వరల్డ్ జూనియర్ షూటింగ్
సిడ్నీ: ఇక్కడ జరుగుతున్న జూనియర్ ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. బుధవారం భారత్ మరో స్వర్ణ పతకం సాధించి సత్తా చాటింది. మహిళల 25 మీటర్ల పిస్టోల్ విభాగం పోటీలో ముస్కాన్ భన్వాలా స్వర్ణ పతక గెలుచుకుది. ఫైనల్లో చైనా షూటర్ల పోటీని తట్టుకొని 15 ఏళ్ల ముస్కాన్ పసిడి పతకం సొంతం చేసుకుంది. ప్రారంభం నుంచే ముస్కాన్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఏకాగ్రతతో ఆడుతూ లక్షం దిశగా అడుగులు వేసింది. చైనాకు చెందిన షియాంగ్ కిన్‌తో ముస్కాన్‌కు తీవ్ర పోటీ ఎదురైంది. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన ముస్కాన్ తన ఖాతాలో పసిడి పతకాన్ని జమ చేసుకుంది. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది 8వ స్వర్ణ పతకం కావడం విశేషం. వ్యక్తిగత విభాగంలో భారత్ సాధించిన నాలుగో స్వర్ణ పతకం ఇది. కాగా భారత్‌కు చెందిన మరో స్టార్ షూటర్, గోల్డెన్ గర్ల్ మను బాకర్ నాలుగో స్థానంలో నిలిచింది. మను తృటిలో కాంస్యం గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. మరోవైపు జూనియర్ వరల్డ్‌కప్ షూటింగ్లో భారత్ 8 స్వర్ణాలతో సహా మొత్తం 22 పతకాలు గెలుచుకుంది. ఈ పోటీల్లో భారత్‌కు రెండో స్థానం లభించింది. చైనా అగ్రస్థానంలో నిలిచింది.