Home ఎడిటోరియల్ కెసిఆర్ మార్క్ పునరేకీకరణ

కెసిఆర్ మార్క్ పునరేకీకరణ

 

దేశంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్షంగా రాజకీయ శక్తుల పునరేకీకరణ వేగంగా సాగుతున్నది. ప్రత్యేకించి తెలంగాణ ముఖ్యమంత్రి, పీపుల్స్ ఫ్రంట్ వ్యూహకర్త కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించిన బిజెపి, కాంగ్రెసేతర మూడో ప్రత్యామ్నాయ ప్రాంతీయ పార్టీల ఐక్యత రోజురోజుకు పెరుగుతున్నది. ఇది పీపుల్స్‌ఫ్రంట్ దిశగా రాజకీయ శక్తుల పునరేకీకరణను సూచిస్తున్నది. దేశ రాజకీయాలను శాసించే ప్రబల శక్తిగా నిలిచిన ఉత్తరప్రదేశ్‌లో నిన్నటి దాకా బద్ధ శత్రువులుగా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాది పార్టీలు ఐక్యం కావడం దేశ రాజకీయాల్లో పెను సంచలనానికి కారణమైంది.
దేశంలో అత్యధిక కాలం పాలన సాగించిన కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలే దేశ రాజకీయాలను శాసించే అనుకూల పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. జాతీయ రాజకీయ పార్టీల ప్రాబల్యాన్ని దెబ్బ తీసే విధంగా మెజారిటీ లోక్‌సభ సీట్లున్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుంటున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణగా ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్, మాయావతిల ఐక్యతనే ప్రధానంగా చెప్పవచ్చు. దేశంలో 545 లోక్‌సభ సీట్లు ఉంటే ఇందులో అత్యధికం ఉత్తర ప్రదేశ్‌లోనే 80 సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీకి మెజారిటీ వస్తే ఆ పార్టీనే కేంద్రంలో పాలక పార్టీగా అవిర్భవించే అవకాశాలున్నాయి. ఇప్పటి దాకా బిజెపియేతర మహాఘట్భంధన్‌గా ఎస్‌పి, బిఎస్‌పిలు కాంగ్రెస్‌తో కలిసి వచ్చే లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తాయని అంతా భావించారు. కానీ దీనికి భిన్నంగా కాంగ్రెస్‌ను పక్కకు పెట్టి ములాయం సింగ్, మాయావతిలు కలిసి చెరి సగం సీట్లు పోటీ చేస్తామని ప్రకటించడంతో కాంగ్రెస్ మహాకూటమి ఆశలపై నీళ్లు చల్లినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తంగా ఇది దేశంలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ అదీ ప్రాంతీయ పార్టీల ఐక్యతతోనే ఏర్పడుతుందని ఈ ఫ్రంట్ దేశ భవిష్యత్ రాజకీయాలను శాసిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గడిచిన ఏడాదిగా చెబుతున్నది కార్యాచరణలోకి వస్తున్నట్లుగా ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు సూచి స్తున్నాయి.
ఇప్పటికే ఒడిశాలో జెడిఎస్ అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యామ్నాయ ఫ్రంట్‌కు అనుకూలంగా రాజకీయ సంకేతాలు ఇచ్చారు. ఆయన ఆ రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలకు సమాన దూరంగా ఉంటానని ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా మూడో ఫ్రంట్‌కు అనుకూలంగా సంకేతాలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన విపక్షంగా ఉన్న వైసిపి పార్టీ కూడా కాంగ్రెస్, బిజెపిలను వ్యతిరేకిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపాదించిన పీపుల్స్ ఫ్రంట్‌కు అనుకూలంగా ఉన్నట్లుగా ఆ పార్టీ నేతల ప్రకటనలు సూచిస్తున్నాయి. ఇక వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎంలు మూడో ప్రత్యామ్నాయ శక్తి కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్‌డిఎలో కీలక పాత్ర వహించిన తెలుగు దేశం, శివసేనలు కూడా ఆ కూటమికి ప్రస్తుతం దూరం గా ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడులో అన్నాడిఎంకె ఎటూ మొగ్గు చూపకుండా 2019 ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తోంది.
తమిళనాడులో విపక్షంగా ఉన్న డిఎంకె కూడా భవిష్యత్ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నది. పశ్చిమబెంగాల్లో ఎదురేలేని నేతగా పాపులర్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ కూడా దేశంలో రాజకీయ పరిణామాలను నిశితంగా విశ్లేషిస్తూ కేంద్రంలో కూడా రాజకీయ చక్రం తిప్పాలని, కాంగ్రెస్, బిజెపిల పాలనకు చరమగీతం పాడాలని అనుకూల వాతావరణం కోసం ఎదురుచూస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో 545 సీట్లలో 282 సీట్లను గెలిచిన ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల జరిగిన పలు లోక్‌సభ ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చవిచూశారు. ఆయన పాపులారిటీ క్రమంగా తగ్గుతున్నట్లుగా పలు సర్వేలు సూచిస్తుండడంతో ఆయన గెలిచే మార్గాలను అన్వేషిస్తూ అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్లను హడావుడిగా ఆమోదింప చేసుకున్నారు. 2014 ఎన్నికలలో పలు రాష్ట్రాలలో ప్రధాన శక్తులుగా ఉన్న 14 ప్రాంతీయ పార్టీలు 172 సీట్లను గెలుచుకున్నాయి. ఇందులో ఆప్, అన్నాడిఎంకె, టిఎంసి, బిఎస్‌పి, ఎస్‌పి, కశ్మీర్ ఎన్‌సి, టిఆర్‌ఎస్, వైసిపి, జెఎంఎంఎ, ఆర్‌జెడి, ఎన్‌సిపి, శివసేన, జెడిఎస్, డిఎంకె, శిరోమణి అకాలీదళ్ పార్టీలున్నాయి. ఇందులో కొన్ని ప్రాంతీయ పార్టీలు బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో ఉన్నా ఇప్పటికే కొన్ని పార్టీలు ఆ కూటమికి గుడ్‌బై చెప్పాయి. మరికొన్ని బిజెపికి దూరంగా ఉండే ఆలోచనలో ఉన్నాయి.
ఈ పార్టీల్లో 2014 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కేవలం ఐదు సీట్లను సాధించగా బహుజన్ సమాజ్ పార్టీ అసలు సీట్లే గెలవలేదు. అయినా ప్రాంతీయ పార్టీల స్కోర్ 172గా ఉంది. 2019లో బిజెపి వ్యతిరేకతలో ఈ రెండు పార్టీలు 70కి పైగా సీట్లను సాధిస్తే ప్రాంతీయ పార్టీ సంఖ్యా బలం 240కి పైకి పెరుగుతుంది. ఇతర రాష్ట్రాలలోని వైసిపి, ఆర్‌జెడి, డిఎంకె, టిఆర్‌ఎస్ పార్టీల బలం పెరిగితే ప్రాంతీయ పార్టీలు లోక్‌సభలో మ్యాజిక్ మార్క్‌గా ఉన్న 272ను అధిగమించడం అసాధ్యమేమీకాదని దేశ రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తున్న రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే ఈ దిశగా ప్రాంతీయ పార్టీలను ఐక్యం చేసే కీలక శక్తిగా తెలంగాణలో రెండో సారి ఘన విజయం సాధించిన కెసిఆర్ వేగంగా ముందుకు కదులుతున్నారు.
ఆయన 2019ని ఫోకస్ చేస్తూ దేశంలోని అన్ని సెక్యులర్, ప్రజాస్వామిక పార్టీలను ఐక్యం చేయడానికి ఇప్పటికే ఎన్నో రాష్ట్రాల పర్యటనలు చేశారు. అధినేతలను ఐక్యత దిశగా వారి ఆలోచనలను మారుస్తున్నారు. ఇందుకోసం ఆయన దేశ రాజధాని ఢిల్లీలో కూడా టిఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండడం గమనించదగిన అంశంగా చెప్పవచ్చు.
ప్రాంతీయ శక్తులకు వామపక్షాలు కూడా జత కలిస్తే 2019 ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీల నాయకత్వంలోని ఫ్రంట్‌కు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ముందు కాకుండా ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బిజెపేతర ప్రాంతీయ పార్టీల కూటమి గురించి ఆలోచిస్తామని మహారాష్ట్ర ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్ అంటున్నారు. ప్రాంతీయ పార్టీల అధినేతల అంతరంగాలు ఎలా ఉన్నా వారిని పీపుల్స్ ఫ్రంట్ దిశగా ఐక్యం చేయడానికి టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అహరహం శ్రమిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చావునోట్లో తలపెట్టి దేశంలో అనేక పార్టీల అధినేతల మనసు మారేలా చేసి తెలంగాణను సాధించిన కెసిఆర్‌కు ప్రాంతీయ పార్టీల ఐక్యతను సాధించడం అసంభవమేమీ కాదని ఆయన రాజకీయ ఎత్తుగడలను విశ్లేషిస్తున్న రాజకీయ పరిశీలకులు చెబు తున్నారు.

Article about CM KCR