Home ఆఫ్ బీట్ కెటిఆర్ నా బంధువైతే..సమంత నా మరదలు: విజయ్

కెటిఆర్ నా బంధువైతే..సమంత నా మరదలు: విజయ్

Arjun-Reddy

హైదరాబాద్: విజయ్‌ దేవరకొండ నటించిన ‘అర్జున్‌రెడ్డి’ మూవీ రిలీజ్ కు ముందే ముద్దు పోస్టర్‌తో వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ సినీయర్ నేత వి హనుమంతరావు బస్సుపై ఉన్న ఆ పోస్టర్లను చించేసి… యువతను పెడదాది పట్టించే ఇలాంటి సినిమాలను నిషేధించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు రాబడుతోంది. విమర్శకుల ప్రశంసలతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం మూవీని, అందులో నటించిన హీరో విజయ్ దేవరకొండను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బాహుబలి లాంటి చరిత్రాత్మక చిత్రాన్ని అందించిన దర్శక ధీరుడు కూడా  ‘అర్జున్‌రెడ్డి’ మూవీని మెచ్చుకుని, నటీనటులను అభినందించారు.

అయితే మంగళవారం విహెచ్ మరోసారి ‘అర్జున్‌రెడ్డి’పై తీవ్ర విర్శలతో విరుచుకుపడ్డారు. చిత్రంలోని డ్రగ్స్ వాడకం, పెళ్లికి ముందే గర్భవతి కావడం, ర్యాగింగ్ వంటి అంశాలపై ఆయన ఫైర్ అయ్యారు. సినిమాను సిఎం కెసిఆర్ కుమారు కెటిఆర్ వీక్షించడంపై కూడా విహెచ్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి అడల్ట్ కంటెంట్ మూవీస్ ను కెటిఆర్ చూసి యువతకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారని ప్రశ్నించారు. వెంటనే మూవీపై తగిన చర్యలు తీసుకోవాలని కెసిఆర్ ను విహెచ్ కోరారు. డ్రగ్స్ కేసును సీరియస్‌గా తీసుకున్న మీరు.. ఇలాంటి సినిమాను మీ కుమారుడు చూశారు. అసలు మీ ఉద్దేశం ఏంటి? హీరో మనవాడే.. మన కుటుంబ సభ్యుడే.. మన బంధువే.. వాడి సినిమా ఆడాలి అని మీ ఆలోచనా? అని దుయ్యబట్టారు.

ఇదిలాఉంటే హనుమంతరావు వ్యాఖ్యలపై హీరో విజయ్‌ దేవరకొండ తాజాగా ఫేస్‌‌బుక్‌ ద్వారా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘‘ప్రియమైన తాతయ్యా.. అర్జున్‌రెడ్డి మూవీని ప్రశంసించినందుకే కెటిఆర్ నా బంధువైతే… మా చిత్రాన్ని అభినందించిన రాజమౌళి గారు నా తండ్రి. నాని, రానా, వరుణ్ తేజ్, శర్వానంద్ నా సోదరులు. నాకు సిస్టర్స్ అనే ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి… సమంత, అను ఇమ్మాన్యుయెల్, మెహ్రీన్ నా మరదళ్లు. 5 రోజుల్లో 5 వేలకు పైగా షోలను ఫుల్ చేసిన నా స్టూడెంట్స్, సినిమా చూసిన స్త్రీ, పురుషులందరూ నా ట్విన్స్. ఇక రాంగోపాల్ సర్ అయితే మన ఇద్దరిలో ఎవరి ఫాదరో ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి సినిమాలను, ప్రజల మైండ్ సెట్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్తుంటే.. కొంతమందేమో ఇంకా తొడగొట్టడం వద్దే ఆగిపోయారు.’’ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు విజయ్ దేవరకొండ. దీనిపై విహెచ్ స్పందిస్తారా? లేదా? వేచి చూడాల్సిందే.