Home ఎడిటోరియల్ అవిశ్వాసమంటే భయమేల?

అవిశ్వాసమంటే భయమేల?

edt

మోడీ ప్రభుత్వం అవిశ్వాసతీర్మానానికి భయపడుతుందా? తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, ఆ తర్వాత కాంగ్రెసు వరుసగా అవిశ్వాస తీర్మానం కోరుతుంటే మరోవైపు అన్నాడిఎంకే సభ్యులు కావేరీ సమస్య పేరుతో గగ్గోలు సృష్టిస్తున్నారు. అన్నాడిఎంకే అనధికారికంగా ఎన్ డీ ఏ మిత్రపక్షమే. మొన్నటి వరకు టి ఆర్ యస్ కూడా రిజర్వేషన్ల సమస్య పేరుతో సభలో గగ్గోలు చేసింది. అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకోడానికే ఈ గగ్గోలు సృష్టిస్తున్నారని, బిజేపికి సహకరించడానికే ఈ ఎత్తుగడన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. చివరకు టి.ఆర్.యస్. ఆందోళనను విరమించి అవిశ్వాసతీర్మానం చేపట్టడానికి సహకరించాలని నిర్ణయించింది. కాని అన్నా డిఎంకే మాత్రం తన ధోరణిలో ముందుకుసాగుతోంది.
లోక్ సభలో 50 మంది సభ్యులు అవిశ్వాసతీర్మానం కోరితే స్పీకరు దాన్ని అనుమతించడం అవసరం. కాని స్పీకరు మాత్రం సభలో గగ్గోలును కారణంగా చూపించి ఒప్పుకోవడం లేదు. సభలో చర్చ జరగకుండా ఉండడం ప్రభుత్వానికి అవసరమని, బిజు జనతాదళ్ కు చెందిన పినాకి మిశ్రా ఇటీవల చేసిన వ్యాఖ్య కూడా గమనించదగింది. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం పై చర్చ విషయంలో అన్నాడిఎంకే పార్టీని ఒప్పించడం ప్రభుత్వానికి కష్టమేమీ కాదు. లోక్ సభలో అన్నాడిఎంకే నాయకుడు తంబిదురై తాము బిజేపి నేతలతో మాట్లాడుతున్నామని చెప్పాడుకూడా. కావేరీ జలాల విషయంలో సభను అడ్డుకోవడం వల్ల అన్నాడిఎంకేకు ఇప్పుడు వచ్చే ప్రయోజనమేమీ లేదు. నిజానికి అవిశ్వాసతీర్మానం సందర్భంగా కూడా కావేరీ జలాల సమస్యపై మాట్లాడవచ్చు. కాని చర్చ జరక్కూడదని బిజెపి భావిస్తున్నట్లు కనిపిస్తుంది. చర్చ జరిగితే బిజేపి నాలుగు సంవత్సరాలుగా చేసిన పనుల గురించి కూడా చెప్పుకోవచ్చు. లోక్ సభకు 2019లో ఎన్నికలు జరగవలసి ఉంది. కాబట్టి చర్చ బిజేపికి కూడా మంచిదే. కాని మొత్తం బడ్జెటు సమావేశాలు ఎలాంటి చర్చలు లేకుండా గగ్గోలుతోనే ముగిసిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బిజేపి ఓటమి తర్వాత దాని మిత్రపక్షాలు కూడా దానిపై గొంతు పెంచుతున్నాయి. ప్రభుత్వం ఇబ్బందికరమైన స్థితిలో ఉందన్నది ప్రతిపక్షాలు కూడా గుర్తించాయి. అందువల్లనే కాంగ్రేసు కూడా అవిశ్వాసతీర్మానం కోసం పట్టుబట్టింది. అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టినా మోడీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ప్రభుత్వం పడిపోయే పరిస్థితేమీ లేదు. ప్రభుత్వానికి ఆ బలం ఉంది. కాని అవిశ్వాస తీర్మానం అనేది ఎవరికి ఎంత బలం ఉందో పరీక్షించుకునేది మాత్రమే కాదు. ఎవరు ఏం చేశారన్నది చర్చకు వస్తుంది. ఆ చర్చ బిజేపిని ఇబ్బందులపాలు చేస్తుందన్న భయమే అవిశ్వాసతీర్మానం విషయంలో మోడీ సర్కారు వెనుకడుగుకు కారణం. సభలో చర్చ మొదలైతే నీరవ్ మోడీ శ్కాముపై కూడా మాట్లాడతారు. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు కుంభకోణం అని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం అందరికీ తెలిసిందే. అది కూడా చర్చకు వస్తుంది.
అవిశ్వాసతీర్మానం కోసం పట్టుబడుతున్న తెలుగుదేశం పార్టీ నిన్నటి వరకు ఎన్ డీ ఏ మిత్రపక్షం. ఇప్పుడు కూడా బిజేపి పట్ల పెద్దగా వ్యతిరేకతేమీ తెలుగుదేశానికి లేదు. కాని ప్రత్యేక హోదా విషయంలో బిజేపి రెండునాల్కల వైఖరిని తెలుగుదేశం ఎండగట్టకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది నిలబడ్డం కష్టం. మిత్రపక్షాలను కూడా బిజేపి మోసం చేసిందన్న విషయం ప్రజలముందుకు వస్తుంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రేసు బిజేపి పట్ల పెద్ద వ్యతిరేకత ఉన్న పార్టీ ఏమీ కాదు. కాని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశంతో ఉన్న వైరం, రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో బిజేపి, తెలుగుదేశం పార్టీలు కలిసి ప్రజలను మోసం చేశాయని చెప్పకపోతే వైయస్సార్ పార్టీకి రాజకీయంగా నష్టం. ఈ విషయాలన్నీ చర్చకు వస్తాయి. ఒకప్పటి మిత్రపక్షమే ఇప్పుడు అవిశ్వాసం అంటే అది ప్రభుత్వ పక్షానికి అవమానకరమైన విషయమే కాదు, విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీసే అంశం. ప్రభుత్వం అవిశ్వాసతీర్మానంలో ఘనవిజయం సాధించినప్పటికీ విశ్వసనీయతను కోల్పోతుంది. చివరకు శివసేన కూడా బిజేపి పట్ల వ్యతిరేకతను దాచుకోవడం లేదు. ప్రభుత్వానికి ఇప్పుడు ఎంత మంది సభ్యుల బలం ఉందన్నది అంత ముఖ్యం కాదు. మిత్రులు కూడా ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ, దాని విశ్వసనీయతను ప్రశ్నించడం అనేది ముఖ్యమైన సమస్య. ప్రభుత్వానికి కావలసినంత బలం లోక్ సభలో ఉంది. అవిశ్వాసతీర్మానంలో గెలిస్తే ప్రభుత్వ ప్రతిష్ఠ సాధారణంగా పెరుగుతుంది. కాని ఇక్కడ గెలిచినా ప్రతిష్ఠ కోల్పోయే ప్రమాదం కనబడుతోంది. నిజానికి ఈ సమావేశాల్లో మొదట కాంగ్రేసు పార్టీ నీరవ్ మోడీ విషయంలో చర్చ కోసం పట్టుబట్టింది. కాని వైయస్సార్ కాంగ్రేసు పార్టీ ప్రత్యేకహోదా కోసం చేస్తున్న డిమాండుకు తెలుగుదేశం కూడా తోడవ్వడంతో నీరవ్ మోడీపై చర్చ అనేది వెనక్కపోయింది. బిజేపి ఊపిరిపీల్చుకుంది. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రేస్ పార్టీలు నిజానికి బిజేపికి సహాయం చేస్తున్నాయని చాలా మంది అనుకునే వాతావరణం ఏర్పడింది. కాని వైయస్సార్ పార్టీ తెలుగుదేశాన్ని ఇరుకున పెడుతూ అవిశ్వాసతీర్మానం ప్రస్తావన చేయడంతో పరిస్థితి మారింది. తెలుగుదేశం మంత్రులు రాజీనామా చేయడం, అవిశ్వాసతీర్మానం కోసం తెలుగుదేశం పట్టుపట్టడంతో బిజేపి ఇరుకున పడింది. ఇతర ప్రతిపక్షాలు కాంగ్రేసు, వామపక్షాలు కూడా అవిశ్వాసం విషయంలో ఒక్కటయ్యాయి. నీరవ్ మోడీ విషయంలో చర్చను తప్పించాలని ప్రయత్నిస్తున్న మోడీ ప్రభుత్వం మళ్ళీ ఇరుక్కుంది. ప్రభుత్వంపై దాడి చేయడానికి చాలా సమస్యలున్నాయి. శిరోమణి అకాలీదళ్ కూడా అసంతృప్తితో ఉంది. రైతుల గిట్టుబాటు ధర విషయంలో పంజాబ్ నేతలు తమ ఆగ్రహాన్ని దాచుకోవడం లేదు. పైగా గురుద్వారాల్లో ఉచిత భోజనాల లంగర్ పై కూడా జియస్టీ వేయడంతో మరింత అసంతృప్తి ఉంది. రాంవిలాస్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ కూడా ఎన్ డి ఏ లో ఎంతకాలం ఉంటుందో చెప్పలేని స్థితి. యస్.సి.,యస్.టీ. అట్రాసిటీస్ చట్టంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై రివ్వూ పిటీషన్ వేయాలని కేంద్రాన్ని రాం విలాస్ పాశ్వాన్ కోరుతున్నారు. ఈ విషయంలో రాం విలాస్ పాశ్వాన్ మౌనంగా ఉంటే రాజకీయంగా ఆత్మహత్యే అవుతుంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల సమస్యలు పెరిగాయి, అర్ధికవ్యవస్థ పుంజుకుంటుంది అని ఎంత ప్రచారం చేసినా ఆ సూచనలు కనబడడం లేదు, ఉపాధికల్పన లేదు, ఉద్యోగాలు లేవు. మేలో కర్నాటక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అవిశ్వాసంపై చర్చ జరిగితే మోడీ ప్రభుత్వానికి ముఖం చెల్లని పరిస్థితి ఎదురుకావచ్చు. అవిశ్వాసాన్ని గెలిచినా ప్రతిష్ఠ అడుగంటిపోవచ్చు.కాని ఎంతకాలం అవిశ్వాసంపై చర్చను తప్పించగలరు. నీరవ్ మోడీ కేసు నుంచి జనం దృష్టిని తప్పించడానికే మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంను అరెస్టు చేశారన్న వాదన కూడా వినిపిస్తుంది. సభలో అన్నాడిఎంకే స భ్యుల గగ్గోలు సాకుతో కొంతకాలం అవిశ్వాసంపై చర్చను వాయిదా వే యడం ద్వారా ప్రభుత్వం ఈ పరిస్థితిని గట్టెక్కే ఆలోచనలు చేస్తుందనవ చ్చు. కాని చర్చ జరక్కుండా ఆపడం కూడా ఇప్పుడు కష్టమే. చర్చ ఇప్పు డు కాకపోయినా తర్వాతైనా జరుగుతుంది. ప్రభుత్వాన్ని కాపాడ్డానికి ప్రయత్నించిన పార్టీగా అన్నాడిఎంకే తమిళ రాజకీయాల్లో తన ప్రతిష్ఠను దిగజారడాన్ని ఇష్టపడకపోవచ్చు. కాబట్టి చర్చ జరగకుండా ఆపలేరు.