Home ఎడిటోరియల్ కార్పొరేట్ కరిమింగిన వైద్యం

కార్పొరేట్ కరిమింగిన వైద్యం

edit

పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు భారతదేశంలో ప్రయివేట్ వైద్యరంగాన్ని శాసిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీము ప్రయివేటు వైద్యరంగానికి నచ్చడం లేదు. రీ ఇంబర్స్‌మెంట్ చేస్తున్న మొత్తాల విషయంలో వివాదం చోటు చేసుకుంది. చాలా తక్కువ మొత్తం రీ ఇంబర్స్‌మెంట్ చేస్తున్నారని ప్రయివేటు ఆసుపత్రుల ఆరోపణ. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలందరికీ వైద్య సదుపాయం కల్పించడం ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదు. కాబట్టి ప్రయివేటు ఆసుపత్రులు కూడా కొంత భారం మోయాలని భావిస్తోంది. అయితే ప్రయివేటు ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును, ప్రభుత్వపనితీరును ఒకసారి పరిశీలించడం ఇక్కడ అవసరం. అంతేకాదు, ఈ కొత్త స్కీము ప్రయివేటు ఆసుపత్రుల పనితీరును ఆమోదిస్తుందన్నది కూడా గమనించాలి. ప్రయివేటు వైద్యరంగంలో అవసరమైన గుణపాఠాలు మనకు అమెరికా నుంచి దొరుకుతాయి.
వాల్ మార్ట్ అమెరికన్ సంస్థ. అమెరికాలో ఎక్కడ చూసినా కనబడుతుంది. అయితే న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాలు దీర్ఘకాలం పోరాడిన తర్వాత వాల్ మార్ట్‌ను బయటకు గెంటేశాయి. ఇతర నగరాలు మాత్రం, ఉద్యోగావకాశాలు, చవుకగా లభించే వస్తువుల ప్రలోభానికి గురై వాల్ మార్ట్ దుకాణాలను కొనసాగనిస్తున్నాయి.
వాల్ మార్ట్‌కు వ్యతిరేకంగా ఉద్యమించిన వారు చాలా ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు. ముఖ్యంగా వాల్ మార్ట్‌లో పనిచేసే ఉద్యోగుల పని పరిస్థితులు. చాలా దయానీయంగా ఉన్న జీతభత్యాల పరిస్థితి. అంతేకాదు, వాల్ మార్ట్ వంటి కార్పొరేట్ల వల్ల చిన్న చిన్న చిల్లర దుకాణాలు పోటీలో నిలబడలేవు. మూతపడిపోతాయి. ఫలితంగా చిన్నా చితక వ్యాపారాలు చేసుకునే వారు తమ వ్యాపారాలు మానేసి వాల్ మార్టులోనే ఉద్యోగులుగా బతికే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రతి ప్రాంతం దాని ప్రత్యేకతను కోల్పోయి ఒక మూసలో పోసినట్లు అన్ని ప్రాంతాలు ఒకేలా తయార వుతున్నాయి.
ఇలాంటి పరిస్థితే, అంటే వాల్ మార్ట్ వంటి మాళ్ళ వల్ల చిన్న చితక వ్యాపారాలు మూతపడిన లాంటి పరిస్థితే ఇప్పుడు వైద్యరంగంలోనూ తలెత్తింది. అమెరికాలో ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. డాక్టర్ల ప్రయివేటు క్ల్లీనిక్కులు, ప్రయివేటు ప్రాక్టీసులు మూతపడ్డాయి. డాక్టర్లు ఇప్పుడు ఆసుపత్రుల్లో ప్రాక్టీసు చేస్తున్నారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం 2016లో అమెరికాలో అత్యధిక శాతం డాక్టర్లు స్వంత ప్రాక్టీసు చేయడం లేదు. అయితే ఆసుపత్రుల్లో ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్ల సంఖ్య అపారంగా పెరిగిపోయింది. దీనికి అనేక కారణాలున్నాయి. ప్రయివేటు ప్రాక్టీసు చేసే డాక్టర్ల వద్ద, చిన్న చిన్న క్లీనిక్కుల వద్ద వైద్యం చేయించుకుంటే, ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్ కష్టమవుతోంది. అదే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందితే వైద్య సదుపాయాల ఖర్చును రీ ఇంబర్స్ చేయడం తేలిగ్గా జరుగుతోంది. అటు ప్రభుత్వము, ప్రయివేటు ఇన్సూరెన్సు కంపెనీలు కార్పొరేట్ ఆసుపత్రుల విషయంలో రీ ఇంబర్స్‌మెంట్ ఆలస్యం చేయడం లేదు. దీనివల్ల ప్రయివేటు క్లీనిక్కులకు ప్రజలు రావడం లేదు. ఇప్పుడు డాక్టర్లు స్వంత ప్రాక్టీసు కాకుండా ఆసుపత్రుల్లో ఉద్యోగులుగా మారుతున్నారు. చాలా మంది డాక్టర్లకు ఉద్యోగాల్లో జీతభత్యాల సదుపాయాలు కూడా సరిగాలేవు. డాక్టర్లందరూ యూనియన్ పెడితే పరిస్థితులు మెరుగుపడతాయన్న ఆలోచన కూడా ఉంది. మరోవైపు పేషంట్లకు సంబంధించి ఆసుపత్రిలో వైద్యం పొందడం చాలా ఖరీదైన వ్యవహారం.దురదృష్టమేమంటే ఇండియాలో వైద్యరంగం అమెరికా నమూనాను అనుసరిస్తోంది. కార్పొరేట్లు నడుపుతున్న పెద్ద పెద్ద ప్రయివేటు ఆసుపత్రులు నెమ్మదిగా ప్రాథమిక వైద్యకేంద్రాల స్థాయి సేవలకు వచ్చాయి. దీని వల్ల చిన్న చిన్న క్ల్లీనిక్కులు, ప్రయివేటు ప్రాక్టీసు చేసే డాక్టర్లు భవిష్యత్తులో తమ క్లీనిక్కులను మూసేయవలసి రావచ్చు. రానున్న రోజుల్లో ముహల్లాలో, వీధిలో కనబడే క్లీనిక్కు ఏదీ ఉండకపోవచ్చు.
ఆసుపత్రిలో వైద్యం పొందడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పలువురు స్పెషలిస్టులు అందుబాటులోఉంటారు. ముఖ్యంగా కీలకమైన ఆరోగ్య సమస్యలున్నవారికి ఇది అవసరం. చిన్న చిన్న క్లీనిక్కుల్లో, ప్రయివేటు ప్రాక్టీసుల్లో ఇది లభించదు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుప్రతులు ఒక సమగ్రమైన వ్యవస్థగా పనిచేస్తాయి. పరిశుభ్రత, నిర్వహణ అన్ని బాగుంటాయి. ఇవేవీ చిన్న చిన్న క్లీనిక్కుల్లో ఉండకపోవచ్చు. కాని ఆసుపత్రిలో అయ్యే ఖర్చు ఎక్కువ. ఇదే పెద్ద లోపం. భారతదేశం వంటి వర్ధమాన దేశాలకు ఇది తలకు మించిన భారం అవుతుంది.
కార్పొరేట్ ఆసుప్రతుల విస్తరణలో డాక్టర్లు ఉద్యోగులుగా మారిపోయే ఈ పరిస్థితికి నివారణ ఏమిటి? విపరీతమైన ఖర్చులు రోగుల నెత్తిన పడకుండా చేసే దారేమిటి?
అన్నింటికన్నా ముందు ఇండియాలో రెగ్యులేటరీ సంస్థలను, వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వ నిఘా, పర్యవేక్షణ అమలు చేసే సంస్థలను చక్కదిద్దడం అవసరం. రెగ్యులేటరీ ఏజన్సీల వల్ల వైద్య సేవల్లో నాణ్యత పెరుగుతుంది. అధిక ఖర్చులు కూడా అదుపు చేయడం సాధ్యపడుతుంది. సమతుల్యం సాధించవచ్చు. అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల చెయిన్లను ప్రోత్సహించరాదు. చిన్న స్థాయిలో డాక్టర్ల నిర్వహణలో నడిచే ప్రయివేటు ఆసుపత్రులను ప్రోత్సహించడం వల్ల వైద్యరంగంలో కార్పొరేట్ల గుత్తాధిపత్యాన్ని నివారించవచ్చు.
అలాగే ఆసుపత్రులతో సమన్వయంగా పనిచేసే క్లీనిక్కులు, ప్రయివేటు ప్రాక్టీసుల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. చివరిగా దేశంలో మెడికల్ ఇన్సూరెన్సుకు సంబంధించి ఒకే సంస్థ నుంచి రీ ఇంబర్స్‌మెంట్ జరిగేలా చూడాలి. ఈ సంస్థ చిన్న చిన్న క్లీనిక్కుల డాక్టర్లు, ప్రయివేటు ప్రాక్టీసు చేసేవారితో నేరుగా సంప్రదించి రీ ఇంబర్స్ మెంట్ చేయాలి. అనేక మెడికల్ ఇన్సూరెన్సు కంపెనీలు ఉంటే డాక్టర్లు, ప్రయివేటు ప్రాక్టీసు చేసే వైద్యులు రీ ఇంబర్స్‌మెంట్ విషయంలో ఈ వేర్వేరు కంపెనీలన్నింటితో వ్యవహరించడం చాలా కష్టం. ఒకే సంస్థ నుంచి రీ ఇంబర్స్‌మెంట్ జరిగే ఏర్పాటు చేస్తే నియంత్రణ, నిఘా కూడా పటిష్టంగా ఉంటాయి.