Home జాతీయ వార్తలు రాహుల్ మో’ఢీ’

రాహుల్ మో’ఢీ’

modi

రసవత్తరం కానున్న నేటి అవిశ్వాస చర్చ

తీర్మానానికి వ్యతిరేకంగా శివసేన, ఎఐఎడిఎంకె

ప్రభుత్వ ఘనతను చాటనున్న ప్రధాని మోడీ

మన తెలంగాణ/న్యూఢిల్లీ :లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం ఉదయం మొదలు సాయంత్రం వరకు వాడివేడిగా చర్చలు జరిగే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున విధానపరమైన అంశాలను, పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీల మేరకు ఇప్పటి వరకు అమలుచేసిన అంశాలను ప్రధాని నరేంద్రమోడీ వివరించనున్నారు.కాంగ్రెస్‌తరఫున రాహుల్‌గాంధీ ప్రసంగించనున్నారు. ఈ ఇద్దరి ప్రసంగాలపైనే లోక్‌సభలోని పార్టీల ప్రధాన దృష్టి కేంద్రీకృతమైంది. ప్రధాని మోడీ సుమారు గంటసేపు ప్రసంగిం చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆర్థికపరంగా ఆంధ్రప్రదేశ్‌ను ఏయే అంశాల్లో ఏ తీరులో అదుకున్నదీ, ఈ నాలుగేళ్ళలో ఎన్ని కోట్ల రూపాయలను సాయంగా ఇచ్చింది ఆర్థిక మంత్రి పీయూ ష్ గోయల్ వివరించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ కూడా చర్చలో భాగంగా ప్రసంగించే అవకాశం ఉంది. చర్చను ప్రారంభించే టిడిపి ఎంపి జయదేవ్ ఎపి గురించే ప్రధానంగా వాదనలు వివిపిస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. చర్చలన్నీ ముగిసిన తర్వాత మోడీ జవాబిస్తారని తెలుస్తోంది.
ప్రధాని ప్రసంగంలో ఎన్నికల ఎజెండా : ఈ నాలుగేళ్ళలో ఎన్‌డిఏ ప్రభుత్వం అమలుచేసిన పథకాలు, వాటికి చేసిన ఖర్చు, వాటి ద్వారా వచ్చిన ఫలితాలను ఈ చర్చ సందర్భంగా ప్రస్తావించి గతంలోని ప్రభుత్వాలకంటే ఏ విధంగా భిన్నంగా పరిపాలన సాగించిందీ ప్రధాని తన ప్రసంగంలో పేర్కొననున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చేపట్టనున్న పలు అంశాలను కూడా తన ప్రసంగంలో సూచనప్రాయంగా తెలియజేసే అవకాశం లేకపోలేదు. ఐదేళ్ళ ప్రభుత్వంలో పెట్టుకున్న లక్షంలో నాలుగేళ్ళలో చేసినవాటిని ఏకరువు పెట్టడంతో పాటు ప్రస్తుత సంవత్సరంలో అమలులోకి తేనున్న అంశాలను, ఇకపైన ప్రవేశపెట్టనున్న అంశాలను ప్రస్తావించనున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. బిజెపికి కేటాయించిన 3.30 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాలకు చేసిన సాయం గురించి ప్రధాని ప్రస్తావించే అవకాశం ఉంది. నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నేడు మొదటి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం శుక్రవారం లోకసభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. దీనిపై చర్చ కోసం ప్రశ్నోత్తరాల సమయాన్ని స్పీకర్ రద్దు చేశారు. అందువల్ల ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కావడంతోనే తెలుగుదేశం ‘అవిశ్వాస తీర్మానం’ను ప్రవేశపెట్టనుంది. ఆ వెంటనే ఆ తీర్మానంపై చర్చ ప్రారంభమవుతుంది. ఈ చర్చను తెలుగుదేశం పార్టీ ప్రారంభించనున్నందున ఆ పార్టీ తరఫున ఎంపీ గల్లా జయదేవ్ చర్చను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం 6 గంటలకు తీర్మానంపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. బిజూ జనతాదళ్‌కు చెందిన బైజయంత్ జె పాండా (కేంద్రపార లోక్‌సభ నియోజకవర్గం), కేరళ కాంగ్రెస్‌కు చెందిన జోస్ కె మణిల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో లోక్‌సభలో స్పీకర్‌తో కలిపి మొత్తంసభ్యుల సంఖ్య 533కు చేరుకుంది. 533 కు చేరింది. దీంతో అవిశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగినట్లయితే మెజారిటీ మార్క్ 266గా మారింది. అయితే అవిశ్వాస తీర్మానం విషయంలో తమ దే పైచేయి కావాలని అధికార, ప్రతిపక్షాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. తటస్థంగా ఉన్న పార్టీల నేతలతో అధికార విపక్ష నేతలు సంప్రదింపులు తీవ్రం చేశాయి. తీర్మానానికి అనుకూలంగా ఇతర పార్టీల మద్ద తు కూడగట్టడానికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వ్యూ హాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్ గురువారం పలుసార్లు సమావేశమై పరిస్ధితి సమీక్షించింది. యూపీఏ నేత సోనియా గాంధీ పలువురు విపక్షాల నేతలతో ఫోన్ లో సంప్రదించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక టీడీపీ నేత చంద్రబాబు అందరు ఎంపీలకు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని లేఖలు రాశారు. మరోపక్క టీడీపీ ఎంపీలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌ను కలిసి అవిశ్వాస తీర్మానానికి మద్దతు కోరారు. ‘ఆప్’ తప్పనిసరిగా మద్దతు ఇస్తుందని టీడీపీ ఎంపీలకు కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు. మరోపక్క డిఎంకె కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికింది. ఎన్డీయే ప్రభుత్వం హిందుత్వ ఎజెండాకు కట్టుబడి ఉందని డిఎంకె నేత స్టాలిన్ పేర్కొన్నారు. లోక్‌సభలో 300కి పైగా ఎన్డీయే కూటమికి ఎంపీలు వున్నప్పటికీ బీజేపీ నాయకత్వం అవిశ్వాస తీర్మానాన్ని తేలికగా తీసుకోవడం లేదు. అంతేకాకుండా తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గురువారం పార్టీ నాయకులతో వరుస సమాలోచనలు జరిపారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరేతో అమిత్ షా ఫోన్‌లో సంప్రదించి ఆ పార్టీ మద్ధతు ఖరారు చేసుకున్నారు. లోక్ సభలో ఆ పార్టీ కి 18 మంది ఎంపీలున్నా రు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా వోట్ చేయాలని శివసేన పార్టీ ఎంపీలకు విప్ జారీచేసింది. బీజేపీ నేత అమిత్ షా గురువారం అన్నా డిఎంకె నేత తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో ఫోన్‌లో చర్చించారు. ఆ తర్వాత అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ఏపీకి అన్యాయం జరిగిందంటూ టీడీపి తన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రస్తావించనుందని, అయితే గతంలో కావేరి జలాల విషయంలో తమ పార్టీ ఎంపీలు నిరసన తెలిపినప్పుడు టీడీపి తరఫున ఎవ్వరూ మద్దతు ఇవ్వలేదని, అందువల్ల ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి తమ పార్టీ మద్దతు ఇవ్వబోదని ముఖ్యమంత్రి పళనిస్వామి స్పష్టంచేశారు. అన్నాడిఎంకెకు లోక్ సభలో 37 మంది ఎంపీలు వున్నారు. ఇక బిజూ జనతాదళ్‌తో కూడా బీజేపీ నాయకులు సంప్రదింపులు జరిపారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేడీ వైఖరి ఏమిటనేది ఇంకా స్పష్టం చేయనప్పటికి శుక్రవారంనాడు లోక్ సభలో టీడీపీ వాదన విన్న తరువాత నిర్ణయం తీసుకుంటామని బీజేడీ నేతలు అంటున్నారు. పోలవరం విషయంలో టీడీపీ వాదనను బట్టి అవిశ్వాస తీర్మానంపై జరిగే ఓటింగ్‌లో బీజేడి నిర్ణయం తీసికుంటుందని ఆ పార్టీ ఎంపీలు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు గురువారం లోక్ సభలో పార్టీ నేత ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో సమావేశమై చర్చించారు. అయితే అన్నాడిఎంకె, బీజేడీ అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొని తమ డిమాండ్లను ఏకరువు పెడతారని తెలుస్తోంది.
లోక్‌సభలో పార్టీల బలాబలాలు : లోక్‌సభలో బుధవారం నాటికి మొత్తం సభ్యుల సంఖ్య 535 (స్పీకర్‌తో కలుపుకుని) ఉండగా, గురువారం ఉదయం ఇద్దరు సభ్యుల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో ఆ సంఖ్య 533కు పడిపోయింది. దీంతో అవిశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగినట్లయితే మ్యాజిక్ ఫిగర్ 266గా ఉంటుంది (స్పీకర్ ఓటు హక్కు వినియోగించుకోకపోయినట్లయితే). ఇందు లో బిజెపి స్వంత బలం 274 మంది సభ్యులు ఉన్నారు. శివసేన, అకాలీదళ్ లాంటి కూటమి పార్టీల బలాన్ని, మద్దతు ఇచ్చే పార్టీల సభ్యుల్ని కలుపుకుంటే అది 313గా తేలింది. ఇక కాంగ్రెస్ పక్షాన సభ్యుల సంఖ్య 63గా ఉంది.ఏ కూటమికీ సంబంధం లేకుండా ఉన్న అన్నాడిఎంకెకు 37 మంది, తృణమూల్ కాంగ్రెస్‌కు 34 మంది, బిజూ జనతాదళ్‌కు 20 మంది, తెలుగుదేశంకు 16 మంది, టిఆర్‌ఎస్‌కు 11మంది చొప్పున ఉన్నారు. ఓటింగ్ సమయంలో ఏ విధానాన్ని అనుసరించాలనేదానిపై కాంగ్రెస్, శివసేన, అకాలీదళ్ పార్టీలు ఇప్పటికే విప్‌లు జారీ చేశాయి.