Home జాతీయ వార్తలు రేపే అవిశ్వాస చర్చ

రేపే అవిశ్వాస చర్చ

parlament

టిడిపి ఇచ్చిన తీర్మానాన్ని అనుమతించిన స్పీకర్ సుమిత్రా మహాజన్
ప్రవేశపెట్టిన టిడిపి సభ్యుడు కేశినేని
మద్దతుగా లేచి నిలబడ్డ 50 మందికి మించిన ప్రతిపక్ష సభ్యులు
15 ఏళ్ల తరువాత లోక్‌సభలో మళ్లీ అవిశ్వాస తీర్మానం
ప్రధాని మోడీపై దేశ ప్రజలకు విశ్వాసం ఉంది : మంత్రి అనంతకుమార్
తీర్మానం గెలుస్తుంది : సోనియా

మన తెలంగాణ/ న్యూఢిల్లీ : నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టి న అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం నాడు చర్చ జరగనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన మొదటి రోజే (బుధవారం) అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే  అవిశ్వాస తీర్మానంపై చర్చను శుక్రవారం చేపడతామని లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. అంతకుముందు టిడిపి ఎంపి కేశినేని నాని అవిశ్వాస తీర్మానాన్ని లోకసభలో ప్రవేశపెట్టారు. తీర్మానంపై చర్చకు మద్దతుగా 50 మందికి పైగా సభ్యులు లేచి నిలబడడంతో స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తర్వాత జరిగిన సభా వ్యవహారాల సంఘం సమావేశంలో అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరపనున్నట్లు స్పీకర్ నిర్ణయించారు. ఆ రోజున ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దుచేసి అవిశ్వా స తీర్మానంపై చర్చను చేపడతామని స్పీకర్ స్పష్టం చేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్, ఎన్‌సిపి అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఈ తీర్మానానికి టిఆర్‌ఎస్, బిజెడి మినహా ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి. అయితే ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రధాని నరేంద్రమోడీపై దేశ ప్రజలకు విశ్వాసం ఉందని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ ధీమా వ్యక్తంచేశారు. అధికార ఎన్‌డిఎ కూటమికి లోకసభలో మెజారిటీ ఉన్న దృష్ట్యా అవిశ్వాస తీర్మానం వల్ల జరిగే నష్టమేమీ లేదని బిజెపి నాయకులు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టాలని ప్రధాని మోడీ ఎన్డీయే నాయకులను కోరారు. రాజకీయ లబ్ది కోసమే విపక్షాలు పలు అంశాలను లెవనెత్తుతున్నాయని మంగళవారం జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోడీ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపక్ష పార్టీలకు ఒక అవకాశం లభించింది. రానున్న సాధారణ ఎన్నికలకు ముందు ఎన్డీయేతర పార్టీ ల వైఖరి ఏ విధంగా ఉండవచ్చు ననే విషయంలో ఒక స్పష్టత లభించే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తు తం దేశంలో నెలకొన్న అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, బ్యాంకు కుంభకోణాలు,వ్యవసాయ సంక్షోభం, మహిళ లపై జరుగుతున్న అత్యాచారాలు,మూకుమ్మడి హత్యలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేకంగా ఇటీవల మూకుమ్మడి హత్యలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. రైతుల సమస్యలు, మహిళల రక్షణ అంశాలను ప్రముఖం గా ప్రస్తావిస్తామని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానించారు. అయితే రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కనీస మద్దతు ధర పెంపు, ఆయుష్మాన్ భారత్ పధకాలను సభలో వివరించి ప్రతిపక్షాలను దెబ్బ కొట్టాలని బీజేపీ యోచిస్తోంది. వాస్తవానికి గత బడ్జెట్ సమావేశాలలోనే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నించాయి.అయితే లోక్‌సభలో గందరగోళ పరిస్థితి నెలకొందని స్పీకర్ సుమిత్ర మహాజన్ వాటిని అనుమతించలేదు.ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం చేపట్టడంపైస్పందిస్తూ తీర్మానానికి ఆమోదం లభిస్తుందని కాం గ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు. తమకు సంఖ్యాబలం లేదని ఎవరు చెప్పారని సోని యా గాంధీ విలేకరులను ఎదురు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి దీటుగా జవాబు చెబుతామని,ఏపీకి కేంద్రం అన్యాయం చేయలేదని, అధికంగానే సాయాన్ని అందించామని బీజేపీ నేతలు అంటున్నారు.
15 ఏళ్ళ తర్వాత అవిశ్వాస తీర్మానం…
దాదాపుగా 15 ఏళ్ళ తర్వాత లోకసభలో అవిశ్వాస తీర్మానం తెరపైకి వచ్చింది. గతంలో 2003లో చివరిగా అవిశ్వాస తీర్మా నం ప్రవేశపెట్టారు. అప్పటి వాజపేయి ప్రభుత్వంపై కాం గ్రెస్ నేత సోనియా గాంధీ అవిశ్వాస తీర్మానా న్ని ప్రవేశపెట్టారు. అయితే ఆ తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా ఎపి విభజన చట్టం అమలుపై సోమవారం స్వల్పకాలిక చర్చ చేపట్టాలని రాజ్యసభ సభా వ్యవహారాల సంఘం సమావేశంలో నిర్ణయించారు.