మన తెలంగాణ/మునిపల్లి : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తు న్న గ్రామ పంచాయతీ ఎన్నికలు రానే వచ్చాయి.. వీటికి సంబంధించి మండలంలో గ్రామాల వారిగా విభజించి, కులాల వారిగా ఓటర్ల గణన కూడా ఇప్పటికే సంబంధిత శాఖాధికారులు లెక్కించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధ్దంగా ఉండాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాట్లను కూడా అధికారులు చకచకా చేశారు. అయితే రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధ్దం చేసి ఈనెల 10వ తేదీన విడుదల చేయనుంది. మొదట్లో మండల వ్యాప్తంగా 25 పంచాయతీలు ఉండగా.. వాటికి అనుబంధంగా 5 గ్రామాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్ట ప్రకారం 500 జనాభా కలిగిన గ్రామాలను నూతన పంచాయతీలుగా ప్రకటిస్తామని హామీనిచ్చినప్పటికీ మండలంలోని 5 అనుబంధ గ్రామాలను పంచాయతీలుగా ఇప్పటికే ప్రకటించింది. కాగా 25 పంచాయతీలైన మునిపల్లి, మల్లికార్జునపల్లి, బుసారెడ్డిపల్లి, పోల్కంపల్లి, ఖమ్మంపల్లి, పెద్దగోపులారం, చిన్నచెల్మెడ, అంతారం, బోడపల్లి, తక్కడపల్లి, గార్లపల్లి, పిల్లోడి(లోనిఖుర్దు), పెద్దలోడి (లోనికాలన్) మక్తక్యాసారం, చీలపల్లి, కల్లపల్లి-, బేలూర్,తాటిపల్లి, మన్సన్పల్లి, పెద్దచెల్మెడ, మేళసంగం, కంకోల్, లింగంపల్లి, మొగ్దుంపల్లి, బొడశట్పల్లి, బుదేరా పంచాయతీలతో పాటువాటి అనుబంధ గ్రామాలైన అల్లాపూర్, హైద్లాపూర్, గొర్రెగట్టు, ఇబ్రంపూర్, మల్లారెడ్డిపేట గ్రామాలను నూతన పంచాయతీలుగా ప్రకటించడంతో మండలంలో మొత్తం 30 పంచాయతీలకు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే జూన్ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం యోచిస్తుండడంతో గ్రామాల్లో రాజకీయ వేడి సంతరించుకుంది. తమ గ్రామంలో ఏ రిజర్వేషన్ వస్తుందోనని ఆశావాహులు కనులారా ఎదురు చూస్తున్నారు. వారు అనుకున్న రిజర్వేషన్లు రాకపోతే వారి పరిస్థితి ఏంటి.. ఇప్పిటికే కొన్ని గ్రామాల్లో ఇది చేస్తాం, అది చేస్తాం అని ఆఫర్లు ఇవ్వడంతో ఆశావాహులకు అవదుల్లేకుండా పోయింది. అయితే ఈనెల 10వ తేదీన రిజర్వేషన్లను ప్రకటిస్తామని ఇప్పటికే ప్రకటించడంలో మండలంలోని అన్ని గ్రామాల్లో టెన్షన్ టెన్షన్ నెలకొంది. ప్రభుత్వం ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ ప్రకటించిందో కొన్ని గంటల్లోపు తేలనుంది.
ఇదిలా ఉండగా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం కులాల వారిగా ఓటర్లను ఇప్పటికే గుర్తించారు. కాగా అన్ని సిద్ధ్దం చేశారు. కానీ ఓటరు లిస్ట్‌లో పేరు లేని వారి పరిస్థితి ఏంటి? ఆన్లైన్ ద్వారా ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. అయితే అవి త్వరలో నిర్వహించే పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ప్రభుత్వం కల్పించనుందా లిస్ట్‌లో నుంచి తొలిగిపోయిన వారి పరిస్థితి ఏంటి అనే అనుమానాలకు తావులేకుండా పోతుంది.. కొత్తగా ఓటరు లిస్ట్‌లో నమోదు చేసుకోవాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసి వాటికి సంబంధించిన పత్రాలను కూడా గ్రామాల వారిగా నమోదు చేయించాలని వీఆర్వోలతో తదితరులకు బాధ్యతలను అప్పగించారు. అయితే వారి నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్లుగా తూతూ మంత్రంగా నమోదు చేయించి చేతులు దులుపుకున్నారు. కాగా గ్రామాల్లో ఉన్న సంబంధిత శాఖాధికారులతో సమన్వయం లేకపోవడంతోనే కొత్త వారిని నమోదు చేయించడం పక్కన పడితే ఉన్నవారి పేర్లు ఊడినట్లైంది. కొన్ని గ్రామాల్లోనైతే కొంతమంది బ్రతికి ఉన్నా వారు కూడా చనిపోయారని రికార్డుకెక్కాయి. అయితే వారి పరిస్థితి ఏర్పడడంతో తాము బ్రతికి ఉన్నప్పటికీ తాము చనిపోయినట్లు రికార్డుల్లో ఉండడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అర్హలైన వారు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. ఓటు అనేది మన హక్కు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారాల్లో చెప్పడం తప్ప ఆచరణలో మాత్రం అది సాధ్యం కావడం లేదు.
దీంతో ఆయా గ్రామాలకు చెందిన కొంత మంది ప్రజాప్రతినిధులు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తమ గ్రామంలో వందలాది మందికి ఓటరు లిస్ట్ నుంచి తొలగించడం జరిగిందని, దీనికి బిఎల్ఒలు, సంబంధిత శాఖాధికారుల్లో సమన్వయం లోపంతోనే ఇలా కట్ అయినట్లు తహసీల్దార్ పద్మావతి వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు. దీంతో సంబంధిత అధికారులను పిలిపించి ఏంది.. ఇలా ఎందుకు కట్ అయ్యాయని చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అని అడగడంతో పాటు చురుకలు అట్టించడంతో ఏకంగా ఓ విఆర్వోకు ముచ్చెమటలు పట్టాయి. అధికారుల అలసత్వంతో ఒకటి కాదు, రెండు కావు షేర్‌ఖాన్ వందలాది మంది ఓటర్ల పేర్లు లిస్ట్‌లో లేవు. ఇందుకు కొంతమంది చేసేదేమి లేక మీసేవ కేంద్రాల చుట్టూ తిరగక తప్పడం లేదు. అయినా నెట్వర్క్ కారణంగా సమయానికి ఆన్లైన్ నమోదు కూడా కావడం లేదని పలువురు వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఇంతకు ముందు ఓటరు లిస్ట్‌లో ఉండి లిస్ట్‌లో కట్ అయిన వారికి త్వరలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో కల్పించాలని, అలాగే కొత్త వారు ఓటరు నమోదు చేయించుకున్నా.. లిస్ట్‌లో రాని వారు కొంత మంది అయితే 18 సంవత్సరాలు నిండి ఉన్న వారు ఇంకా చాలా మందే ఉన్నారు. అయితే ఎన్నికలు మాత్రం త్వరలో నిర్వహించనున్నందున 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. లేకుంటే ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అయితే దీనికి ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూద్దాం.