే సమంజసమని టిఆర్‌ఎస్ బహిరంగంగా మద్దతు ప్రకటించగా, తెలంగాణకు చెందిన ఇతర వర్గాలు కూడా సానుభూతి చూపుతున్నాయి. ఇది, టిడిపి అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వ టం కన్న, ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు మొదలుకావటం కన్నా ముందునుంచీ ఉన్న వైఖరి. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి నాలుగు సంవత్సరాలు అవుతున్నా తెలంగాణను వీలైనన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం పట్ల అనుకూలంగా ఉండవలసిన అవసరం ఏమీ లేదు. అయినప్పటికీ ఉదార భావంవల్ల కొంత, ఒక తోటి తెలుగు రాష్ట్రం నష్టపోకూడదనే ఆలోచనతో మరికొంత, ఇది రాష్ట్రాల హక్కులనే ఫెడరల్ దృష్టితో ఇంకొంత టిఆర్‌ఎస్ ఇటువంటి వైఖరి తీసుకుంది. మోడీ ప్రభుత్వ ప్రోద్బలంతో పార్లమెంటులో ఇట్లా వ్యవహరించే వారైతే అసలు ఆ డిమాండ్‌కు మద్దతు ప్రకటించ వలసిన అవసరం ఏముంటుంది? వాస్తవానికి హోదా ప్రశ్నపై మొదటినుంచి కేంద్రం తో దోబూచులాడింది టిడిపి ప్రభుత్వ మన్నది ఈ నాలుగేళ్లలో అడుగడుగునా కన్పించిన విషయం. హోదా సాధ్యం కాదన్నది రాష్ట్రం విడిపోయిన తొలి నాళ్లలోనే అర్థమైంది అందరికీ. కాని ఆ మాటను తమవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సూటిగా చెప్పే సాహసం టిడిపి, బిజెపి ప్రభుత్వాలకు లేకపోయింది. ఆ ప్రశ్నపై అవును, కాద ని స్పష్టంగా చెప్పకుండా గజిబిజిగా మాట్లాడుతూ రెండేళ్లు గడిపారు. తర్వాత ప్యాకేజీ అనే కొత్త అంశంపై నాటకంలో రెండవ అంకం మొదలుపెట్టారు. దాని స్వరూప స్వభావాలు ఏమిటో కూడా ప్రజలకు ఎన్నడూ స్పష్టంగా వివరించలేదు. అది వివరాలు చెప్పలేని బ్రహ్మ పదార్థం ఏమీ కాదు. అయినప్పటికీ ఢిల్లీ వారు ఒకటి అంటారు, అమరావతి వారు మరొకటి అంటారు. ఇవాళ అన్నది రేపు అనరు, రేపన్నది ఎల్లుండి చెప్పరు. ప్యాకేజీ అనే దానిలో ఏమేమి ఉంటా యి, అవి ఏయే దశలలో ఏ మేరకు అందుతాయి, అందుకు వర్తించే నిబంధనలు, షరతులు ఏమిటి అనేది సమగ్రంగా కాగితాలపై రాసి, టిడిపి ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అన్ని రాజకీయ పార్టీలకు సర్కులేట్ చేసి, తర్వాత కొద్ది సమయం ఇచ్చి ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి చర్చించినట్లయితే విషయం ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగే అవకాశం ఉండేది. అటువంటి ప్యాకేజీ వివరాలపై సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావచ్చు గాక. మరిన్ని డిమాండ్లు వస్తుపరంగా కాని, నిబంధనలపరంగా కాని రావచ్చుగాక. చివరకు స్థూలమైన అంగీకారం ఏదైనా ఒకవేళ వస్తే మంచిదయేది. ఒకవేళ రాకపోయినప్పటికీ కనీసం వ్యవహారాలు ఒక పద్ధతి ప్రకారం నడిచేవి. అందులో పారదర్శకత ఉండేది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్ని విషయాలపై స్పష్టత కన్పించేది.
కాని ఇటువంటిది ఏమీ చేయక తెలుగుదేశం, బిజెపి ప్రభుత్వాలు రెండూ కూడా అధికార క్రీడలు, రాజకీయ క్రీడలు సాగించాయి. ఇప్పటికీ సాగిస్తున్నాయి. రెండూ కలిపి ప్రజలను మభ్యపెట్టాయి. ప్రత్యేక హోదా తప్పనిసరి కాదు, ప్యాకేజీ చాలునన్న మాటను పదిరకాలుగా అటుఇటు తిప్పి మాట్లాడింది చంద్రబాబు ప్రభుత్వమే. తమవద్ద ప్రజలనుంచి, ప్రతిపక్షాలనుంచి వత్తిడి వచ్చినపుడు హోదా అంటారు. వత్తిడి తగ్గినపుడు ప్యాకేజీ అంటారు. తిరిగి ప్యాకేజీకి సంబంధించి, వత్తిడి లేనపుడు ఇంచుమించు సంతృప్తి వ్యక్తపరుస్తారు, వత్తిడి వస్తే అసలేమీ రావటం లేదు శూన్యమంటారు. ఈ రంగు ల రాట్నం రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించలేదనుకోవటం ఆత్మవంచన అవుతుంది.
విషయమేమంటే, అటుఇటుగా నాలుగేళ్లపాటు నడిచిపోయిన ఈ నాటకం మిగిలిన ఏడాది కూడా నడిచిపోతుందని టిడిపి, బిజెపి ఆశించాయి. కాని, మొదటినుంచి గల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వత్తిడి, ప్రజల మనోభావాలు ఉండనే ఉండగా ఇటీవల పవన్ కళ్యాణ్ తదితరుల రంగప్రవేశంతో విషయం నాటకీయమైన మలుపు తిరిగింది. దానితో వత్తిడి భరించలేకుండా మారింది. అపుడిక విధిలేని పరిస్థితులలో చంద్రబాబు ఇతరులకన్న తానే ఎక్కువ హంగామా చేసి హోదా ఆందోళన ఖ్యాతిని సంపాదించాలనుకున్నారు. ఏప్రిల్ 6న తమ ఎంపి లు రాజీనామా చేయగలరని జగన్మోహనరెడ్డి ప్రకటించటంతో కలవరపడిన చంద్రబాబు అంతకన్న ముందే కేంద్రంలోని తమ మంత్రులతో రాజీనామా చేయించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విలేకరుల సమావేశాన్ని మిషగా చూపి ఎన్‌డిఎ నుంచి బయటకు వచ్చారు. తర్వాత జగన్‌పార్టీ, చంద్రబాబు పార్టీల మధ్య అవిశ్వాస తీర్మానం ఒక పోటీ రాజకీయంగా మొదలైంది. ఈ తీర్మానం ఇచ్చిన పేరుతో ప్రజలను తమవైపుతిప్పుకోవాలన్నది ఇరువురి తాజా తాపత్రయం.
ఇంతకూ ఇదంతా వారి రాజకీయం గనుక మనకు సమస్య కానక్కరలేదు. మంచిగాని, చెడుగాని, నిజాయితీ ఉన్నా లేకున్నా ఎవరి అధికార క్రీడలు ఆడుకునే స్వేచ్ఛ వారికి ఉంటుంది. కాని అందుకు కలసి రావ టం లేదంటూ టిఆర్‌ఎస్‌నుగాని, మరొకరిని గాని నిందించే హక్కు ఎక్కడినుంచి వస్తుంది? వారిది హోదా పై అయినా, ప్యాకేజీపై అయినా మొదటినుంచి సూత్రబద్ధంగా, నిజాయితీతో సాగు తూ వస్తున్న వ్యవహారం అయితే మరొక విధంగా ఉండేది. కాని, పైన వివరించుకున్నట్లు వారిది ఈ రెండు అంశాలపై అడుగడుగునా రాజకీయమే అయినపుడు, ఈ నిందలలో కన్పించేది కపట ధోరణి మాత్రమే.
అయినా 1956 నుంచి 2014వరకు సీమాంధ్ర ధనిక వర్గాలు తెలంగాణ పట్ల ఇదే క్రీడను, కపటపు స్వభావాన్ని ప్రదర్శించాయి. హోదా లేక ప్యాకేజి అన్నది విభజన వల్ల ఉత్పన్నమైన సమస్య అనేది నిజ మే. కాని అదే విధంగా విభజనవల్ల తెలంగాణకు ఉత్పన్నమైన సమస్యల విషయంలో చంద్రబాబు
ప్రభుత్వం చేస్తున్నదేమిటి? ఇతరత్రా సీమాంధ్ర ధనిక వర్గాల వైఖరి ఏమిటి? ఆ సమస్యలు కేంద్రం వల్ల వస్తున్నవి అయితే టిడిపి ప్రభుత్వాన్ని అనగలది లేదు. కాని చంద్రబాబు ప్రభుత్వం స్వయంగా సృష్టిస్తున్న సమస్యలు, పెడుతున్న అర్థంలేని పేజీల జాబితా చాలా పొడవైనదే. ఇదంతా బుద్ధిపూర్వకంగా విస్మరిస్తున్న ఆ పార్టీ వారు ఢిల్లీలో, అమరావతిలో టిఆర్‌ఎస్‌పైన దుష్ప్రచారాలు సాగిస్తున్నారు. ఇదే గడుసుతనం అంటే. ఇంత కూ ఆ తీర్మానంపై చర్చ జరిగినా, తీవ్రమైన విమర్శలతో ప్రజల మద్దతు సంపాదనకు టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలు పోటీపడటం మినహా జరిగేది ఏమీ ఉండదని వేరే చెప్పనక్కరలేదు.నాటకంలో అది మరో భాగమవుతుంది. పోతే, మొదటనే అనుకున్నట్లు, టిఆర్‌ఎస్ లేవనెత్తుతున్న రిజర్వేషన్ తదితర అంశాలు తెలంగాణకు తక్కువ ముఖ్యమైనవేమీ కాదు. అందుకు టిడిపి మద్దతు ఉందా మరి? అయినప్పటికీ ఇతరులంతా తమకు ముఖ్యమైన వాటిని వదులుకుని, టిడిపి నాలుగేళ్లుగా నడుపుతున్న హోదాప్యాకేజీ కపటపు ఎత్తుగడలకు కలసివచ్చే విధంగా వ్యవహరించాలన్నమాట. ఇటువంటి ప్రచారాలు గోబెల్స్ వలె సాగితే కొందరైనా నమ్మే అవకాశం ఉన్నందున వాటిని తీవ్రంగా ఖండించటం అవసరం.

టంకశాల అశోక్
9848191767