Home ఆఫ్ బీట్ పవళించని అనంతగిరి పద్మనాభుడు

పవళించని అనంతగిరి పద్మనాభుడు

Anantha Padmanabhudu in Ananthagiri hills

 

భక్తుల పాలిట కొంగు బంగారంగా, సిరిగల స్వామిగా ప్రసిద్ధి చెందిన దైవం అనంత పద్మనాభుడు, ఇక్కడ స్వామి శేషతల్పం మీద పవళించినట్టుగా కాకుండా నిలబడిన భంగిమలో సాలగ్రామ శిలా రూపంలో దర్శనమిస్తాడు. మూసీ నది జన్మస్థానంగా, అనంత పద్మ నాభుడి దివ్యధామంగా వికారాబాద్‌లోని అనంతగిరి విరాజిల్లుతుంది.

అనంతా నంత దేవేశ అనంత ఫలదాయక! అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమః॥ అంటూ.. అనంతమైన సిరిపంపదలు ఇచ్చే ఆ దేవుడిని ధ్యానిస్తూ ఈ క్షేత్రానికి చేరుకుంటారు భక్తులు. అమితమైన భక్తితో స్వామిని దర్శించి పులకిస్తారు. అనంతగిరి కొండల్లో కొలువైన ఈ ఆలయ సందర్శనం ఎంతటి భక్తి భావాన్ని పెంపొందిస్తుందో, ప్రకృతి కాంతకు పచ్చనిచీర కట్టినట్లుండే ఇక్కడి మనోహర దృశ్యాలూ అంతటి మధురానుభూతిని కలిగిస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా పేర్కొంటారు.

స్థలపురాణం: సుమారు అయిదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన వైష్ణవ పుణ్య క్షేత్రం అనంతగిరి పద్మనాభ స్వామి దేవాలయం. విష్ణు పురాణం ప్రకారం.. విష్ణుమూర్తి పాన్పు అయిన శేషుని తల భాగం తిరుమలగా, మధ్య భాగం అహోబిలంగా, తోక భాగం అనంతగిరిగా వెలుగొందుతోంది. ఇక్కడే సుమారు పద్నాలుగు వేల సంవత్సరాల పాటు మార్కేండేయ మహర్షి తపస్సు చేసి శ్రీమహావిష్ణువు ఈ కొండల్లోనే కొలువై ఉండేటట్లుగా వరాన్ని పొందుతాడు. సాలగ్రామ శిలగా వెలసిన ఆ శ్రీహరిని మార్కేండేయుడు కాశీ నుంచి గంగా జలం తీసుకువచ్చి అర్పించినట్లు స్థల పురాణం తెలియజేస్తోంది. కలియుగ ప్రారంభ సమయంలో మార్కేండేయుడు పద్మనాభ స్వామిని ఇక్కడికి వచ్చిన వారందరికీ గంగా స్నాన భాగ్యం కలిగేటట్లుగా అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. అప్పుడప్పుడు స్వామి ఆనతి మేరకు గంగా దేవే స్వయంగా అనంతగిరి క్షేత్రానికి వచ్చి పుష్కరిణిగా మారిందట.

ముచుకుందే మూసీ.. రాజర్షి అయిన ముచుకుందుడు దేవేంద్రుడి కోరిక మేరకు సుమారు వెయ్యి సంవత్సరాల పాటు రాక్షసులతో పోరాడి, విజయం సాధిస్తాడు. దీనికి ప్రీతి చెందిన ఇంద్రుడు ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ముచుకుందుడు ‘ఓ మహేంద్రా’, సుదీర్ఘకాలం పాటు రాక్షసులతో పోరాటం వల్ల నాకు నిద్ర కరువైంది. ఎలాంటి ఆటంకం కలగకుండా నిద్రపోయే అందమైన ప్రదేశాన్ని చూపించు. ఒక వేళ ఎవరైనా నాకు నిద్రా భంగం చేస్తే వారు వెంటనే భస్మమయ్యేటట్లు వరాన్ని అనుగ్రహించ’మంటాడు. అందుకు ఇంద్రుడు అనంతగిరి గుహల్లో నిద్రపొమ్మని సూచిస్తాడు.

ఇదిలా ఉండగా బలరామకృష్ణులను అంతమొందించడానికి వస్తున్న యవనుడి నుంచి రక్షణ పొందడానికి అన్నదమ్ములిద్దరూ ముచుకుందుడు నిద్రిస్తున్న కాలయవనుడు గుహలో నిద్రపోతున్న ముచుకుందుడిని చూసి, కృష్ణుడనుకుని పొరబడి ఆగ్రహంతో దాడి చేస్తాడు. దాంతో ముచుకుందుడు నిద్ర మేల్కొనడం యవనుడు భస్మం కావడం ఏకకాలంలో జరిగిపోతాయి. అనంతరం శ్రీకృష్ణుడిని చూసిన ముచుకుందుడు తన కమండలంలోని జలంతో స్వామిని అర్చించి, నదిగా మారి ఎప్పుడూ కృష్ణుడి పాదాల చెంతే ఉండే విధంగా వరాన్ని పొందుతాడు. అలా ముచుకుందుడి కోరిక మేరకు అతని పేరు మీద ముచుకుంద నది ఏర్పడిందట. కాలక్రమంలో అది మూసీనదిగా ప్రసిద్ధి చెందిందని స్థల పురాణం తెలియజేస్తోంది.

ఏటా రెండు సార్లు: ఏటా అనంతగిరిలో రెండు సార్లు ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున చిన్న జాతరను నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలూ, పల్లకీ సేవా, అనంతరం పెరుగు వసంతాన్నీ కనుల పండగగా చేస్తారు. కార్తిక మాసంలో అనంత పద్మనాభుడికి వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ రోజుల్లో రోజుకొక వాహనం మీద స్వామి వారిని ఊరేగిస్తారు. కార్తిక పౌర్ణమినాడు నిరహించే రథోత్సవం, చక్రస్నానాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

ఇలా చేరుకోవాలి: అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయాన్ని చేరుకోవడానికి రైలు,రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌కి 70 కిలో మీటర్ల దూరంలో ఉందీ ఆలయం. భాగ్యనగరంలోని ప్రధాన బస్‌స్టేషన్ నుంచి తాండూరు వెళ్లే బస్‌లో వికారాబాద్ వరకూ వెళ్లొచ్చు. అక్కడి నుంచి ఆటోలో ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. సికింద్రాబాద్,లింగంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి రైలు సదుపాయం కూడా ఉంది. వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.

Anantha Padmanabhudu in Ananthagiri hills

Telangana Latest News