Home అంతర్జాతీయ వార్తలు ఆ కన్నీళ్ల కోసం ఉల్లిపాయ వాడారేమో

ఆ కన్నీళ్ల కోసం ఉల్లిపాయ వాడారేమో

Obamaవాషింగ్టన్: 2012 సంవత్సరంలో శాండీ హుక్ పాఠశాలలో తుపాకీ కాల్పులకు బలైన 20మంది చిన్నారులను తలుచుకొని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల కన్నీళ్లు పెట్టుకోవడంపై కన్జర్వేటివ్ పొలిటికల్ ఎనలిస్ట్, ఫాక్స్ న్యూస్ ఛానల్ వ్యాఖ్యాత ఆండ్రియా టాంటెరోస్ విమర్శలు గుప్పించారు. ఆయన నిజంగా కన్నీళ్లు పెట్టుకోలేదని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఒబామా ఏడవడం నమ్మశక్యంగా లేదని టివి చర్చా కార్యక్రమంలో ఆండ్రియా పేర్కొన్నారు. కన్నీళ్లు తెచ్చుకోవడానికి ఆయన ఉల్లిపాయ వాడి ఉంటారని ఆమె వ్యాఖ్యానించారు. ‘ఒబామా మాట్లాడిన తర్వాత వేదిక వద్ద ఉల్లిపాయ లేదా నో మోర్ టియర్స్(జాన్సన్ బేబీ షాంపూ బ్రాండ్ నేమ్) కోసం వెతికాను. ఒబామా కన్నీళ్లు పెట్టుకున్నారంటే నమ్మబుద్ధి కావడం లేదు. అసలే ఇది అవార్డుల సీజన్’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కోహోస్ట్ మిలిసా ఫ్రాన్సిస్ కూడా ఆండ్రియాతో శృతి కలిపారు. అయితే ఒబామాపై ఫాక్స్ న్యూస్ ఛానల్ లో విమర్శలు కొత్త కాదు. గత డిసెంబర్ లో ఒబామాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎనలిస్ట్ రాల్ప్ పీటర్స్, కంట్రిబ్యూటర్ స్టాసీ డాష్ లను రెండు వారాల పాటు సస్పెండ్ చేసింది.