Home దునియా పవళించని పద్మనాభుడు

పవళించని పద్మనాభుడు

Anantha-Padmanabha-Swamy-Te

తెలంగాణ ఊటీ అంటే అనంతగిరి కొండలు. అక్కడి వెలసిన స్వామియే అనంతపద్మనాభ స్వామి. ప్రకృతి రమణీయంగా ఉండే ఇక్కడి దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఉన్న ఆలయ సందర్శన భక్తి భావాన్ని పెంపొందిస్తోంది. అనంతమైన సిరిసంపదలు ఆ దేవుడు ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం.  లక్ష్మీసమే తంగా పద్మనాభస్వామి ఇక్కడ నిలబడిన భంగిమలో సాలగ్రామ శిలారూపంలో కనిపిస్తాడు. మూసీ నది జన్మస్థానంగా, అనంత పద్మనాభుడి దివ్యధామంగా వికారాబాద్‌లోని అనంతగిరి విరాజిల్లుతోంది. ఇక్కడి గాలి ఔషధాలతో కలిసి సర్వరోగనివారణి, ఆరోగ్యకరమైనది. విశాలమైన ప్రాంగణం. లోపలికి వెళితే గుడిగోపురాలు కనిపిస్తాయి. ఇక్కడ ఉసిరిచెట్టు చాలా మహిమగలదని భక్తుల విశ్వాసం. మార్కండేయ తపోవనం మరో ఆకర్షణ. ఒక గుహలో మార్కండేయ విగ్రహం, వేణుగోపాలస్వామి దేవస్థానం పాలరాతి విగ్రహం ఇక్కడ ప్రత్యేకతలు. భక్తులు తమ కోరికలు నెరవేరితే రాయిమీద రాయిపెట్టి కొండలా పేర్చి మొక్కులు తీర్చుకుంటారు.

ఎలా చేరుకోవాలి? 

అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలయం హైద రాబాద్‌కు 70 కి.మీ దూరంలో ఉంది. భాగ్య నగరంలోని ప్రధాన బస్‌స్టేషన్ల నుంచి తాండూరు వెళ్లే బస్‌లో వికారాబాద్ వరకూ వెళ్లొచ్చు. అక్కడి నుంచి ఆటోలో ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. సికింద్రాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి రైలు సదుపాయం కూడా ఉంది. వికారాబాద్ రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.

సుమారు అయిదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన వైష్ణవ పుణ్య క్షేత్రం అనంతగిరి పద్మనాభస్వామి దేవాలయం. విష్ణుపురాణం ప్రకారం… విష్ణుమూర్తి పాన్పు అయిన శేషుని తలభాగం తిరుమలగా, మధ్య భాగం అహోబిలంగా, తోకభాగం అనంతగిరిగా వెలుగొందుతోంది. ఇక్కడే సుమారు పధ్నాలుగు వేల సంవత్సరాల పాటు మార్కండేయ మహర్షి తపస్సు చేసి శ్రీమహా విష్ణువు ఈ కొండల్లోనే కొలువై ఉండేటట్లుగా వరాన్ని పొందుతాడు. సాలగ్రామ శిలగా వెలసిన ఆ శ్రీహరిని మార్కండేయుడు కాశీ నుంచి గంగాజలం తీసుకువచ్చి అర్చించినట్లు పురాణాలు చెపుతున్నాయి. కలియుగ ప్రారంభ సమయంలో మార్కండేయుడు పద్మనాభ స్వామిని ఇక్కడికి వచ్చిన వారందరికీ గంగా స్నాన భాగ్యం కలిగేట్లుగా అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. అప్పుడు స్వామి ఆనతి మేరకు గంగాదేవే స్వయంగా అనంతగిరి క్షేత్రానికి వచ్చి పుష్కరిణిగా మారిందట.

మూసీనది పుట్టుక : రాజర్షి అయిన ముచుకుందుడు దేవేంద్రుడి కోరిక మేరకు సుమారు వెయ్యి సంవత్సరాల పాటు రాక్షసులతో పోరాడి, విజయం సాధిస్తాడు. దీనికి ప్రీతి చెందిన ఇంద్రుడు ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు.అప్పుడు ముచుకుందుడు ‘ఓ మహేంద్రా, సుదీర్ఘకాలంపాటు రాక్షసులతో పోరాడటం వల్ల నాకు నిద్ర కరువైంది. ఎలాంటి ఆటంకం కలగకుండా నిద్రపోయే అందమైన ప్రదేశాన్ని చూపించు. ఒక వేళ ఎవరైనా నాకు నిద్రా భంగం చేస్తే వారు వెంటనే భస్మమయ్యేటట్లు వరాన్ని అనుగ్రహించమంటాడు. అందుకు ఇంద్రుడు అనంతగిరి గుహల్లో నిద్రపొమ్మని సూచిస్తాడు. ఇదిలా ఉండగా బలరామకృష్ణులను అంతమొందించడానికి వస్తున్న యవనుడి నుంచి రక్షణ పొందడానికి అన్నదమ్ములిద్దరూ ముచుకుందుడు నిద్రిస్తున్న గుహలోకి ప్రవేశిస్తారు. వీరిని అనుసరిస్తున్న కాలయవనుడు గుహలో నిద్రపోతున్న ముచుకుందుడిని చూసి, కృష్ణుడనుకుని పొరబడి ఆగ్రహంతో దాడిచేస్తాడు. దాంతో ముచుకుందుడు నిద్ర మేల్కొనడం యవనుడు భస్మం కావడం ఏకకాలంలో జరిగిపోతాయి. అనంతరం శ్రీకృష్ణుడిని చూసిన ముచుకుందుడు తన కమండలంలోని జలంతో స్వామిని అర్చించి, నదిగా మారి ఎప్పుడూ కృష్ణుడి పాదాల చెంతే ఉండే విధంగా వరాన్ని పొందుతాడు. అలా ముచుకుందుడి కోరిక మేరకు అతని పేరు మీద ముచుకుంద నది ఏర్పడిందట. కాలక్రమంలో అది మూసీనదిగా ప్రసిద్ధి చెందిందని స్థలపురాణం తెలియ జేస్తోంది. కృష్ణానదికి మూసీ ఉపనది. స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఏడు గుండాలు ఉంటాయి. ఇవి కాలక్రమంలో శిథిలావస్థకు చేరాయి.

ఆషాఢం, కార్తీకాలలో వైభవంగా ప్రత్యేక పూజలు : ఇక్కడ కార్తీకమాసంలో దేవతలు వచ్చి స్నానాలు ఆచరిస్తారని భక్తుల నమ్మకం. ఏటా అనంతగిరిలో రెండుసార్లు ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున చిన్న జాతరను నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలూ, పల్లకీ సేవా, అనంతరం పెరుగు వసంతాన్నీ కనుల పండగగా చేస్తారు. కార్తిక మాసంలో కార్తీక పౌర్ణమినాడు పెద్దజాతరను అనంత పద్మనాభుడికి వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ రోజుల్లో రోజుకొక వాహనం మీద స్వామివారిని ఊరేగిస్తారు. కార్తిక పౌర్ణమినాడు నిర్వహించే రథోత్సవం, చక్రస్నానాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. మహబూబ్‌నగర్, హైదారాబాద్, రంగారెడ్డి జిల్లా వాసులతో పాటు కర్నాటక, మహారాష్ట్ర జిల్లాల నుండి అనేకమంది భక్తులు అనంత పద్మనాభుడిని కొలుస్తారు. ఆయనను కొలిచిన వారికి ధనం, ధాన్యం వృద్ధి చెందుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. స్వామివారికి నిత్యం ప్రత్యేక పూజలతో పాటు ఉదయంపూట నిజరూపదర్శనం కూడా ఉంటుంది. కోరికలు తీరడానికి రాళ్ళమొక్కులు కూడా కనిపిస్తాయి. ఇంకా ఉత్సవాలు, యాగాలు, అనంతవ్రతాలు జరుగుతాయి.