కరీంనగర్‌క్రైం: కరీంనగర్ కమిషనరేట్‌లో కానిస్టేబుల్ శనివారం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. కరీంనగర్ ఎఆర్ కొత్తపల్లి మండలంలోని బావుపేట గ్రామానికి చెందిన దూలం చంద్రయ్య (42) అనే వ్యక్తి మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. కాగా ఆయన చిన్ననాటి నుండి పోలీస్‌శాఖలో చేరాలనే సంకల్పంతో పలుమార్లు ప్రయత్నించాడు. చివరకు 1995వ సంవత్సరంలో ఆర్మీడ్ రిజర్వ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. నాటి నుండి ఆయన విధి నిర్వహణలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవాడు. గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసి కంగారుపడిన కుటుంబసభ్యులు వైద్యులకు చూపించి చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎస్కార్ట్ డ్యూటీకని బయలుదేరిన ఆయన హెడ్‌క్వార్టర్స్‌లోనే తలన వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తుపాకీ పేలిన శబ్దంతో ఉలిక్కిపడిన హెడ్‌క్వార్టర్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకునే లోపే చంద్రయ్య మృతి చెందాడు. చంద్రయ్యకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలిసిన కరీంనగర్ రేంజ్ డిఐజి రవివర్మ సహా పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సి.పి కమలాసన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రయ్య మానసిక పరిస్థితి సరిగ్గా లేని కారణంగానే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించడం జరుగుతుందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి వివరించారు. ఆయన వెంట కరీంనగర్ ఎ.సి.పి జూలపల్లి రామారావు, కరీంనగర్ వన్‌టౌన్, టూటౌన్, ట్రాఫిక్ సిఐలు తుల శ్రీనివాస్‌రావు, తాళ్ళపల్లి మహేశ్‌గౌడ్, సీతారెడ్డిలు ఉన్నారు. కానిస్టేబుల్ చంద్రయ్య మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.