Home జాతీయ వార్తలు హస్తినలో ప్రముఖులతో బాబు భేటీలు

హస్తినలో ప్రముఖులతో బాబు భేటీలు

AP CM in Lucknow to Meet with Mayawati, Akhilesh Yadav

 

రాహుల్, సోనియా, పవార్‌లతో మంతనాలు
ప్రతిపక్షాల ఐక్యతకు ప్రయత్నాలు
ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం ఢిల్లీలో అగ్రశ్రేణి ప్రతిపక్ష నాయకులతో రెండో దఫా చర్చలు జరిపారు. బాబు కలుసుకున్న ప్రముఖుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యుపిఎ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ ఉన్నారు. కేంద్రంలో బిజెపి యేతర ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత వారితో చర్చించారు. శుక్రవారం దేశరాజధానికి వచ్చిన బాబు అంతకు ముందు రాహుల్‌గాంధీ, శరద్‌పవార్, లోక్‌తాంత్రిక్ జనతా దళ్ (ఎల్‌జెడి) నాయకుడు శరద్‌యాదవ్, సిపిఐ నాయకులతో శనివారం చర్చలు జరిపారు.

ఆరోజే లక్నో వెళ్లి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) అధినేత్రి మాయావతితో కూడా భేటీ అయ్యారు. ఎస్‌పి, బిఎస్‌పి అధినేతలతో చర్చలు జరిపిన తర్వాత చంద్రబాబు నాయుడు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, శరద్‌పవార్‌లను కలుసుకొని చర్చించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతిపక్ష కూటమికి అనుకూలంగా ఉన్నామంటూ ఎస్‌పి, బిఎస్‌పి ఇంతవరకు బహిరంగంగా ముందుకు రాలేదు. ఒకవేళ ఎన్‌డిఏ మెజారిటీ సాధించలేకపోతే… ఆ కూటమిలో లేని పార్టీలను కూడగట్టి ఒకే వేదిక పైకి తెచ్చి తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధం చేసే దిశగా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. తదుపరి ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామన్న ధీమాతో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఉన్నాయి.

AP CM in Lucknow to Meet with Mayawati, Akhilesh Yadav