Home రాష్ట్ర వార్తలు ఎపి, కర్ణాటక అక్రమ కృష్ణ ప్రాజెక్టులపై   కేంద్రానికి ఫిర్యాదు

ఎపి, కర్ణాటక అక్రమ కృష్ణ ప్రాజెక్టులపై   కేంద్రానికి ఫిర్యాదు

godavariఎపి చేపట్టిన ఆర్‌డిఎస్ కుడి ప్రధాన కాల్వను,
కర్ణాటక గిరిజాపూర్ బ్యారేజీని ఆక్షేపిస్తూ
కేంద్రానికి, కేంద్ర జల సంఘానికి రాష్ట్రం లేఖ

హైదరాబాద్: రాజోలిబండ కుడి ప్రధాన కాలువ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సన్నాహాలపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తపరిచింది. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టు నిర్మించాలంటే కృష్ణా నది నిర్వహణ బోర్డు ఆమోదం పొందాలి. ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందాలి. ఇవేమీ పాటించకుండా 4 టిఎంసిల నీటి వినియోగానికి ఆర్‌డిఎస్ కుడి ప్రధాన కాలువ నిర్మాణానికి డీపీఆర్ తయారు చేయాలని ఎపి ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఓ జీవోను విడుదల చేసింది. అయితే విభజన చట్టాన్ని తుంగలో తొక్కి జీవో జారీ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది. ఆర్‌డిఎస్ కుడి ప్రధాన కాలువ పనులకు అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగించడాన్ని నిరోధించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ మేరకు సాగునీటి శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలసంఘానికి లేఖ రాశారు.
కర్ణాటకలో… అక్రమ బ్యారేజీ..
కర్ణాటక ప్రభుత్వం జూరాల ఎగువన రాయచూరు జిల్లా గిరిజాపూర్ గ్రామం వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా కృష్ణా నదిపై బ్యారేజీ నిర్మాణానికి పూనుకుంది. ఈ బ్యారేజికి సంబంధించిన డిపిఆర్, అనుమ తిపత్రాలు, ఇతరత్రా డాక్యుమెంట్లు పంపాలని కర్ణాటక ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కోరింది. అయినా కర్ణాటక ప్రభుత్వం మొండిగా బ్యారేజి నిర్మాణ పనులు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ అక్రమ బ్యారేజి నిర్మాణాన్ని కూడా ఆపాలని కోరుతూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.