Home ఆఫ్ బీట్ భవిష్యత్తుకు బాట ఈ కోర్సులు

భవిష్యత్తుకు బాట ఈ కోర్సులు

lf

కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రముఖ సైన్స్ విద్యాసంస్థలు అందించే డ్యూయల్ కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి కోర్సుల అధ్యయనం ద్వారా శాస్త్రవ్తేతలుగా, అధ్యాపకులుగా రాణించవచ్చు. ఈ కోర్సుల్లో చేరాలంటే ఎంపిసి,  బైపిసి చదివిన వారు అర్హులు.  కోర్సు వ్యవధి ఐదేళ్లు.  ఈ కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. దానికెలా ప్రిపేర్ కావాలి? ఎలాంటి అవకాశాలుంటాయో తెలుసుకుందాం… 

డ్యూయల్ కోర్సుల్లో ప్రశ్నలు ఐఐటిజెఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ స్థాయిల్లో ఉంటాయి. విద్యార్థి తార్కిక సామర్థాలను, విశ్లేషణను పరీక్షించేలా ఉంటాయి. మన దేశంలో ఈ సంస్థలు బెరహంపూర్, భోపాల్, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతిలో ఉన్నాయి. ఈ విద్యాసంస్థలు సంయుక్తంగా ఐదేళ్ల డ్యూయల్ బ్యాచిలర్ సైన్స్, మాస్టర్ సైన్స్ కోర్సులను అందిస్తున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) భారత ప్రభుత్వ అధీనంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ విభాగంలో స్వతంత్రంగా పనిచేసే విద్యాసంస్థలు.
మానవ వనరుల అభివృద్ధిశాఖ ఉన్నత ప్రమాణాలతో కూడిన సైన్స్ విద్య, పరిశోధన, శిక్షణ కోసం ఈ విద్యాసంస్థలను స్థాపించింది. ఇక్కడ నాణ్యమైన, అధునాతన ప్రయోగశాలలు, జాతీయ, అంతర్జాతీయ పరిశోధన జర్నల్స్‌తో కూడిన అత్యాధునిక డిజిటల్ లైబ్రరీలు అందుబాటులో ఉంటాయి. పరిశోధన, బోధన రంగంలో విశేష అనుభవం కలిగిన అధ్యాపక బృందంతో శిక్షణ ఇస్తారు. ఫలితంగా సంబంధిత సైన్స్ కోర్సుల్లో శిక్షణ పూర్తిచేసినవారికి అధిక వేతనాలతో కూడిన ఉద్యోగావకాశాలుంటాయి. వీరు బోధన రంగంలో అధ్యాపకులుగా, పరిశోధన సంస్థలు, పరిశ్రమల్లో శాస్త్రవేత్తలుగా స్థిరపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత ఏడాది ఐఐఎస్‌ఈఆర్ విద్యార్థులు పొగలేని దీపావళి మందుగుండు సామగ్రి తయారీలో విజయం సాధించారు.
ఏఏ సబ్జెక్టులు…
ఈ విద్యాసంస్థలు బేసిక్ సైన్స్ కోర్సులైన బయలాజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, మేథమేటికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ మొదలైన సబ్జెక్టుల్లో ఐదేళ్ల డ్యూయల్ బిఎస్,- ఎంఎస్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరటానికి 10+2లో ఎంపిసి, బైపిసి, ఎంబైపిసితోపాటు ఇతర విద్యార్థులూ అర్హులే. ఐఐఎస్‌ఈఆర్ భోపాల్‌లో డ్యూయల్ బీఎస్, ఎంఎస్, ఇంజినీరింగ్ సైన్స్ కోర్సును కూడా ప్రవేశపెడుతున్నారు. ఈ కోర్సుకు 10+2లో మేథమేటిక్స్ చదివినవారు అర్హులు. బ్యాచిలర్ సైన్స్ ఇన్ ఎకనామిక్ సైన్స్ కోర్సును ప్రవేశపెడుతోంది. ఈ కోర్సుకి 10+2లో మేథమేటిక్స్ చదివినవారు అర్హులు. ఈ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు మొదటి రెండేళ్లు అన్ని బేసిక్ సైన్స్‌ల్లో సమగ్రంగా శిక్షణనిస్తారు. తరువాతి రెండేళ్లు ఎంపిక చేసుకున్న స్పెషలైజ్‌డ్ సైన్స్ సబ్జెక్టులో విస్తృత పరిశోధన, బోధన, శిక్షణనిస్తారు. చివరి (అయిదో) సంవత్సరంలో రిసెర్చ్ ప్రాజెక్టు కూడా ఉంటుంది. ఐఐఎస్‌ఈఆర్‌లో వివిధ బేసిక్ సైన్సెస్‌లో సమాజహితానికి దోహదపడే అనేక అంశాలపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సంస్థలు పిహెచ్‌డి, ఇంటిగ్రేటెడ్ పిహెచ్‌డి కోర్సులను కూడా అందిస్తున్నాయి.
ఆప్టిట్యూడ్ పరీక్ష..
ఆప్టిట్యూడ్ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ ప్రశ్నపత్రంలో ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో మాత్రమే ఉంటాయి. ఈ పరీక్షకు ఎన్‌సిఈఆర్‌టి 11, 12 తరగతుల బయాలజీ, మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్‌ను ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రంలో 4 సబ్జెక్టుల్లో (బయాలజీ, మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) 15 ప్రశ్నల చొప్పున మొత్తం 60 ప్రశ్నలకు 3 గంటల సమయాన్ని ఇస్తారు. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నలకు +3 మార్కులు, ప్రతి తప్పు సమాధానానికి -1 రుణాత్మక మార్కులున్నాయి. గరిష్ఠ మార్కులు 180. ఈ పరీక్షకు దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో గత ఏ డాది హైదరాబాద్, విజయవాడ, తిరుపతిల్లో పరీక్షను నిర్వహించారు.
ప్రిపేరేషన్ ఎలాగంటే…
విద్యావిధానం సమగ్రంగా ఉంటుంది కాబట్టి ప్రవేశ పరీక్షలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. ప్రశ్నలన్నీ విద్యార్థుల విశ్లేషణ, తార్కిక సామర్థ్యాలను పరీక్షించేలా ఉండటం ఐఐఎస్‌ఈఆర్ ప్రత్యేకత. ప్రశ్నలు ఐఐటిజెఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ స్థాయిలో ఉంటున్నాయి. ఈ ప్రవేశపరీక్ష రాసేవారు మొదట ప్రాథమిక భావనలు, తెలుగు అకాడమీ, సిబిఎస్‌ఇ, ఎన్‌సిఈఆర్‌టి పుస్తకాలను రిఫర్ చేయాలి. బేసిక్ కాన్సెప్టులపై పట్టు సాధించాక అంశాలవారీగా రిఫరెన్స్ పుస్తకాల ద్వారా సబ్జెక్టును క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. బయాలజీ: దీనిలో జనరల్ బయాలజీ, సెల్ బయాలజీ, జెనెటిక్స్, ఎకాలజీ అండ్ ఎవల్యూషన్, బయోటెక్నాలజీ, ఆనిమల్ ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, రిప్రొడక్షన్, డిఎన్‌ఎ ధర్మాలు, ఆర్‌డిఎన్‌ఎ టెక్నాలజీ, ట్రాన్స్‌లేషన్, ట్రాన్‌స్క్రిప్షన్ మొదలైన అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. వీటిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి.

కెమిస్ట్రీ: ఆర్గానిక్ కెమిస్ట్రీలో.. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, రియాక్షన్ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీ, నేమ్‌డ్ రియాక్షన్స్, ఎరోమ్యాటిసిటీ, కార్బోహైడ్రేట్స్, అమైనో యాసిడ్స్, పాలిమర్స్, ఫిజికల్ కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్, సొల్యూషన్స్, సాలిడ్ స్టేట్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, థర్మోడైనమిక్స్ సంబంధిత అంశాలను అధ్యయనం చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పీరియాడిక్ ప్రాపర్టీస్, రసాయన బంధం, సంక్లిష్ట సమ్మేళనాలు, ఎస్, పి బ్లాక్ మూలకాలు, డి, ఎఫ్ బ్లాక్ మూలకాలు, మెటలర్జీ మొదలైనవాటిపై దృష్టి అవసరం.
ఫిజిక్స్: జనరల్ ఫిజిక్స్, ఆప్టిక్స్, మోడరన్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజమ్, మెకానిక్స్ సంబంధిత సిలబస్‌ను అనువర్తిత ధోరణిలో శ్రద్ధగా అధ్యయనం చేయాలి. మేథమేటిక్స్: దీనిలో కాలిక్యులస్, త్రికోణమితి, కోఆర్డినేట్ జామెట్రీ, ఆల్జీబ్రా, వెక్టర్స్ సంబంధిత సిలబస్‌ను క్షుణ్ణంగా సాధన చేయాలి. బట్టీ ధోరణిలో కాకుండా సబ్జెక్టును అవగాహన చేసుకుని విభిన్న అంశాలను అన్వయించగలిగితే విజయం సాధ్యపడుతుంది. సబ్జెక్టును ఇష్టపడి చదవాలి. సానుకూల దృక్పథంతో కృషి చేస్తే ఆశించిన ర్యాంకు సాధించవచ్చు. మాదిరి ప్రశ్నాపత్రాలకు www.iiseradmission.inను చూడవచ్చు.

ఎవరెవరు అర్హులంటే…
* 2018 -19 విద్యా సంవత్సరానికి ప్రామాణికమైన కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కెవిపివై) ఫెలోషిప్ పొందిన విద్యార్థులు అర్హులు (కటాఫ్ కూడా ఉండొచ్చు).
* జెఈఈ అడ్వాన్స్‌డ్ 2018లో కామన్ ర్యాంకు జాబితాలో 10,000 కన్నా తక్కువ ర్యాంకు సాధించిన జనరల్ అభ్యర్థులు, రిజర్వ్ కేటగిరీ వారి కేటగిరీ ర్యాంకులో 10,000 కన్నా తక్కువ ర్యాంకు సాధించినవారు మాత్రమే అర్హులు.
* స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డ్ (ఎస్‌సీబీ) మార్గంలో 2017, 2018ల్లో 10+2 విధానంలో సైన్స్ విభాగంలో సంబంధిత బోర్డు నిర్దేశించిన కటాఫ్ మార్కు లేదా అంతకన్నా ఎక్కువ సాధించినవారు అర్హులు.
* ఐఐఎస్‌ఈఆర్ 2017 ఎస్‌సిబి మార్గంలో మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులకు 97.3%, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు వారికి 95.4% కటాఫ్ మార్కుగా నిర్ణయించారు.
* ఈ విద్యాసంస్థలో గరిష్ఠంగా 50% సీట్లను కేవీపీవై, జేఈఈ ద్వారా భర్తీ చేస్తారు. ఈ మార్గంలో మిగిలిన సీట్లతోపాటు మిగిలిన 50% సీట్లను ఎస్‌సిబి మార్గంలో అర్హత పొందిన విద్యార్థులకు ఐఐఎస్‌ఈఆర్ ప్రత్యేక ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో చూపించే నైపుణ్యత ఆధారంగా భర్తీ చేస్తారు.