Home ఎడిటోరియల్ అమెరికాలో విద్వేష సర్పాలు

అమెరికాలో విద్వేష సర్పాలు

Anti slogans against Trump in Pennsylvania

పెన్సిల్వేనియాలోని యూదుల ఆరాధనాలయంపై కాల్పులు జరిపి 11 మందిని హతమార్చిన సంఘటన తర్వాత అధ్యక్షుడు ట్రంప్ తన భార్య మెలినా ట్రంప్ తో కలిసి ఆ స్థలాన్ని సందర్శించారు. బాధితులకు సానుభూతి తెలియజేశారు. కాని ట్రంప్‌కు తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యింది. ట్రంప్ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. ట్రంప్ వల్లనే అమెరికాలో శ్వేతజాతి దురహంకారం పెచ్చరిల్లిందని, నియో నాజీ కార్యకలాపాలు ఎక్కువయ్యాయని పలువురు విమర్శించారు. ట్రంప్ సమాజాన్ని విభజించే రాజకీయాలు నడుపుతున్నాడని, ప్రవాసులపై విషం కక్కుతున్నాడని ఆరోపించారు. అధ్యక్షుడు ట్రంప్ రావడాన్ని వ్యతిరేకిస్తూ 70 వేల మంది యూదులు సంతకాలు చేసిన లేఖను పంపించారు.

కాల్పులు జరిపిన శ్వేతజాతి దురహంకారి రాబర్ట్ బోవర్స్ పై 29 కేసులు నమోదు చేశారు. అతను అరెస్టయి నిర్బంధంలో ఉన్నాడు. పిట్స్‌బర్గ్‌లో యూదుల ఆరాధ్య మందిరంపై దాడి తర్వాత ట్రంప్ మాట్లాడుతూ ఇలాంటి నేరాలకు ఉరిశిక్ష విధించాలని చెప్పాడు. ఈ దాడిలో ముగ్గురు పోలీసు అధికారులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలో విద్వేష దాడుల పరంపరలో ఇది తాజా సంఘటన. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే మూడు సంఘటనలు జరిగాయి. ఈ నెల 24వ తేదీన ఒక శ్వేతజాతీయుడు కాల్పులు జరిపి ఇద్దరు నల్లజాతీయులను చంపేశాడు. కెంటకీ స్కోర్స్‌లో జరిగిన సంఘటన ఇది. హతులెవ్వరో కూడా హంతకుడికి తెలియదు. గుడ్డిగా కాల్పులు జరిపి ప్రాణాలు తీశాడు. ఈ హంతకుడు నిజానికి నల్లజాతి వారి చర్చిలో ప్రవేశించాలని అనుకున్నాడు. కాని అక్కడ తలుపులు మూసి ఉండడంతో స్టోర్స్‌లోకి వచ్చి కాల్పులు జరిపాడు. నేరస్థుడి పేరు గ్రెగరీ బుష్. నల్లవారి చర్చి తలుపులు విరగ్గొట్టడానికి ముందు ప్రయత్నం చేశాడు. సాధ్యం కాకపోతే పక్కనే ఉన్న స్టోర్స్‌కి వెళ్ళి అక్కడ గల ఇద్దరిని కాల్చి చంపాడు. బుష్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

కెంటకీలో ఈ సంఘటన జరిగినప్పుడు అమెరికాలో భయాందోళనల వాతావరణం ఉంది. ఎందుకంటే, పోస్టులో పైప్ బాంబులు పంపిస్తున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. మొదటి పైప్ బాంబు ప్రముఖ వ్యాపారి జార్జి సోరోస్‌కు వచ్చింది. ఆ తర్వాత మరో బాంబు మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు, ఇంకో బాంబు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామకు వచ్చింది. ఆ రోజు మరి నాలుగు అలాంటి పార్శిళ్ళను పోలీసులు కనుగొన్నారు. అందులో ఒకటి న్యూయార్క్ లోని సిఎన్‌ఎన్ వార్తాసంస్థకు పంపిన బాంబు. చివరకు ఈ పార్శిళ్ళు పంపిన సీజర్ సయాక్ ను అరెస్టు చేశారు. మొత్తం 14 పైప్ బాంబుల పార్శిళ్ళు అతను పంపించాడు. అదృష్టవశాత్తు ఏదీ పేలలేదు. కాని అన్నీ భయంకరమైన బాంబులే. సీజర్ సయాక్ తన వ్యాన్‌పై ట్రంప్‌ను ప్రశంసించే నినాదాలు రాసుకున్నాడు. ట్రంప్‌కు వీరాభిమాని.

సిఎన్‌ఎన్ వార్తాసంస్థను తీవ్రంగా ద్వేషించే నినాదాలు కూడా అతని వ్యాన్‌పై రాసి ఉన్నాయి. ట్రంప్‌ను వ్యతిరేకించే రాజకీయ ప్రత్యర్థులపై ఆన్‌లైన్‌లో వ్యతిరేక ప్రచారం నిర్వహించేవాడు. ఆ తర్వాత ఎవరూ ఊహించని పిట్స్‌బర్గ్ సంఘటన జరిగింది. యూదుల ప్రార్థనా మందిరంలో చొరబడిన శ్వేత దురహంకారి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. యాంటి సెమెటిక్ నినాదాలు చేశాడు. పదకొండు మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఇది మహా విషాదమని పెన్సిల్వేనియా గవర్నర్ ట్వీట్ చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన రాబర్ట్ బోవర్ ఇంతకు ముందు అనేకసార్లు యూదులపట్ల బాహాటంగా తన ద్వేషాన్ని ప్రకటించిన వ్యక్తి. సోషల్ మీడియాలో యూదులకు వ్యతిరేకంగా అనేక పోస్టులు పెట్టేవాడు.

ఈ సంఘటనను ట్రంప్ తీవ్రంగా ఖండించాడు. యావత్తు అమెరికా సంతాపం ప్రకటిస్తుందని ట్వీట్ చేశాడు. యూదు వ్యతిరేక దాడులు నాగరికతపైనే దాడుల వంటివి. ప్రపంచంలో యాంటి సెమెటిజన్ విషాన్ని తొలగించవలసిన బాధ్యత మనందరిపై ఉంది అన్నారు. విద్వేషాన్ని జయించడానికి మనమంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. అమెరికాలో కాల్పుల సంఘటనలు, విద్వేష నేరాలు ఎంతగా పెరిగిపోయాయంటే, ఈ సంవత్సరం జరిగిన ఇలాంటి నేరాలను లెక్కిస్తే వణుకు పుడుతుంది. ఫ్లోరిడాలో ఒక స్కూలులో విద్యార్థులపై, టీచర్లపై ఒక అగంతకుడు కాల్పులు జరిపి 17 మందిని పొట్టనపెట్టుకున్నాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత ట్రంప్ వ్యాఖ్యానిస్తూ టీచర్లకు కూడా తుపాకులు ఇవ్వాలని చేసిన వ్యాఖ్యపై దుమారం రేగింది. పాఠశాలల్లో జరుగుతున్న కాల్పుల ఘటనలను నిరోధించాలంటే స్కూలు పరిసరాల్లో గన్ ఫ్రీ జోన్‌ను లేకుండా చేయాలనీ, ఉపాధ్యాయులకు గన్స్ ఇవ్వాలని ట్రంప్ అన్నారు.

అమెరికాలో ఏటా 11 వేల మంది తుపాకీ కాల్పుల్లో మరణిస్తున్నారు. ఒకవైపు కాల్పుల సంఘటనలు పెరుగుతుంటే మరోవైపు విద్వేష నేరాలు కూడా పెరుగుతున్నాయి. యూదుల సినగోగ్ల గోడలపై స్వస్తికా చిహ్నాలతో భయపెట్టిన సంఘటనలు కూడా ఇంతకు ముందు చోటు చేసుకున్నాయి. 2016లో ఒక్కసారిగా విద్వేష నేరాలు పెరిగిపోయాయి. మొత్తం 6121 సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2017లో 2016 కన్నా యాభై శాతం ఎక్కువయ్యాయి. విద్యా సంస్థల్లోను యాంటి సెమిటిక్ భావాలు, యూదు వ్యతిరేకత, ముస్లిం వ్యతిరేకత పెరిగింది. విద్యాసంస్థల్లో ఇలాంటి సంఘటనలు దాదాపు 90 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఎఫ్‌బిఐ డేటాను పరిశీలిస్తే, మతపక్షపాతం వల్లనే ఎక్కువగా ఈ విద్వేష నేరాలు జరుగుతున్నాయి. మొత్తం 1538 ఇలాంటి నేరాలు జరిగాయి. ఇందులో సగం కన్నా ఎక్కువ యూదు వ్యతిరేక దాడులు. మిగిలిన వాటిలో నల్లవారిపై జరిగిన దాడులు ఉన్నాయి. ప్రతి ఐదు విద్వేష నేరాల్లో ఒకటి మతపరమైన విద్వేషానికి సంబంధించిందే ఉంటుందని అధికారులు అంటున్నారు.

పిట్స్‌బర్గ్ కాల్పుల సంఘటన తర్వాత డెమొక్రాట్ నాయకులు ఈ సంఘటనలను ఖండిస్తూ ప్రకటనలు చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సహా పలువురు తమ సంతాపాన్ని ప్రకటించడమే కాదు, అమెరికాలో తుపాకుల సంస్కృతిని నియంత్రించాలని అన్నారు. ఆరాధనాలయాలు, స్కూళ్ళు, చర్చిలకు తుపాకులివ్వాలి వంటి ఆలోచనలను తాము సమర్ధించేది లేదని సెనెటర్ బ్రయాన్ షాజ్ అన్నారు. ట్రంప్ ఇంతకు ముందు స్కూళ్ళ విషయంలో చేసిన వ్యాఖ్యను పరోక్షంగా సూచిస్తూ ఆయన ఈ మాటలు చెప్పారు. అసలు నేరస్థులకు ఆయుధాలు అందకుండా చేయడమే సరయిన పరిష్కారం అని పలువురు భావిస్తున్నారు. అమెరికాలో భయంకరమైన తుపాకులు కూడా ఎవరైనా కొనుక్కోవచ్చు. అదే బ్రిటన్ లాంటి దేశాల్లో అయితే తుపాకుల కొనుగోలుపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. అలాగే రాజకీయ ప్రచారంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేకపోతే ఇలాంటి హింసాత్మక సంఘటనలు కూడా తగ్గుతాయని బ్రిటన్ కు చెందిన యూద రబ్బీ జోనాథన్ రోమైన్ ఒక వ్యాసంలో రాశారు.

ముఖ్యంగా ట్రంప్ వైఖరే విద్వేష నేరాలకు కారణమైందన్న విమర్శలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. అమెరికాలో ట్విన్ టవర్స్ పైదాడి తర్వాతి నుంచి ఇస్లామోఫోబియా పెరిగింది. జాతి విద్వేషం పెరిగింది. యూదులకు సంబంధించినంత వరకు అమెరికా చాలా సురక్షితమైన దేశంగా చాలా మంది భావిస్తారు. యూరప్‌లో హోలోకాస్ట్ జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. బ్రిటన్ తదితర యూరప్ దేశాల్లో యూదుల సినగోగ్ తదితర సామూహిక ప్రదేశాలకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. అమెరికాలో ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి లేదు. కాని ట్రంప్ వచ్చిన తర్వాతి నుంచి యాంటి సెమెటిజం అధికమైందన్న వాదన బలంగా వినిపిస్తుంది. విద్వేష వ్యాఖ్యలు ఎలాంటి జంకు లేకుండా ప్రకటించే వాతావరణం ఒకటి నెలకొంది. ఇప్పుడు బహుశా అమెరికాలోను యూద ప్రార్ధనాస్థలాలకు ప్రభుత్వ రక్షణ కల్పించవలసి రావచ్చు.

                                                                                                                                                            – ఆర్ విక్రమ్

Anti slogans against Trump in Pennsylvania

Telangana Latest News