Home ఆఫ్ బీట్ భవానీ భాగవతులు గోంధళీలు

భవానీ భాగవతులు గోంధళీలు

Arre couple want to have children to visit Amba Bhavani

ఆరె కుల ఆశ్రితులు, తెలుగు మరాఠా మిశ్రమ సంస్కృతి బిడ్డలు 

ఆర్య శబ్దమే ‘ఆరె’గా మారిందని పండితులు అభిప్రాయపడుతున్నారు. వీరు మాట్లాడేది ఆరె భాష. దీన్ని ఆరె. మరాఠి అని కూడా అంటారు. లిపి లేకుండా కేవలం కౌటుంబిక వ్యవహారాలను తెలుపుకునే మౌఖిక భాషగానే ఉన్నది. పాల్కురికి సోమనాథుడు ఆరె భాషలో  వృషాధిపశతకం, పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకరణంలో కొన్ని ద్విపదలు రచించినాడు. దీనివల్ల పాల్కురికి సోమనాథుని కంటే ముందు నుండే అంటే కాకతీయుల కాలం కంటే ముందే తెలంగాణలో మహారాష్ట్ర వలసలు ఉన్నట్టు భావించవచ్చని ఆచార్య పేర్వారం జగన్నాథం గారు పేర్కొన్నారు. అంతేగాకుండా వీరు మాట్లాడే భాషలో క్రీ.శ.10 లేక 11వ శతాబ్దాల నాటి మరాఠీ భాషా పదాలు నిక్షిప్తమై ఉన్నట్టు ప్రొఫెసర్ ఎస్.ఆర్.కులకర్ణి నిరూపించినట్లు తెలిపారు.  గోంధళీలు చెప్పే కథలను ‘ఆరె జానపద గాధలు’ అనే పేరుతో పుస్తకాన్ని కూడా ప్రచురించారు. ఇంతటి ప్రాచీనత కలిగిన ‘ఆరె’ కులానికి ఆశ్రితులైన గోంధళీల ప్రస్తావన నాచన సోమన రచించిన ‘ఉత్తర హరివంశం చతుర్థా శ్వాసంలో ఉంది.  శ్రీనాథుడు రచించిన శృంగార నైషదం ప్రథమా శ్వాసంలో గొండిలి, గొండ్లి అనే శబ్దాలను నృత్యపరంగా వాడినట్లు కనిపిస్తున్నది. శబ్ద రత్నాకరంలో కూడా గొండలి, గొండ్లి అనే పదాలకు ‘కుండలాకార నృత్యం, నర్తకి అనే అర్థాలున్నవి కళాకారులు చెప్పిన ప్రకారం చూస్తే ‘ఆరె’ వారి పెళ్లిళ్లలో ఆచారం ప్రకారం పెళ్లి పిల్లను, పిల్లగాన్ని ఆంజనేయుని గుడికి తీసుకెళ్లేటప్పుడు ఇద్దరిపైన ఒక పరద  పట్టుకొని వారి చుట్టూ పది మంది వరకు గోంధళీలు దివిటీలు వెలిగించుకొని లగాడిరో…. గొంధాడిరో, ఆసాడిరే…. పిచాడిరై, ఆయిగావు ఏ గోంధళే… వీర హనుమంతా ఏ గోంధళే అంటూ పాడుకుంటూ దుష్టశక్తులు తొలగిపోవాలని, దేవతలందరిని తలుచుకుంటూ, అంబా భవానీని స్తుతిస్తూ వెళ్తారు. ఈ రకంగా చేయడాన్నే గోంధళ్ తీయడం అంటారు. ఇట్లా ‘ఆరె’ వారికి పూజారులుగా గోంధళ్ తీయడంతో గోంధళీలుగా పిలువబడుతూ తెలంగాణలోని ‘ఉమ్మడి వరంగల్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దూదాటి, గుండెకారి, ఇంగ్లె, గుడాల, హంబీర, సేక్‌నారే సింధె ఇంటి పేర్లతో స్థిరపడినారు. 

తెలంగాణ ప్రాంతంలోని ‘ఆరె’ కులానికి ఆశ్రితులు గోంధళీలు.వీరు ‘ఆరె’ కులదైవమైన అంబా భవానీని కొలు స్తూ, ఆరె భాషలోనే కథాగానాలు, భాగోతాలు ప్రదర్శిస్తారు. మరాఠ సంస్కృతి ప్రతిబింబిస్తూ తెలుగు సంస్కృతిలో భాగ మై, విభిన్న మిశ్రమ సంస్కృతి కలిగి తెలుగు, ఆరె రెండు భాషలలోనూ ప్రదర్శనలు ఇచ్చే కళాకారులు. పూర్వం అన్నదమ్ములుగా ఉండే ‘ఆరె’ కులంలోని ఒకరు గోంధళీగా మా రారని కళాకారులు చెప్పే మౌఖిక కథ ద్వారా తెలుస్తుంది.

గోంధళీల పుట్టుక
పూర్వం మహారాష్ట్రకు చెందని ఆరె దంపతులు సంతానం కలగాలని అంబా భవానీని దర్శించుకుంటారు. ఆమెను దర్శించుకోవటంతో వారికి అయిదుగురు కుమారులు జన్మిస్తారు. ఆ దేవత వల్లే సంతానం కలిగిందని అంబా భవానీకి గుడి కట్టించి ప్రతిరోజు నిష్టగా పూజిస్తూ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటారు. ఒకరోజు పొలం దగ్గర పనిచేస్తున్న అయిదుగురు అన్నదమ్ములకు వారి కన్న తల్లి సద్దితేవడం ఆలస్యమవుతుంది. అయితే ఐదుగురిలో చిన్నవాడు నాకు ఆకలిగా ఉందని ఇంటికి వెళ్లి అన్నం తిని మీకు సద్ది తెస్తానని ఇంటికి వస్తాడు. ఆరోజు మంగళవారం, అంబా భవానీకి (ఎల్లమ్మ తల్లికి) ప్రీతికరమైన రోజు కావడంతో తల్లి అయిదు రకాల గుడాలు, నైవేద్యం కల్లుసార అంబా భవానీకి సమర్పించి అప్పుడే ఇంట్లోకి వెళ్తుంది. ఈలోగా చిన్నవాడు చేతులు కడుక్కొని అమ్మవారికి సమర్పించిన నైవేద్యం కల్లుసారా సేవిస్తాడు. ఈ దృశ్యం చూసిన తల్లి చిన్నవానితో మనం అంబా భవానీకి నైవేద్యం సమర్పించటమే గాని సేవించకూడదని నిందిస్తుంది.

ఆరోజు రాత్రి అతని తల్లికి అంబా భవానీ కలలో వచ్చి “నేను నీ చిన్న కుమారున్ని ఆవహించి ఆ రకంగా చేయించానని, నాకు సూరు సంబళి వాద్యం వాయించకుండా, భజనలు చేయకుండా, ఉత్సవాలు చేయడం, పూజించడం తృప్తికరంగా లేదంటుంది. తనకు నిరంతరం వాద్యాలతో పూజలు నిర్వహించడానికి నీ చిన్న కుమారున్ని నా పూజకై వదిలి పెట్టమని కోరుతుంది. ఆ తల్లి చిన్న కుమారున్ని పిలిచి ‘సూరు’ ‘సంబళి’ వాద్యమిచ్చి నిత్యం అంబా భవానీని కొలుచుకుంటూ ఉండమని దీవిస్తుంది. అయితే ఆ చిన్నవాడు నాకు భృతి ఎట్లాయనగా నీ ముగ్గురు అన్నలకు పూజారివై, వారి శుభకార్యాల్లో భాగమై వారిచ్చే ప్రతిఫలం స్వీకరిస్తూ భవానీ కొలుపులు చేస్తూ గోంధలీగా ఉండమంటుంది. ఆ తర్వాత అతని ముగ్గురు అన్నలు వ్యవసాయం చేసుకుంటూ ఆరె పటేల్లుగా స్థిరపడతారు. ఈ రకంగా చిన్నవాడు అంబా భవానీని కొలువడంతో గోంధళీగా స్థిరపడతాడు. ఇతని సంతతి మందు మాంసం ముట్టడంతో కడ్డు మరాఠీలనే పేరు కూడా ఉంది.

ప్రాచీన కావ్యాల్లో కూడా ఆరె, గోంధళీల ప్రస్తావన ఈ రకంగా కనిపిస్తున్నది. ఆర్య శబ్దమే ‘ఆరె’గా మారిందని పండితులు అభిప్రాయపడుతున్నారు. వీరు మాట్లాడేది ఆరె భాష. దీన్ని ఆరె. మరాఠి అని కూడా అంటారు. లిపి లేకుండా కేవలం కౌటుంబిక వ్యవహారాలను తెలుపుకునే మౌఖిక భాషగానే ఉన్నది. పాల్కురికి సోమనాథుడు ఆరె భాషలో వృషాధిపశతకం, పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకరణంలో కొన్ని ద్విపదలు రచించినాడు. దీనివల్ల పాల్కురికి సోమనాథుని కంటే ముందు నుండే అంటే కాకతీయుల కాలం కంటే ముందే తెలంగాణలో మహారాష్ట్ర వలసలు ఉన్నట్టు భావించవచ్చని ఆచార్య పేర్వారం జగన్నాథం గారు పేర్కొన్నారు. అంతేగాకుండా వీరు మాట్లాడే భాషలో క్రీ.శ.10 లేక 11వ శతాబ్దాల నాటి మరాఠీ భాషా పదాలు నిక్షిప్తమై ఉన్నట్టు ప్రొఫెసర్ ఎస్.ఆర్.కులకర్ణి నిరూపించినట్లు తెలిపారు. గోంధళీలు చెప్పే కథలను ‘ఆరె జానపద గాధలు’ అనే పేరుతో పుస్తకాన్ని కూడా ప్రచురించారు. ఇంతటి ప్రాచీనత కలిగిన ‘ఆరె’ కులానికి ఆశ్రితులైన గోంధళీల ప్రస్తావన నాచన సోమన రచించిన ‘ఉత్తర హరివంశం చతుర్థా శ్వాసంలో ఉంది. శ్రీనాథుడు రచించిన శృంగార నైషదం ప్రథమా శ్వాసంలో గొండిలి, గొండ్లి అనే శబ్దాలను నృత్యపరంగా వాడినట్లు కనిపిస్తున్నది.

శబ్ద రత్నాకరంలో కూడా గొండలి, గొండ్లి అనే పదాలకు ‘కుండలాకార నృత్యం, నర్తకి అనే అర్థాలున్నవి కళాకారులు చెప్పిన ప్రకారం చూస్తే ‘ఆరె’ వారి పెళ్లిళ్లలో ఆచారం ప్రకారం పెళ్లి పిల్లను, పిల్లగాన్ని ఆంజనేయుని గుడికి తీసుకెళ్లేటప్పుడు ఇద్దరిపైన ఒక పరద పట్టుకొని వారి చుట్టూ పది మంది వరకు గోంధళీలు దివిటీలు వెలిగించుకొని లగాడిరో…. గొంధాడిరో, ఆసాడిరే…. పిచాడిరై, ఆయిగావు ఏ గోంధళే… వీర హనుమంతా ఏ గోంధళే అంటూ పాడుకుంటూ దుష్టశక్తులు తొలగిపోవాలని, దేవతలందరిని తలుచుకుంటూ, అంబా భవానీని స్తుతిస్తూ వెళ్తారు. ఈ రకంగా చేయడాన్నే గోంధళ్ తీయడం అంటారు. ఇట్లా ‘ఆరె’ వారికి పూజారులుగా గోంధళ్ తీయడంతో గోంధళీలుగా పిలువబడుతూ తెలంగాణలోని ‘ఉమ్మడి వరంగల్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దూదాటి, గుండెకారి, ఇంగ్లె, గుడాల, హంబీర, సేక్‌నారే సింధె ఇంటి పేర్లతో స్థిరపడినారు.

గోంధళీలకు చెందిన మరొక కథనంలో పూర్వం గాయికవాడి వంశస్థుడైన ఆరె ప్రభువు వరంగల్లు జిల్లాలోని మహాలింగపల్లిని (దీన్నే సోమదేవర పల్లి అని కూడా పిలుస్తారు) నిర్మించినట్లుగా చెప్తారు. ఒకప్పుడు ఈ ఆరె ప్రభువు ఏలిన ప్రాంతాన్ని మరొక ప్రభువు ఆక్రమించటంతో ఆ ప్రాంతాన్ని వదిలి ప్రస్తుతం అన్న సోమదేవరపల్లికి వచ్చి గ్రామాన్ని నిర్మించారంటారు. అప్పుడు ఆ ప్రభువు వెంట సిపాయిలు, గోంధళీలు కూడా వచ్చారని చెప్తారు. ఇప్పటికీ ఆ ఊరిలో ఆనాటి నుండి నేటికీ గోంధళీల కుటుంబాలు నివసిస్తున్నాయి. అంతేగాక ఈ గ్రామం గోంధళీలకు ప్రధాన కేంద్రంగా ఉంది. గోంధళీలు ఒకప్పుడు ఆరె కులాన్ని ఆశ్రయించి సూరు సంబళితో ఆరె భాషలోనే అంబా భవానీ, శివాజీ చరిత్రను కథాగానం చేసేవారు.

పూర్వపు ప్రదర్శన విధానం
కళాకారులు ప్రదర్శన నిమిత్తం కట్టడి గ్రామాలకు వెళ్లినప్పుడు బృందంలో ప్రధానంగా ముగ్గురు కళాకారులుండేవారు. వీరు వేషధారణలో తెల్లని దోతి, లాల్చీ ధరించి తలకు రుమాలు చుట్టుకొని నుదుటనే పసుపు కుంకుమ అలంకరించుకుంటారు. ప్రధాన కథకుడు మెడలో అంబా భవానీ ప్రతిరూపమైన గవ్వల హారాన్ని ధరిస్తాడు. ఇతను ‘సూరు’ అంటే తాంబూర మాదిరిగా’ ఉండే వాద్యాన్ని వాయిస్తూ కథ చెపుతుండగా, మరొకరు ‘సంబళి’ అంటే రెండు కలిసి ఉండే తబలా మాదిరి వాద్యాన్ని ప్రధాన కథకునికి అనుగుణంగా వాయిస్తుంటాడు. ఇంకొకరు వంతపాడటం జరుగుతుంది. ఈ రకంగా అంబా భవానీ కథను వారం రోజులు చెప్పేవారు.

ఆరె కులం దగ్గర అంటే దాతృకులం దగ్గర ఆదరణ లేకపోవడంతో ఈ కథాగాన ప్రక్రియ అంతరించింది. ఇదంతా రెండు తరాల ముందు జరిగిందని కళాకారుల మాటల్లో వినిపిస్తున్నది. ఆ తర్వాత గోంధళీలు ఆలోచించి సోమదేవరపల్లికి చెందిన దూదాటి ఉపేందర్ అధ్యక్షతన ‘తెలంగాణ గోంధలే నాటక మండలి’ని స్థాపించి సోమదేవరపల్లి, వరికోట, గోపాలపురం కళాకారుల ఆరె కథలనే వీధి భాగోతాలుగా ఆడేటట్లు రూపొందించుకున్నారు. అప్పటినుండి కళాకారులు కథాంశంలోని పాత్రల వేషాలు గట్టి గోంధళే వీధి భాగోతులుగా రూపాంతరం చెందారు.

గోంధళే కళాబృందాలు ఉమ్మడి వరంగల్లు జిల్లాలో ధర్మసాగర్ మంలం, సోమదేవరపల్లి గ్రామంలో ఒకటి, పరకాల మండలం వరికోట గ్రామంలో ఒకటి. మొగుళ్లపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో రెండు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమలాపురం మండలం శనిగరం గోపాలపురంలో రెండు ఉన్నాయి. ఇలా మొత్తం ఆరు బృందాలు ఆరె భాషలోనే ‘ఆరె’ కులం వారుండే గ్రామాల్లో ప్రదర్శిస్తూ మనుగడ సాగిస్తున్నాయి. ఒక్కొక్క బృందం వారి వారి కట్టడి గ్రామాలకు లేదా మిరాశి గ్రామాలకు ప్రతి మూడేళ్లకొకసారి వెళ్తుంది. ప్రతి ఎండాకాలంలో గ్రామాల మీదికి ప్రదర్శన నిమిత్తం వెళ్లేటప్పుడు ఒక మంగళవారం సాయంత్రం పూట అంబా భవానీని (ఎల్లమ్మను) కొలిచి మరుసటి రోజున బయలుదేరుతారు. కట్టడి గ్రామంలో ప్రతిరూపమైన గవ్వల హారం ఉండే పెట్టెను. అతని ముందర ఉంచుతారు. ఆ పెద్ద మనిషి ‘ఆరె’ వారందర్నీ పిలిపించి ఎన్ని ఆటలు ఆడేది, ఎంత ప్రతిఫలం కళాకారులకు ఇచ్చేది నిర్ణయిస్తాడు. దాదాపుగా ‘ఆరె’ వారంతా ఎల్లమ్మకథ, శివాజీ చరిత్రనే ప్రదర్శించమని కోరుకోవటం జరుగుతుంది.

ప్రదర్శకులు ప్రదర్శనా విధానం
కళాకారుల బృందంలో పది నుండి పన్నెండు మంది వరకు ఉంటారు. ప్రదర్శనలో ప్రధాని లేదా బుడ్డరికం పాత్ర కథాంశంలోని సన్నివేశాన్ని బట్టి హాస్యాన్ని పండిస్తూ, మిగతా పాత్రలు ‘ఆరె’ భాషలో మాట్లాడిన ప్రతి సన్నివేశాన్ని తెలుగులో అనువదిస్తూ నాటకం రక్తికట్టించే విధంగా రంగస్థలం మీద పూర్తయ్యేంత వరకు ఉంటాడు. కథాంశాన్ని బట్టి స్త్రీల పాత్రలు కూడా మగవారే ధరిస్తారు. రంగస్థలం మీద సన్నివేశాన్ని బట్టి పాత్రలు ప్రదర్శిస్తున్నప్పుడు తెర వెనుక కళాకారులు తాళాలు, మద్దెల , హార్మోనియమ్ వాయిస్తూ సందర్భాన్ని బట్టి వంతపాడుతారు. కథలోని సన్నివేశాన్ని బట్టి హాస్యం, కరుణం, బీభత్సం, భయానకం , యుద్ధం వంటి అంశాల్లో కళాకారులు తమదైన నైపుణ్యంతో ప్రదర్శించి ప్రేక్షకులను అలరిస్తారు. అంతేగాకుండా సమాజంలోని సంఘటనలను , వ్యక్తుల స్వభావాన్ని ఉదహరిస్తూ, ప్రేక్షకుల్లో ఆధ్యాత్మికంగా భక్తి భావాన్ని పెంచేవిధంగా కథలు చెబుతూ నిపుణలతో ప్రదర్శిస్తారు. నాటకాన్ని ప్రార్థనతో మొదలుపెట్టి మంగళహారతిలో “ ఆరతి మాయీ అంబా భవానీ పావనీ, భరుల హారతి నివాళితులచు, అను సటుపుల తులపూఔలా… ఓ అంబా భవానీ… మరాఠీ జాతిని సృష్టించిన ఓ అంబా భవానీ నీకు ఇవే మా నివాళులు అంటూ ముగిస్తారు. ప్రదర్శనలో వచ్చిన ప్రతిఫలాన్ని కళాకారులు సమానంగా పంచుకుంటారు.

గోంధళీలు ప్రధానంగా ఆరె మరాఠీ కథలుగా చెప్పుకునే వాటిలో ఆంబా భవానీ (ఎల్లమ్మ కథ), శివాజీ కథ. ఇవేకాకుండా వీరు ప్రదర్శించే కథల్లో జయ్యారాణి కథ, నలలనీ కథ, బాలావంతికథ, నీలకంఠ క థ, రాధాబాయి కాళోసేన్ కథ, కాలసపా కత, అక్కలభైరి కథ, ఆత్మారాణి కథ, శ్యాం నీల కథ, కళింగ హారాజు కథ, అభిమన్యు స్వయంవీర కథ, అర్జున వనవాస కథ. వీటిలో జయ్యారాణి కథ, నలనీల కథ అనేవి తెలుగులో బాలనాగమ్మ సారంగధర చరిత్ర కథలే అంటారు కళాకారులు. ప్రాచీన వారసత్వం కలిగిన గోంధళీలు మారాఠ నుండి వలస వచ్చి మౌఖికంగా వ్యవహారంలో ఉండే ఆరె భాషను నేటికీ సంరక్షిస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తెలుగు సంస్కృతిలో మిళిలితమైనప్పటికీ వారి మూలసంస్కృతిలో భాగమైన ఆరె భాషను రక్షిస్తూ అంబా భవానీని, శివాజీని కొలుస్తూ తమ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రతి అయిదు సంవత్సరాలకొకసారి కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ దగ్గర ఉండే శక్తిని ఘనంగా పూజిస్తారు.

సామాజిక స్థితి
‘ఆరె’ కులానికి పూజారులైన గోంధళీలు అంబా భవానీని పూజించటమే కాకుండా ‘ఆరె’ వారి పెళ్లిళ్లలో పాటలు పాడుతారు. గోంధళ్.అంతేకాకుండా వారిండ్లలో జరిగే పేరు పెట్టే కార్యక్రమంలో కూడా వీరి పాత్ర ఉంటుంది. ఇంకా అశుభకార్యాల్లో చావులాంటి తంతులో పాల్గొని ఓదార్చే పాటలు పాడుతారు. ‘ఆరె’ వారు కూడా వీరిని ఇంటి ఆడబిడ్డలుగా భావించి గౌరవంగా సంభావన ఇస్తారు. అయితే ప్రస్తుతం కళాకారుల జనాభా తక్కువగా ఉండటంతో కట్టడి గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వీరికి ప్రధాన కులానికి అంటే ‘ఆరె’ వారికి కంచం పొత్తు ఉంది కానివియ్యం పొత్తు లేదు. మిగతా తెలుగు ఆశ్రిత కులాలకు ఉన్నట్టుగానే వీరి మధ్య కూడా అంతరం ఉంది.

ఆర్థికంగా కళ మీదనే ఆధారపడితే జీవనం సాగించలేమని కళాకారులు ప్రదర్శనలు లేనప్పుడు పశువుల రోగ నివారణకు వనమూలికలతో తయారుచేసిన ‘నేలగుమ్మడి నూనె’ ఇతరత్రా మందులను విక్రయిస్తారు. అయితే ప్రస్తుతకాలంలో ఆ మందులను కూడా ఎవరూ తీసుకోకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళారూపానికి ఆదరణ తగ్గిపోవటంతో కొందరు కళాకారులు వ్యవసాయ కూలీలుగాను, చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తెలంగాణలోని ప్రాచీనకాలంగా స్థిరపడిపోయిన గోంధళీల కులాన్ని ప్రభుత్వం బిసి ఎ కేటగిరీలో ‘మందుల’ కులం కింద గుర్తించి సర్టిఫికేట్స్ జారీ చేస్తున్నది. గొప్ప సంస్కృతికి నేపథ్యమైన గోంధళీ కులాన్ని ఆ పేరు మీదనే జాబితాలోపేర్కొనకపోవడం బాధాకరమని కళాకారులు వాపోతున్నారు. ప్రభుత్వ కుల జాబితాలో గోంధళీలకు స్థానం కల్పించాలని అలాగే ఎంబిసిలో కూడాచేర్చాలని కళాకారులు కోరుకుంటున్నారు. వీరి కళారూపం పరిరక్షింపబడితే తద్వారా ఆరె భాష, సంస్కృతి కూడా పరిరక్షింపబడుతుందని కళాకారులు వేడుకుంటున్నారు.