Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

జియో చేతికి ఆర్‌కామ్ ఆస్తులు

geo

న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుపోయి సతమతమవుతున్న అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులను ముఖేష్ అంబానీ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సొంతం చేసుకుంది. ఈమేరకు సోదరుడి సంస్థ ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రమ్, టవర్లు, ఇతర వైర్లెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అన్న కొనుగోలు చేసేందుకు అంగీకరించారు. ఆర్‌కామ్‌తో గురువారం రిలయన్స్ జియో ఒప్పందం కుదుర్చుకుంది. సోదరుడి సంస్థలకు చెందిన ఆస్తులను ఇతరుల చేతికి వెళ్లనీయకుండా ముఖేశ్ అంబానీనే కొనుగోలు చేస్తున్నారు.  ఆర్‌కాంకు చెందిన 4జి స్పెక్ట్రం, 43 వేల టవర్స్ ఇక జియో కైవసం కానున్నాయి. ఈ మేరకు రిలయన్స్ జియో అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ ఒప్పందానికి సంబంధించిన లావాదేవీలు వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. అక్టోబరు నాటికి ఆర్‌కామ్‌కు రూ.45వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ రుణభారాన్ని తగ్గించుకునేందుకు అనిల్ అంబానీ కొత్త పునరుజ్జీవ పథకం ప్రకటించారు. ఇందులో భాగంగానే ఆర్‌కాం మొబైల్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు జియోనే అత్యధిక బిడ్‌ను దాఖలు చేసింది. ఈ కొత్త పథకం తీసుకురావడం ద్వారా ఆర్‌కాం తన రుణభారాన్ని రూ.6వేల కోట్లకు పరిమితం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్‌కాం ఆస్తులు సోదరుడు ముఖేశ్ అంబానీ కొనుగోలు చేయనున్నారనే వార్తలు గతం వారం రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్‌కాం షేర్లు భారీగా లాభపడ్డాయి. ఒకానొక దశలో 41శాతం పెరిగి షేర్ విలువ రూ.23కి చేరింది. వీటి ప్రభావంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.1388.88కోట్లు పెరిగి రూ.5898.88కోట్లకు చేరింది.

Comments

comments