Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

‘కృష్ణాష్టమి’తో  మరో హిట్ డతా

sunilస్టార్ కమేడియన్‌గా రాణించి హీరోగా మారి ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నాడు సునీల్. ‘అందాల రాముడు’ తో హీరోగా పరిచయమై తొలి చిత్రంతోనే మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. ఆతర్వాత చేసిన ‘మర్యాద రామన్న’ చిత్రం అతనికి కమర్షియల్ హిట్‌ను అందించింది. అనంతరం చేసిన చిత్రాలు నిరాశపరచడంతో కొంత గ్యాప్ తీసుకొని సునీల్ చేసిన సినిమా ‘కృష్ణాష్టమి’. వాసువర్మ దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సునీల్‌తో ఇంటర్వూ విశేషాలు…
అందువల్లే గ్యాప్…
‘భీమవరం బుల్లోడు’ సినిమా తర్వాత మూడు, నాలుగు స్క్రిప్టులు విన్నాను. ఆతర్వాత రెండు ప్రాజెక్టులు కూడా ఫైనల్ అయ్యాయి. కానీ ఎందుకనో అవి సెట్స్‌పైకి రాలేదు. దానివల్ల గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత చేస్తున్న మంచి సినిమా ‘కృష్ణాష్టమి’. ఈ సినిమాతో నేను మరో హిట్‌ను అందుకోవడం ఖాయం.
కథ నచ్చింది…
ఒక రోజు నిర్మాత దిల్‌రాజు ఫోన్ చేసి ఓ కథ ఉంది… వినమని చెప్పారు. నిజానికి ఆ కథ ఓ పెద్ద హీరో కోసం అనుకున్నారని తెలిసింది. ఈ కథకు నేను సూటవుతానా అని అడిగాను. ఖచ్చితంగా నీకు సూటవుతుందని ఆయన చెప్పడంతో నాకు నమ్మకం ఏర్పడింది. అంతేకాకుండా కథ కూడా నాకు బాగా నచ్చింది.
ఆ కోరిక తీరింది…
‘కృష్ణాష్టమి’ కథ చెప్పిన తర్వాత దర్శకుడు ఎవరని అడిగాను. వాసువర్మ అని చెప్పగానే నాకు చాలా ఆనందం వేసింది. తనతో నాకు చాలా మంచి స్నేహం ఉంది. ఎప్పటినుంచో యంగ్ బ్యాచ్‌తో పనిచేయాలనే కోరిక ఉండేది. అది ఈ సినిమాతో తీరింది. సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు వాసు. నా కెరీర్‌లో భారీ సినిమా ఇదే.
ఎన్‌ఆర్‌ఐగా నటించాను..
ఈ సినిమాలో నేను ఎన్‌ఆర్‌ఐగా కనిపిస్తాను. హీరోకు, కృష్ణాష్టమికి సంబంధం ఉంటుంది. అదేంటన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. పక్కవాడి కోసం ఎంతవరకైనా రిస్క్ చేసే పాత్ర నాది. ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ ఉన్న సినిమా ఇది. సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేలా ఉంటుంది.
ఎలాంటి మార్పు లేదు…
నిర్మాత దిల్‌రాజు బ్యానర్ అంటేనే అన్నీ పర్‌ఫెక్ట్‌గా… పద్దతి ప్రకారం ఉంటాయి. ‘బొమ్మరిల్లు’ సినిమాలో కమేడియన్‌గా చేసినా, ఈ సినిమాలో హీరోగా చేసిన నేను బయటవాడిగా కాకుండా ఇంటివాడిలాగే ఉంటాను. అప్పుడూ ఇప్పుడూ ఎలాంటి మార్పు లేదు.
అందుకే సిక్స్‌ప్యాక్ చేశా…
ఈ సినిమాలో కూడా సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తాను. కేవలం రెండు సీన్లలో నా సిక్స్‌ప్యాక్ ఉంటుంది. నిజానికి నేను సిక్స్‌ప్యాక్ చేయడానికి కారణం ఉంది. కమేడియన్‌లా ఉన్నప్పుడు లావుగా ఉంటే సరిపోతుంది. నవ్వించడం ఒక్కటే నా బాధ్యత. కానీ హీరోగా మాత్రం రెండున్నర గంటలు ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్ చేయాలి. కాబట్టి ప్రేక్షకులకు మనలో నచ్చే క్వాలిటీస్ ఉండాలని సిక్స్‌ప్యాక్ చేశాను.
కమేడియన్‌గా చేయడమే కష్టం…
కమేడియన్‌గా చేయడమే చాలా కష్టం. అవతలి వ్యక్తిని నవ్వించాలంటే దానికి మనలో ఎన్నో ప్రత్యేకతలు ఉండాలి. హీరో అంటే రకరకాల హంగామాలు చేస్తే సరిపోతుంది.
బంకు శీను పాత్ర ఇష్టం…
నన్ను బాగా నమ్మిన వ్యక్తి త్రివిక్రమ్. అలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. నన్ను దగ్గరినుండి బాగా గమనించాడు కాబట్టి చాలా సినిమాల్లో నాకు దగ్గరగా ఉండే పాత్రలను సృష్టించి నన్ను నిలబెట్టాడు. తను క్రియేట్ చేసిన పాత్రల్లో బంకు శీను పాత్ర నాకు బాగా ఇష్టం. ఖచ్చితంగా ఆయనతో ఓ సినిమా చేస్తాను. అదెప్పుడన్నది తనే చెప్పాలి.
రెండు సినిమాలు చేస్తున్నా…
ప్రస్తుతం వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అది దాదాపు పూర్తి కావచ్చింది. దాంతోపాటు వీరుపోట్ల దర్శకత్వంలో ‘ఈడు గోల్డెహె’ సినిమా చేస్తున్నాను. ఇంకో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.

Comments

comments