Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

కొలువులకు దరఖాస్తుల గడువు పెంపు

TSPSC Forest Beat Officer Results

ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించిన టిఎస్‌పిఎస్‌సి

మన తెలంగాణ / హైదరాబాద్ : మండల ప్లానింగ్, స్టాటిస్టికల్ ఆఫీసర్, ఎఎస్‌ఒ, విఆర్‌ఒ, సిసిఎల్‌ఎ విభాగంలో స్టెనో, హోంశాఖలో సీనియర్ స్టెనో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోడానికి సర్వర్ లో ఏర్పడ్డ సాంకేతిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని దరఖాస్తులను సమర్పించడానికి గడువును ఈ నెల 8వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోడాని కి చివరి తేది ఈనెల 2వ తేదీ అయినందున ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకు నేందుకు ఆసక్తి చూపడంతో సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని కమిషన్ ఆ ప్రకటనలో పేర్కొంది. చివరి రోజు కావడంతో చాలామంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యారని, దీంతో సర్వర్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని వివరించింది. దాదాపు ఒక్కో సెకన్‌కు 12 వేల మంది చొప్పున కమిషన్ వెబ్‌సైట్ సర్వర్‌కు అనుసంధానమయ్యారని, సాఫ్ట్‌వేర్‌లో కొన్ని అప్లికేషన్లు, ఆప్షన్లు సకాలం లో అందుబాటులోకి రాలేకపోయాయని, ఫలితంగా అభ్యర్థుల వివరాలను సర్వర్ స్వీకరించలేకపోయిందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి వాణీ ప్రసాద్ ఆ ప్రకటనలో వివరించారు. ఈ సాంకేతిక సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆ వెబ్‌సైట్ నిర్వాహకులైన సర్వీస్ ప్రొవైడర్‌ను ఆదేశించామని, ఒక మేరకు పరిష్కారమైందని, లక్షలాది మంది అభ్యర్థులు ఒకేసారి వినియోగిస్తున్నందున ఆ వెబ్‌సైట్ బ్యాండ్‌విడ్త్‌ను కూడా పెంచామని వివరించారు. మిగిలిన సాంకేతిక సమస్యలను సైతం సిజిజి (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) పరిష్కరించిందని పేర్కొన్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరిరోజు కావడంతో విఆర్‌ఓ పోస్టుకోసం 9.25 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఏఎస్‌ఓ పోస్టు కోసం 75000 దరఖాస్తులు వచ్చాయని, హోం శాఖ, సిసిఎల్‌ఏ విభాగాల్లో స్టెనో పోస్టుల కోసం 500 దరఖాస్తులు అందాయని వివరించారు. అయితే చాలా మంది అభ్యర్థులు వారి దరఖాస్తులను వెబ్‌సైట్ సాంకేతిక సమస్యలు, సెర్వర్ పనిచేయకపోవడం కారణంగా సమర్పించలేకపోయామని కమిషన్‌కు ఫిర్యాదు చేశారని, సర్వీస్ ప్రొవైడర్‌లో సంప్రదింపుల తర్వాత సాంకేతిక సమస్య స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని దరఖాస్తులను సమర్పించడానికి ఈ నెల 8వ తేదీ అర్ధర్రాతి వరకు గడువును పొడిగిస్తున్నట్లు ఆమె వివరించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఎంత మంది వివరాలు వెబ్‌సైట్‌కు సక్రమంగా అందాయో ఆ వివరాలను ఫీజును ఆన్‌లైన్ ద్వారా తీసుకునే పేమెంట్ గేట్ వే (భారతీయ స్టేట్ బ్యాంకు ‘ఇ పే’)కు తెలియజేశామని పేర్కొన్నారు.

Comments

comments