Search
Sunday 18 November 2018
  • :
  • :

పసికందు మృతితో కదిలిన కలెక్టర్

Arrange the baby's death

రూప్పాపూర్ గ్రామం సందర్శన
శిశువు మృతిపై ఆరా
బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బి శాఖ అధికారులకు ఆదేశం

మన తెలంగాణ/నార్నూర్ : గాదిగూడ మండలంలోని రూప్పాపూర్ గ్రామానికి చెందిన గిరిజన మహిళ వాగు సమీపంలో ప్రసవించడం, మెరుగైన వైద్యం అందక ఆ తర్వాత శిశువు మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులను కదిలించింది. గురువారం మండలంలోని పర్సువాడ(బి) గ్రామ పంచాయతీ పరిధిలోని రూప్పాపూర్ గ్రామాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, వైద్య శాఖ అధికారులు సందర్శించారు. కుటుంబ సభ్యులను సంఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పసిపాప మృతిపై వైద్యుల నిర్లక్షమా, సౌకర్యాల లేమి కారణమా అనే కోణంలో అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గిరిజనులతో గోండి భాషలో పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పసిపాప మృతి చెందడం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగుచర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్యం, క్లోరినేషన్ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. పలు సమస్యలను స్థానికులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు గాదిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సమీపంలోని గాదిగూడ వాగు వద్దకు వెళ్లి పరిశీలించారు. వాగు వద్ద కొనసాగుతున్న బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రాజీవ్‌రాజ్, అడిషనల్ డీఎంహెచ్‌వో కుమ్ర బాలు, డిప్యూటీ డీఎంహెచ్‌వో వసంత్‌రావు, ఎంపీడీవో భుక్యా శివ్‌లాల్, ఆర్‌డబ్లూఎస్ ఏఈ శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఏఈ అబ్దుల్ ఖలీల్, వైద్యుడు శ్రీనివాస్, సర్పంచి సిడాం దేవ్‌రావ్, ఎంపీటీసీ తుక్కుబాయి. ఆర్‌అండ్‌బి డీఈ నర్సయ్య తదితరులున్నారు.

కలెక్టరమ్మకు తప్పని రోడ్డు కష్టాలు…
గాదిగూడ మండలంలోని రూప్పాపూర్ గ్రామాన్ని గురువారం సందర్శించిన జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ రోడ్డు కష్టాలతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. భారీ వర్షాలతో గాదిగూడ వాగు ఉప్పొంగడంతో రుప్పాపూర్ గ్రామానికి వెళ్లలేని పరిస్థితిలో గాదిగూడ నుండి ఆద్మియాన్ మీదుగా చిత్తగూడ గ్రామం నుండి రూప్పాపూర్‌కు వెళ్లే క్రమంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కల్వర్టుల వద్ద వరద నీరుతో రోడ్డు కోతకు గురికావడంతో అతికష్టం మీద ప్రయాణించాల్సి వచ్చింది. చిత్తగూడ గ్రామ సమీపంలో మట్టి రోడ్డు పూర్తిగా బురదమయంగా మారడంతో కలెక్టర్ వాహనం బురదలో చిక్కుకుంది. దీంతో సిబ్బంది పోలీస్ వాహనంలో గ్రామానికి తీసుకెళ్లారు. నిత్యం ఇటువంటి సమస్యతో ఈ ప్రాంత గిరిజనులు ప్రతి రోజు ఇబ్బందులు పడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. అత్యవసర సమయంలో ఇక్కడి ప్రజలు పడే సమస్యలు వర్ణణాతీతం కాగా కలెక్టర్ స్వయంగా గిరిజనులు అనునిత్యం పడుతున్న బాధలను అనుభవించక తప్పలేదు.

Comments

comments