Home మహబూబాబాద్ రైతు సమస్యలపై సడక్ బంద్

రైతు సమస్యలపై సడక్ బంద్

 Arrested peasants leaders in mahabubabad

మన తెలంగాణ/మహబూబాబాద్ టౌన్ : రైతాంగ సమస్యలపై రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన సడక్ బంద్ విజయవంతమైంది. వామపక్షాల పార్టీల అనుబంధ రైతు సంఘాల ఆధ్వర్యంలో మానుకోట జిల్లా కేంద్రంలోని స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద 365 జాతీయ రహదారిని దిగ్భంధం చేశారు. దీంతో సుమారు రెండు గంటల పాటు ఎక్కడి రాకాపోకలు అక్కడే నిలిచి ట్రాఫిక్ జామ్ అయింది. టౌన్ సిఐ జబ్బార్, ట్రాఫిక్ ఎస్సై అశోక్ తమ సిబ్బందితో ఆందోళన స్థలానికి చేరుకుని రైతు సంఘాల నాయకులు నిర్వహించిన సడక్ బంద్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అరెస్టు చేయడంతో ఆందోళన కారులకు తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతు సంఘాల నాయకులను అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. రైతుబంధు పథకం భూస్వాములకు సద్వినియోగం కాగా, కౌలు, సాగు రైతులకు శాపంగ మారిందని విమర్శించారు. రైతులకు గిట్టు బాటు ధరను ప్రకటించకుండా ప్రభుత్వం మోసపూరిత కార్యక్రమాలకు పూనుకుంటుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ తక్షణమే రైతులకు మద్దతు ధరను ప్రకటించాలని డిమాండ్ చేశా రు. ఈ ఆందోళనలో ఎఐకెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశ్యం పద్మ, ఎఐకెఎమ్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వర్ రావు, రైతు సంఘం నాయకులు గునిగంటి రాజన్న, భూతం వీరన్న, లింగన్న, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారధి, చిన్న చంద్రన్న, సమ్మెట రాజమౌళి, దుడ్డెల రామూర్తి, పాండు రంగాచారి, అన్నారపు హన్మంత్, భాస్కర్ రెడ్డి, తెలంగాణ జన సమితి నాయకులు డాక్టర్ డోలి సత్యనారాయణ, పిల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
గీసుకొండ
గీసుకొండ మండలం మచ్చాపూర్ రహదారిపై ఉమ్మడి రైతు సంఘాల ఐక్య కమిటీ పిలుపు మేరకు గురువారం చేపట్టిన రోడ్డు దిగ్బందనం ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరపై బోనస్ ప్రకటించాలని, పోడు, కౌలు రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని, రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మహత్యలను నివారించాలనే ప్రధాన డిమాండ్లతో ఖమ్మం నుంచి కరీంనగర్ వరకు రోడ్లను దిగ్బందించే అందోళన కార్యక్రమాలను రైతు సంఘాలు చేపట్టాయి. ఇందులో భాగంగా మచ్చాపూర్ వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతు సంఘాల ప్రధాన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి రోడ్డు దిగ్భందనం కార్యక్రమం చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా బైటాయించి రాష్ట్ర ప్రభుత్వానికి, సిఎం కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే దారిలో దుగ్గొండి మండలంలో పలు అభివృద్ధ్ది కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళుతున్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కారును వెనక వస్తున్న ఆయన రక్షణ కాన్వాయ్‌ను ఆందోళన కారులు అడ్డుకున్నారు. దీంతో అప్పటికే భారీగా మొహరించిన పోలీసులు ఆందోళన కారులను పక్కకు తప్పించి మంత్రి వాహనానికి దారి చూపారు. ఆ తర్వాత ఆందోళన కారులను ఈడ్చుకుంటూ వెళ్లి వ్యాన్‌లో ఎక్కించి గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా తమ పట్ల పోలీసులు అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించారని కొందరు మహిళా ఆందోళన కారులు ఆరోపించారు. గీసుకొండ, మామునూరు సీఐలు సంజీవరావు, శ్రీనివాస్, ఎస్‌ఐలు విఠల్, రహెమాన్, పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆందోళనలో రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మోర్తాల చందర్‌రావు, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు కిరణ్ విత్త, కొండల్ రెడ్డి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకురాలు రమాదేవి, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు నూనె అప్పారావు బీరం రాములు, కొండేటి రాజు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.