Home ఆఫ్ బీట్ చిరుగుల జీవితంలో చిరునవ్వులు

చిరుగుల జీవితంలో చిరునవ్వులు

Anshu Gupta Who is Creating Many Stories of Change on Ground

దీపావళి వచ్చిందంటే చాలు కొత్త టీవీ, బట్టలు, ఇంట్లోని వస్తువులు తక్కువ ధరకే లభిస్తాయని షాపింగ్ చేస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ కొత్తవి కొన్న తరువాత పాత వాటిని ఏం చేస్తాం. ఇంకేం చేస్తాం డస్ట్‌బిన్‌లో పారేసి బయట చెత్తబండోడు వచ్చినప్పుడు అందులో వేస్తాం. ఇది ప్రతి ఒక్కరు చేసే పని. కానీ మన ఇంట్లో వాడకంలో లేని వస్తువులు, దుస్తులు ఎన్నో ఉన్నా వాటితో అవసరం లేకున్నా.. వాటిని అల్మారాల్లోనో, అటక మీదో దాచి పెడుతుంటాం. కానీ ప్రపంచంలో ఎక్కడ చూసినా… ఒంటి మీద సరిపడా దుస్తులు లేక తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడే వాళ్లు లక్షల్లో ఉన్నారు. అలాంటి వారికి ఇంట్లో వృథాగా ఉన్న బట్టలను, సామగ్రిని అందించడంలో ఉన్న ఆనందమే వేరు అని అంటున్నాడు గూంజ్ సంస్థ స్థాపకుడు అన్షు గుప్తా . వాడకంలో లేని బటలన్నింటిన్ని సేకరించి, వాటిని రీసైకిల్ చేసి, అవసరమైన రీతిలో మలిచి, కావాల్సిన వాళ్లకు చేరవేస్తోంది గూంజ్ సంస్థ.

ఎప్పుడు ప్రారంభమైందంటే… 

ఢిల్లీ కేంద్రంగా అన్షు గుప్తా ఈ సంస్థను 18 సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. ఓరోజు అనాథ శవాల్ని దహనం చేసి పొట్ట పోసుకునే కుటుంబంలోని ఓ ఆరేళ్ల చిన్నారి ఒంటి నిండా సరిపడ దుస్తులు లేక చలికి వణుకుతూ శవాన్ని పట్టుకొని పడుకునే సన్నివేశం అన్షును తీవ్రంగా కదిలించింది. అలా ఆరోజు తను చూసిన ఆ ఆరేళ్ల చిన్నారిని తలచుకుంటూ ఆలోచించాలి. ఇలాంటి వారు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. వాళ్లకు కాస్తయినా.. సహాయం చేయాలనే ఉద్దేశంతో 1999లో గూంజ్‌ను ప్రారంభించాడు. తొలి ప్రయత్నంగా 67 జతల దుస్తుల్ని సేకరించి అవసరమైన వాళ్లకు పంపిణీ చేశాడు. ఇప్పుడు ఇప్పుడు ఏటా 300 టన్నుల దుస్తులు, సామగ్రిని రీసైకిల్ చేస్తోందీ సంస్థ. వరదలు, కరువు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సైతం సహాయం అందిస్తుంది. అన్షు గుప్తా సేవలను గుర్తించిన ప్రభుత్వం 2015లో రామన్ మెగసెసే అవార్డు తో సత్కరించింది. కానీ తనకు అవార్డులు రివార్డులు అంటే ఇష్టం ఉండదని కేవలం పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్షమని గుప్త చెబుతాడు. నాసా, నైక్, యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవెలప్‌మెంట్ వంటి సంస్థలు గూంజ్‌తో కలిసి పనిచేస్తున్నాయి. నిజానికి ఇది ఒక వ్యక్తిగా ప్రారంభించినా… సమాజంలోని ప్రతి ఒక్కరూ సహృదయంతో స్పందించడం వల్లే లక్షలాది మంది అవసరాలు తీర్చే స్థాయికి సంస్థ ఎదిగింది. ఎక్కువ ఖర్చు పెట్టి శానిటరీ ప్యాడ్స్‌ను కొనలేని తీసుకొని మహిళలు గ్రామాల్లో లక్షల్లో ఉన్నారు. అలాంటి వారి కోసం రీసైకిల్ దుస్తులతో శానిటరీ ప్యాడ్స్‌ని రెండు రూపాయలకే అందిస్తోందీ సంస్థ. ఐదేళ్లలోనే దాదాపు 40 లక్షల ప్యాడ్స్ పంపిణీ చేసింది.

హైదరాబాద్‌లో గూంజ్
హైదరాబాద్‌లో 2009లో గూంజ్ బ్రాంచ్‌ను ప్రారంభించినట్లు కన్వీనర్ రూపేశ్‌వత్ చెప్పారు. ఇక్కడ ఈ సంస్థలో 12 మంది సభ్యులు ఉంటారు. అందులో 6 గురు మహిళలు. అందరికీ ప్రతి నెలా వేతనం కూడా ఇస్తుంది సంస్థ. ఒక రోజు బీహార్‌కి వెళ్లినప్పుడు అక్కడి గూంజ్ సంస్థ స్థానిక ప్రజలకు అందిస్తున్న సేవలకు చూసి, హైదరాబాద్‌లో ఏర్పాటుచేయాలనిపించిందంటాడు రూపేశ్. పాత బట్టలను, వాడలేని ఇంట్లో సామగ్రి, షూ, చిన్న పిల్లల పుస్తకాల వంటివి సేకరించి, వాటికి అవసరమైన మార్పులు చేస్తారు. వాటిని తెలంగాణలోని చిన్న చిన్న గ్రామాల్లోకి వెళ్లి అక్కడ అవసరమైనవారికి అందిస్తుంటారు. నగరంలో రెండు బ్రాంచ్‌లున్నాయి. ప్రతి రోజు క్యాంపెయిన్ నిర్వహిస్తుంటారు. పలు కాలేజీలు, పాఠశాలలు, గేటెడ్ కమ్యూనిటీలలో క్యాంపెయిన్‌ల ద్వారా అదనంగా ఉన్న దుస్తుల్ని, సామగ్రిని సేకరిస్తుంది.
మీరూ…. మీ వద్ద వృథాగా పడి ఉన్న దుస్తుల్ని లేదా సామగ్రిని అందించాలనుకుంటే గూంజ్ కార్యాలయాల్లో ఇవ్వవచ్చు. వివరాలకు http://goonj.org వెబ్‌సైట్‌ని విజిట్ చేయవచ్చు. సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ సంస్థకి సంబంధించి బ్రాంచ్‌లు ఉన్నాయి. ఫేస్‌బుక్, ఇంటర్నెట్ సహాయంతో మిగతా బ్రాంచ్‌ల వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు గూంజ్ 22 రాష్ట్రాల్లో సేవలందిస్తోంది.
కేరళకి సహాయం చేస్తున్న గూంజ్…
భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళకు కూడా హైదరాబాద్ గూంజ్ సంస్థ సహాయ సహాకారాలు అందిస్తోంది. అక్కడి ప్రజలకు నిత్యావసర వస్తువులు కూడా దొరకడం లేదు. వారికి బియ్యం, బట్టలు, వస్తువులు రెండు లారీల నిండా పంపించింది.

గూంజ్ డ్రాపింగ్ సెంటర్స్

1) 7 – 1/ 8, ప్లాట్ నెంబర్ – 8, ఫేజ్ – 2, హైదర్‌షాకోట్,
బండ్లగూడ రాజేంద్రనగర్, రంగారెడ్డి.9640433473
2) బర్సిల్ హౌజ్, కేకే టవర్స్ 3, సీతారం నగర్, డైమండ్
పాయింట్ దగ్గర, సికింద్రాబాద్.

కాసోజు విష్ణు…