Home సినిమా వరుణ్ సినిమాలు చూసి ఈర్ష పడ్డా: రామ్‌చరణ్

వరుణ్ సినిమాలు చూసి ఈర్ష పడ్డా: రామ్‌చరణ్

వరుణ్‌తేజ్, అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్‌చరణ్ మాట్లాడుతూ “వరుణ్‌తేజ్ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వరుణ్‌పైన ఉన్న ప్రేమ కన్నా ట్రైలర్ చూసిన తర్వాత గొప్పగా అనిపించి ఈ ఫంక్షన్‌కు వచ్చాను. ఈమధ్య కాలంలో ఇంత మంచి ట్రైలర్‌ను నేను చూడలేదు. మనిషి కన్నా గొప్పది ఆలోచన. అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉంటారనేది నా నమ్మకం. గొప్ప ఆలోచనలు ఉన్న దర్శకులు రాజమౌళి, సుకుమార్, క్రిష్. రేపు వీళ్లందరితో పాటు, వీళ్ల కన్నా గొప్ప స్థాయిలో రాణించాలని సంకల్ప్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. లావణ్య, అదితి చాలా చక్కగా నటించారు. వరుణ్‌తేజ్ చేసిన కొన్ని సినిమాలు చూసి అసూయ, ఈర్ష పడ్డాను. ఈ సినిమా చూసి కూడా ఈర్ష పడ్డాను. మెగాభిమానులు గర్వపడే సినిమా ఇది”అని అన్నారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ “మా చిట్టిబాబు, చిట్టి అన్నయ్య ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. సంకల్ప్ చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేశాను. ప్రేక్షకులు కొత్త సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. చరణ్ అన్న నా వెనుక ఉంటే చిరంజీవి, పవన్‌కళ్యాణ్ నా వెనుకనే ఉన్నట్లుంది. మా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ఆర్ట్ డైరెక్టర్లు రామకృష్ణ, మోనిక, సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్, సిజి వర్క్ చేసిన రాజీవ్ సహా అందరికీ థాంక్స్‌”అని తెలిపారు. జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ “సంకల్ప్ తెలుగు సినిమా దర్శకుడు అయినందుకు గర్వంగా ఉంది. తను మంచి సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నాడు. ఈనెల 21న వస్తున్న ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు కూడా గర్వంగా ఫీల్ అవుతారు. చరణ్ ‘రంగస్థలం’ వంటి డిఫరెంట్ మూవీ చేసినట్లు వరుణ్ కంచె, అంతరిక్షం సినిమాలు చేశాడు. లావణ్య, అదితి చాలా చక్కగా నటించారు”అని పేర్కొన్నారు. సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ “సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందరికీ ఈ సినిమాను చూపించాలనిపిస్తోంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరీ, సీతారామశాస్త్రి, రాజా, రామకృష్ణ, మోనిక తదితరులు పాల్గొన్నారు.

Antariksham 9000 KMPH Movie Pre Release Celebrations

Telangana News