Home ఆఫ్ బీట్ కలాం జీవితం స్ఫూర్తిమంతం

కలాం జీవితం స్ఫూర్తిమంతం

abdul-kalam-image-done-in-p

ప్రొఫెసర్, రచయిత, శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి, మానవతావాది, శాంతికాముకుడు భారతరత్న డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం. ఈయనను డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అని ప్రముఖంగా పిలుస్తారు. తమిళనాడులోని రామేశ్వరంలో జైనులబ్దీన్, ఆషియమ్మ దంపతులకు 1931, అక్టోబర్ 15న ఎపిజె అబ్దుల్ కలాం జన్మించాడు. భారతదేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, 11వ భారత రాష్ట్రపతిగా కలాం చేసిన సేవలు మరువలేనివి. కలాం చిన్నవయసులోనే న్యూస్ పేపర్ పంపిణీ చేసి తన తండ్రికి ఆర్థికంగా తోడ్పాటునందించారు. రామనాథపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నై లోని మద్రాస్ ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పట్టాపొందారు. అనంతరం 1960లో కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ శాస్త్రవేత్తగా చేరారు.

కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు, కానీ DRDO లో ఉద్యోగం చేయడంతో ఆయన సంతృప్తి చెందలేదు. 1969 లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ లో (ఇస్రో) చేరాడు. 1970 1990 మధ్య కాలంలో, కలాం పోలార్ SLV అండ్ SLV-III ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. రెండు ప్రాజెక్ట్లు విజయవంతమయ్యాయి. SLV రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయిగా నిలిచింది.ఇతర శాస్త్రవేత్తలతో కలిసి అనేక ఉపగ్రహాలను విజయంతంగా ప్రయోగించారు. 1992 జూలై లో ఆయన భారత దేశపు రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారు అయ్యారు. భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదా వచ్చింది. జూలై 1992 నుండి డిసెంబరు 1999 మధ్య ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించారు. ఇదే సమయంలో కలాం కృషి ఫలితంగానే 1998లో పోఖ్రాన్-II అణుపరీక్షలు విజయవంతంగా జరిగాయి. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేరాయి. అగ్ని క్షిపణి, పృధ్వి క్షిపణి మిస్సైళ్ల అభివృద్ధి, ప్రయోగాలకు సూత్రధారిగా కలాం పనిచేశారు.

భారతదేశపు మూడు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ భూషణ్ (1981లో), పద్మ విభూషణ్ (1990 లో), భారత రత్న (1997 లో) లతో బాటు నలభై విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు పొందిన వ్యక్తి డా॥ కలాం. 2002న జూలై 18న కలాం బ్రహ్మాండమైన ఆధిక్యతతో (90% పైగా ఓట్లతో) భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. 2015 జూలై 27న షిల్లాంగ్‌లోని ఏఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. వెంటనే స్థానిక బెథాని ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో కలాం కన్నుమూశారు. అప్పుడు ఆయన వయస్సు 84 సంవత్సరాలు. కలాం శాకాహారి, మద్యపాన వ్యతిరేకి, బ్రహ్మచారి. కలాం ఇస్లాం కుటుంబానికి చెందినా ఖురాన్‌తో పాటు భగవద్గీతను కూడా చదివేవారు. ( అక్టోబర్ 15  కలాం జయంతి )