Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

జిల్లాను వెంటాడుతున్న రక్తహీనత

red

* పౌష్టికాహార లోపంతో పసిపిల్లలు అతలాకుతలం
* రోగాల పాలవుతున్న మహిళలు
* నిర్వీర్యమవుతున్న సర్కారు పథకాలు

మన తెలంగాణ/ ఆదిలాబాద్‌బ్యూరో : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పౌష్టికాహార లోపంతో మహిళలు, పసిపిల్లలు తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నారు. ముఖ్యంగా పోషకాహార లోపం వీరిని రక్తహీనతకు దారి తీస్తుందని అంటున్నారు. గత కొద్ది రోజుల నుంచి జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో అక్కడి స్థానికులకు పోషకాహారం అందించేందుకు అమలవుతున్న పలు పథకాలు నిర్వీర్యం అవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. పౌష్టికాహార లోపంతో ప్రతిఏటా చాలా మంది మహిళలు, పిల్లలు వివిధ రకాల వ్యాధులకు గురవుతూ తల్లడిల్లి పోతున్నారని అంటున్నారు. మహిళ, శిశు సంక్షేమ శాఖ తరపున పౌష్టికాహారం అందించేందుకు అమలవుతున్న పథకాలన్నీ ఆచరణలో విఫలమవుతున్నాయన్న విమర్శలున్నాయి. దేశంలోనే పోషకాహారం తక్కువగా ఉన్న జిల్లాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను గుర్తించడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కేంద్రం ద్వారా పౌష్టికాహారం అందించేందు కోసం వివిధ రకాల పథకాలు అమలవుతున్నప్పటికీ ఆ పథకాల ద్వారా ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదన్న విమర్శలున్నాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ పౌష్టికాహార లోపంతో ప్రతి ఏటా మరణాలు సైతం సంభవిస్తున్నాయన్న వాదనలున్నాయి. ఇటీవల పలు స్వచ్చంద సంస్థలు పోషకాహారాన్ని పెంపొందించేందుకు నిర్వహించిన సర్వేలు సైతం ఇక్కడి వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా సాంప్రదాయక రీతిలో పథకాలు అమలు చేస్తున్నందున అవి ఆచరణలో విజయవంతం కావడం లేదని అంటున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నివేదికల ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పౌష్టికాహార లోపం గణనీయంగా పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయని అంటున్నారు. ఐటిడిఎ, అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మహిళలు, గర్భిణీలు, పసిపిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు వివిధ రకాల పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్ల నుంచి ఈ పథకాలు అమలవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ పథకాలు ఆశించిన ప్రయోజనాన్ని అందించలేక పోయాయని అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పౌష్టికాహార లోపం కారణంగా గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పలు సందర్భాలలో పౌష్టికాహార లోపం కారణంగా మరణాలు సంభవిస్తున్నాయన్న అభిప్రాయాలున్నాయి. పౌష్టికాహారం ఆవశ్యకతను పెంపొందించేందుకు గ్రామీణ స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా కార్యాచరణ ఎక్కడా అమలు కావడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత యంత్రాంగం ఈ దిశగా దృష్టి సారించాలని కోరుతున్నారు.

Comments

comments