Search
Sunday 18 November 2018
  • :
  • :

కోటా బిల్లుకు ఓకె చెప్పండి

Approve the bill sent by the Legislative Assembly to increase SC/ ST/ BC Reservations

ఎస్‌సి, ఎస్‌టి, బిసి రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభ పంపిన బిల్లును ఆమోదించండి 

ప్రధాని మోడీతో భేటీలో 11 కీలకాంశాలకు గ్రీన్ సిగ్నల్‌కై విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్
జోనల్ వ్యవస్థను సత్వరం ఆమోదించాలని, పెండింగ్ అంశాలను పరిష్కరించాలని వినతి
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, కొత్త రైల్వే లైన్లు, సచివాలయానికి రక్షణశాఖ భూములు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, ఐటిఐఆర్, ఐఐఎం, కరీంనగర్ట్రిపుల్ ఐటి, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు మున్నగు అంశాలపై కేంద్రం అనుమతుల కోసం అభ్యర్థన 

మన తెలంగాణ/ న్యూఢిల్లీ : బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభ చేసిన రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభు త్వం నుంచి, రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందేలా చొరవ చూపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ స్థానిక యువతకు ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యం లభించేందుకు ఏర్పాటు చేసుకున్న నూతన జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాలని, ఉమ్మడి హైకోర్టును తక్షణం విభజించాలని కూడా కోరారు. ఈ రెండూ జరగనిదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పరిపూర్ణం కానట్లేనని ప్రధానికి స్పష్టం చేయడంతో పాటు మరో ఎనిమిది అంశాలపై కూడా కేంద్రం సహకారం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈ పదకొండు అంశాలకు సంబంధించి లిఖితపూర్వకంగా విజ్ఞాపనపత్రాలను అందజేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం సా యంత్రం ప్రధాని మోడీని ఆయన నివాసంలో కలిసి దాదాపు గంటపాటు పై అంశాలపై చర్చించారు.

రిజర్వేషన్లు పెరగాలి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పోలి స్తే ప్రస్తుతం తెలంగాణలో బలహీనవర్గాల జనాభా అధికంగా ఉందని, ఆ ప్రకారం తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని కి సిఎం కెసిఆర్ వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌టిలు 7.11% ఉంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ సంఖ్య 9.08%కి పెరిగిందని, అదే విధం గా ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలు మొత్తం రాష్ట్ర జనాభాలో 9.56%గా ఉంటే, తెలంగాణలో 12.68% అయ్యారని, బిసిలు కూడా మొత్తం జనాభాలో 50 శాతానికి పైగా ఉన్నారని సిఎం వివరించారు. కాబ ట్టి బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన బిసి ‘ఇ’ గ్రూపులోని కులాలకు రిజర్వేషన్లను 4% నుంచి 12%కి పెంచాలని బిసి కమిషన్ గతేడాది ఏప్రిల్‌లో చేసిన సిఫార సు విషయాన్ని కూడా సిఎం ప్రస్తావించారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని, కానీ అదే కోర్టు రిజర్వేషన్లు పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడినట్లయితే అందుకు తగిన కారణాలు కూడా చెప్పాలని కోరిందని సిఎం గుర్తుచేశారు. తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్న విషయాన్ని, రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూలులో చేర్చిన విషయాన్ని కూడా సిఎం గుర్తుచేశారు. తెలంగాణలో ఎక్కువ శాతం ఉన్న బలహీనవర్గాలను దృష్టిలో పెంచుకుని రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ ‘తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ (రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ అండ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆర్ పోస్ట్స్ ఇన్ ద సర్వీసెస్ అండర్ ద స్టేట్) బిల్లు 2017ను ఆమోదించిన విషయాన్ని కూడా ప్రధానికి వివరించారు. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉందని, ఈ విషయంలో చొరవ చూపి, తెలంగాణలో పెంచిన రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని ప్రధానిని సిఎం కోరారు.

కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపండి : తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఉద్యోగ నియామకాల్లో స్థానిక యువకులకు ఎక్కువ అవకాశాలు రావాలనే ఉద్దేశ్యంతో కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేయాలని ప్రధాని మోడీకి సిఎం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో పది జిల్లాలు మాత్రమే ఉండేవని పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించడానికి కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని, జిల్లా కేడర్ ఉద్యోగాల్లో స్థానికులకే 95 శాతం రిజర్వేషన్ కేటాయించామని వెల్లడించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన జోన్లు, మల్టీ జోన్లు, స్టేట్ జోన్లు ఏర్పాటు చేసుకున్నామని, వీటికి ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని సిఎం కోరారు.

సత్వరం హైకోర్టు విభజన : రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్ళవుతున్నా హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతున్న అంశాన్ని ప్రధానికి వివరించారు. హైకోర్టు విభజన జరగనిదే రాష్ట్ర విభజన ప్రక్రియ పరిపూర్ణం కాదని సిఎం స్పష్టంచేశారు. వెంటనే హైకోర్టు విభజనను పూర్తి చేయాలని కోరారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి వివిధ మంత్రిత్వ శాఖల నుంచి త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన సిఎం కెసిఆర్, ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.20 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందించాలని ప్రధానిని కోరారు. సుమారు రూ. 80 వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 వేల కోట్లను ఖర్చు చేసిందని, వివిధ మార్గాల్లో రూ. 22 వేల కోట్ల మేరకు ఆర్థిక వనరులను సమకూర్చుకున్నదని, షెడ్యూలు ప్రకారం ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి వీలుగా కేంద్రం ఆర్థికసాయం చేయాలని కోరారు.

కొత్త రైల్వే లైన్లు : తెలంగాణలో కొత్త రైల్వే లైన్లను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానికి వివరించిన సిఎం కెసిఆర్ మనోహరాబాద్‌కొత్తపల్లి రైల్వే లైను నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను చేపట్టిందని, ఈ లైను నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అక్కన్నపేట్‌మెదక్ రైల్వే లైను నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ దాదాపు పూర్తయిందని, ఈ లైను నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. భద్రాచలం రోడ్‌సత్తుపల్లి కొత్త రైల్వే లైను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. కాజీపేట-విజయవాడ మధ్య విద్యుద్దీకరణతో కూడిన మూడవ లైను నిర్మాణం, రాఘవాపురంమందమర్రి మధ్య మూడో లైను నిర్మాణం, ఆర్మూర్‌నిర్మల్‌ఆదిలాబాద్ మధ్య బ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం చేపట్టాలని కోరారు. సికింద్రాబాద్‌మహబూబ్‌నగర్, సికింద్రాబాద్‌జహీరాబాద్ రైల్వే లైన్లను డబుల్‌లైన్‌గా మార్చడానికి, హుజురాబాద్ మీదుగా కాజీపేటకరీంనగర్ మధ్య రైల్వే లైను నిర్మించడానికి అవసరమైన సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో కొత్త సచివాలయాన్ని నిర్మించడానికి రక్షణ శాఖకు చెందిన బైసన్ పోలో గ్రౌండ్ స్థలాన్ని కేటాయించాలని ప్రధానిని కోరారు. 44వ నెంబరు జాతీయ రహదారి, 1వ నెంబరు రాష్ట్రరహదారి విస్తరణకు అనుగుణంగా రక్షణశాఖ ఆధీనంలోని స్థలం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి రక్షణ శాఖ గతంలోనే సూత్రప్రాయంగా అంగీకరించిందని ప్రధానికి గుర్తుచేశారు. ఆ భూములను కూడా వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే, హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి అనువుగా రహదారులను విస్తరించడం సాధ్యమవుతుందని వివరించారు. తెలంగాణలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాల (ఉమ్మడి జిల్లాలు) అభివృద్ధికి ఒక్కో జిల్లాకు ఏడాదికి రూ. 50 కోట్ల చొప్పున మొత్తం రూ. 450 కోట్ల ఆర్థిక సహకారం అందించాల్సి ఉండగా 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాల్గవ విడత ఆర్థిక సహాయం ఇంకా విడుదల కాలేదన్నారు. ఈ నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేసేలా చొరవ తీసుకోవాలని కోరారు.

రాష్ట్రానికి ఐఐఎం, ఐటిఐఆర్ :
తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)ను మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. కేంద్ర ప్రభుత్వం 2013లోనే హైదరాబాద్‌కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటిఐఆర్)ను మంజూరు చేసిందని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)ను కూడా సమర్పించిందని, కానీ హైదరాబాద్‌లో ఐటిఐఆర్ ప్రాజెక్టును కేంద్రం ఉపసంహరించుకున్నట్లుగా కేంద్ర ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నట్లు పత్రికల్లో ఇటీవల వార్తలు వచ్చాయని ప్రధాని దృష్టికి కెసిఆర్ తీసుకెళ్ళారు. ఐదేళ్ల క్రితం మంజూరు చేసిన ప్రాజెక్టును ఉపసంహరించుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుందని కాబట్టి ఈ ప్రాజెక్టుకు నిధులిచ్చి, హైదరాబాద్ లో ఐటిఐఆర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని కోరారు.

కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటి : కరీంనగర్ పట్టణంలో ట్రిపుల్ ఐటి (ఐఐఐటి)ని స్థాపించాలని కోరారు. దీనికి అవసరమైన స్థలం ఇవ్వడానికి, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడానికి రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర నగరాల్లో సాంకేతిక విద్యావకాశాలను పెంపొందించాలని రాష్ట్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు సాంకేతిక విద్యాసంస్థలున్నాయని, వరంగల్‌లో నిట్ (ఎన్‌ఐటి) ఉందని, కరీంనగర్ నగరంలో ఐఐఐటి స్థాపించడం వల్ల సాంకేతిక విద్యా సంస్థలను జిల్లా కేంద్రాలకు మరింతగా విస్తరించినట్లవుతుందని ప్రధానికి వివరించారు.

ప్రతీ జిల్లాకు నవోదయ విద్యాలయం : ప్రతీ జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయాన్ని స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం ఒక విధానంగానే పెట్టుకున్నదని, దాని ప్రకారం తెలంగాణలో ప్రతీ జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు.

Comments

comments