Search
Saturday 22 September 2018
  • :
  • :

నాదల్‌కు మరో షాక్

Tennis

సిన్సినాటి: వరల్డ్ నంబర్‌వన్ రఫెల్ నాదల్ (స్పెయిన్)కు మరో షాక్ తగిలింది. సిన్సినాటి ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ నాదల్ ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియాస్ చేతిలో ఓటమి పాలయ్యాడు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 23వ సీడ్ కిర్గియాస్ వరుస సెట్లలో ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు నాదల్‌ను కంగుతినిపించాడు. రెండు సెట్ల పోరాటంలో కిర్గియాస్ 6-2, 75 తేడాతో నాదల్‌పై సంచలన విజయం సాధించాడు. ప్రారంభం నుంచే కిర్గియాస్ దూకుడుగా ఆడాడు. అగ్రశ్రేణి ఆటగాడు నాదల్‌ను ముప్పుతిప్పలు పెడుతూ లక్షం దిశగా సాగాడు. అతని జోరును అడ్డు కోవడం నాదల్‌కు శక్తికి మించిన పనిగా మారింది. తొలి సెట్‌లో కిర్గియాస్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన ఆస్ట్రేలియా సంచలన ఆటగాడు సునాయాసంగా సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో మాత్రం టాప్ సీడ్ నాదల్ పుంజుకున్నాడు. టైబ్రేకర్ వరకు పోరును తీసుకెళ్లాడు. అయితే కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకోలేక తప్పులు చేశాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న కిర్గియాస్ సెట్‌ను గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు. సెమీఫైనల్లో కిర్గియాస్ స్పెయిన్ ఆటగాడు డేవిడ్ ఫెర్రర్‌ను ఎదుర్కొంటాడు. కాగా, ఇటీవలే ప్రపంచ పురుషుల ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరుకున్న నాదల్‌కు ఈ ఓటమి పెద్ద షాక్‌గా మారింది. యూఎస్ ఓపెన్‌కు ముందు నాదల్ పేలవమైన ఫాంతో సతమతమవుతున్నాడు. ఇంతకుముందు రోజర్స్ కప్‌లో కూడా నాదల్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.

Comments

comments