Home తాజా వార్తలు అపరిష్కృత విభజనాంశాలకు వెంటనే పరిష్కారం

అపరిష్కృత విభజనాంశాలకు వెంటనే పరిష్కారం

Andhra Pradesh Reorganization law Issues : KCR meet PM

సిఎం కెసిఆర్‌కు రాజ్‌నాథ్ సింగ్ హామీ 

కేంద్ర హోం, ఆర్థిక మంత్రులను కలుసుకున్న ముఖ్యమంత్రి
విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని పలు సంస్థల వాటాల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదని, వివిధ కార్పొరేషన్ల సమస్య కూడా అలాగే ఉందని రాజ్‌నాథ్‌కు వివరించిన సిఎం
చట్టంలో స్పష్టత ఉన్నా పరిష్కారం కాకపోవడం బాధాకరమన్న కెసిఆర్
ఎఫ్‌ఆర్‌బిఎం కింద రుణపరిమితి పెంచడానికి అనుమతివ్వాలని అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి
వెనుకబడిన జిల్లాలకు నాల్గో విడత సాయం తక్షణం మంజూరు చేయాలనీ అభ్యర్థన 

మన తెలంగాణ / న్యూఢిల్లీ, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలను వెంటనే పరిష్కరిస్తామని, ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలను సత్వరమే పరిష్కరించే విధంగా సీనియర్ అధికారులను పంపిస్తానని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను, చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం మధ్యాహ్నం రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించిన సందర్భంగా కేంద్ర మంత్రి పై విధంగా హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్, ఎంపిలు వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ సలహాదారు వివేక్ తదితరులు రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆయన నివాసంలో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జోనల్ బిల్లుపై సత్వరం స్పందించి రాష్ట్రపతి కార్యాలయానికి పంపుతున్నందుకు రాజనాథ్ సింగ్‌కు కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

విభజన చట్టంలోని తొమ్మిదవ, పదవ షెడ్యూళ్ళలో పేర్కొన్న వివిధ సం స్థల విభజన ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదని, పలు కార్పొరేషన్ల విభజన కూడా అపరిష్కృతంగానే ఉండిపోయిందని రాజ్‌నాథ్‌కు సిఎం కెసిఆర్ వివరించారు. హైకోర్టు విభజన, ఢిల్లీలోని ఎపి భవన్ విభజన వంటి అనేక అంశాలపై ఎలాంటి పురోగతి లేదని వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల, అప్పుల విభజనకు సంబంధిం చి కూడా అనేక అంశాలు పరిష్కారం కాకుండా పెండింగ్‌లోనే ఉన్నాయని, విభజన చట్టంలో స్పష్టత ఉన్నప్పటికీ పరిష్కారం కాకపోవడం బాధాకరమని, నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోంమంత్రిత్వశాఖ చొరవ తీసుకుని వెంటనే పరిష్కరించాలని రాజ్‌నాథ్‌కు కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. అన్నింటికీ కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే కొలిక్కి వస్తాయిన భావిస్తున్నామని భేటీ వివరాలను ఎంపి వినోద్‌కుమార్ మీడియాకు వివరించారు.

ఎఫ్‌ఆర్‌బిఎం రుణ పరిమితి పెంపు
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశమై ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనల ప్రకారం తెలంగాణకు రాష్ట్ర జిడిపిలో 3.5% మేర రుణాలు తీసుకోడానికి అనుమతి మంజూరు చేయాలని, విభజన చట్టం ప్రకారం వెనకబడిన జిల్లాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 450 కోట్లను విడుదల చేయాలని, మహిళా స్వయం సహాయక బృందాలకు రుణాలపై వడ్డీ రాయితీకింద కేంద్రం ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్రమోడీతో శనివారం భేటీ సందర్భంగా ప్రస్తావించిన అంశాలను అరుణ్‌జైట్లీకి కూడా వివరించి వినతిపత్రాలను కెసిఆర్ అందజేశారు. ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం తెలంగాణ రాష్ట్రం గత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జిడిపిలో 0.5% మేర అదనపు రుణాన్ని పొందడానికి అర్హత సాధించినందున అనుమతిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్రాలకూ 3% మేర రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుందని, కానీ ఆర్థిక నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు అదనంగా 0.5% పొందే అర్హతను తెలంగాణ సాధించిందని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రం పొందే రుణంలో మొదటి మూడు త్రైమాసికాలకు ఒకేసారి పొందడానికి అనుమతి మంజూరు చేయడంపట్ల జైట్లీకి కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన పథకాలను అమలుచేస్తూ రాష్ట్ర ప్రజల అవసరాలు తీరుస్తూ ఉన్నదని, వీటికి రాష్ట్రమే తన ఆర్థిక వనరులను సమకూర్చిందని, దాదాపు అన్ని ప్రాజెక్టులూ ముగింపు దశలో ఉన్నందువల్ల నిధుల అవసరం ఏర్పడిందని వివరించారు.

వెనకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం
వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఒక్కో జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున తెలంగాణలోని తొమ్మిది వెనకబడిన జిల్లాలకు రూ. 450 కోట్లను ప్రతీ ఏటా కేంద్రం విభజన చట్టం ప్రకారం అందజేయాల్సి ఉందని, ఇప్పటివరకు మూడు విడతలుగా విడుదలైందని, నాల్గవ విడతను వెంటనే మంజూరు చేయాలని కోరారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేసినందువల్ల నిర్వహణా వ్యయం కూడా పెరిగిందని వివరించారు. మూడు విడతలకు సంబంధించిన నిధుల వినియోగంపై ధృవీకరణ పత్రాలను సైతం ఇప్పటికే సమర్పించామని తెలిపారు.

మహిళా బృందాలకు వడ్డీ రాయితీ
జాతీయ గ్రామీణ జీవన మిషన్ పథకం కింద స్వయం సహాయక మహిళా బృందాలకు జాతీయ బ్యాంకుల నుంచి ఒక్కో గ్రూపుకు గరిష్టంగా మూడు లక్షల వరకు రుణ సదుపాయం ఉందని, దీనిపైన చెల్లించే వడ్డీకి కేంద్రం నుంచి రాయితీ డబ్బులు రావాల్సి ఉందని, వీటిని వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి జైట్లీకి కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. మహిళా బృందాలు తీసుకున్న అప్పుపై బ్యాంకులు వసూలుచేసే వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉందని, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి రాష్ట్రానికి వెంటనే రీఇంబర్స్ చేయాలని కోరారు. జాతీయ మిషన్ రెండవ కేటగిరీలో ఉన్న నల్లగొండ, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మహిళా బృందాలు తీసుకున్న రుణాలపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం 201415 ఆర్థిక సంవత్సరంలో రూ. 102.86 కోట్లు, 201516లో రూ. 87.15 కోట్లు, 201617లో రూ. 53.04 కోట్లు, 201718లో రూ. 96.20 కోట్ల చొప్పున మొత్తం రూ. 339.25 కోట్లు కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెల్లించినందున దాన్ని రీఇంబర్స్ చేయాలని కోరారు.

పరిష్కారంపై కొంత స్పష్టత వచ్చింది : వినోద్‌కుమార్
ప్రధాని మోడీని శనివారం, కేంద్ర మంత్రులు రాజ్‌నాధ్‌సింగ్, జైట్లీని ఆదివారం కలిసిన తర్వాత పెండింగ్ అంశాల పరిష్కారంపై కొంత స్పష్టత వచ్చిందని కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఇద్దరు కేంద్ర మంత్రులతో సిఎం కెసిఆర్ చర్చించిన అంశాలపై వినోద్‌కుమార్ మీడియాకు వివరిస్తూ, విభజన చట్టంలోని కొన్ని అంశాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత మేరకు కృషి జరిగిందని, అయితే అన్నింటినీ పరిష్కరించలేకపోయిందని, ఇంకా అపరిష్కృతంగా ఉన్నవాటిపై సీనియర్ అధికారులను పంపి వెంటనే పరిష్కరించేలా రాజ్‌నాధ్‌సింగ్ హామీ ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. విభజన చట్టంలో చాలా అంశాలపై స్పష్టత ఉన్నప్పటికీ, కేంద్ర హోంశాఖ నుంచి వివరణ వచ్చినప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం మాత్రం జరగలేదని, వివాదాస్పదంగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపి భవన్ విభజన విషయంలోనూ తెలంగాణ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పిందని, కేంద్రం కూడా దాన్ని పరిశీలించిందని, విభజన ప్రక్రియ మాత్రం పూర్తికాలేదని ఉదహరించారు. హైకోర్టు విభజన విషయంలోనూ ఎంపిలుగా తాము పార్లమెంటులో ప్రస్తావించామని, సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌కు కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్‌లో వివరణ ఇచ్చిందని, వచ్చే వారంలో దానిపై విచారణ కూడా జరగనుందని వివరించారు.