Home కలం రైతు వాల్మీకి జగన్నాథాచార్యులు

రైతు వాల్మీకి జగన్నాథాచార్యులు

Farmer Valmiki Jagannath Acharyulu

ఆధునిక తెలుగు కవుల్లో సంప్రదాయ కవితకు పెద్దపీట వేసి, అచ్చమైన తెలుగు పలుకుబళ్లను, స్వచ్ఛమైన తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని, పాడిపంటల పచ్చదనాన్ని, పైరగాలుల వెచ్చదనాన్ని, కోడెగిత్తలు తీసే పరవళ్లను, మాండలిక పదాల గుబాళింపులను రాశులుగా పోసిన అచ్చమైన అసలు సిసలు రైతుకావ్యకవి వానమామలై జగన్నాథాచార్యులు. జగన్నాథాచార్యది పండిత వంశం. ఈయన శ్రీమాన్ సీతాంబ, బక్కయ్యశాస్త్రి దంపతులకు మూడవ సంతానంగా 1908 సం. డిసెంబర్ 19 న జన్మించాడు.

తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా అందుకున్న సంప్రదాయాన్ని నరనరాల్లో జీర్ణించుకుని చిన్నవయసులోనే పురాణ గ్రంథపఠనం,హరికథాగానం వంటివి చేస్తుండేవాడు.ప్రసిద్ధకవి ‘అభినవపోతన’ వానమామలై వరదాచార్యులకు ఈయన అగ్రజుడు.జగన్నాథాచార్య తండ్రివద్ద ‘శబ్దమంజరి’ నేర్చుకునేవాడు. తన అన్నల వద్ద సుమతీ,దాశరథి శతక పద్యాలు నేర్చుకుని కంఠస్థం చేశాడు.సంస్క్రతాంధ్ర భాషల్లో విశేషమైన కృషి చేశాడు. తన తమ్ముడు వరదాచార్యతో కలిసి అనేక సాహితీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడు. విద్యాభ్యాసం ఇంటివద్దే జరిగినా, నైజాం పాఠశాలలో 4 వ తరగతిలో చేరి 7 వ తరగతిదాకా చదివాడు. మహాభారతంలోని పద్యాలను అప్పుడే కంఠస్థం చేశాడు.ఇంకా బీజగణితం,క్షేత్రగణితం వంటివి కూడా నేర్చుకున్నాడు. 19 ఏళ్ల వయస్సులో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ తాలుకా వాస్తవ్యులైన సముద్రాల జగన్నాథాచార్య పెంపుడు కూతురైన ఆండాలమ్మ తో వివాహం జరిగింది. ఆయనకు 11 మంది సంతానం.

మెట్రిక్ పాసైన వెంటనే వారికి ప్రభుత్వోద్యోగం లభించింది. మొదట్లో భీమారం గ్రామంలో (అదిలాబాద్ జిల్లా) 2 సం.లు పనిచేశాడు. ఆపై అదే జిల్లాలో రామారం గ్రామంలో మరో రెండేళ్లు పని చేశాడు. ఆ తరువాత కరీంనగర్ జిల్లా పెద్దపల్లి తాలుకాలోని కాల్వ శ్రీరాంపురం గ్రామంలోని విద్యా కమిటి కోరికతో బాలికోన్నత పాఠశాలలో సుమారు 8 ఏండ్లు ఆ తరువాత కల్లేపల్లిలో 8 ఏండ్లు, నిడుకొండలో 3 ఏండ్లు అధ్యాపక వృత్తిలో కొనసాగాడు. చివరగా కరీంనగర్ లోని ఎస్ .వి.టి.సి. ట్యూటోరియల్ కళాశాలలో 8 ఏండ్లు తెలుగుపండితునిగా పనిచేశాడు.

దాదాపు 1000 కి పైగా హరికథలు గానం చేశాడు. నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా హరికథాగానం చేయడానికి వెళ్లాడు. అక్కడ తెలుగువారి కన్నా హిందీ వారే అధికంగా ఉండడంతో తెలుగు హరికథలను అప్పటికప్పుడే హిందీలోకి అనువదించుకుని హిందీలో గానం చేశాడు. అంతటి పండితుడు జగన్నాథాచార్య.

‘ధనుర్దాసు’ కథలోని వైష్ణవభక్తి తత్త్వంతో కొన్ని తేటగీతి పద్యాలు రాశాడు. ఆ తరువాత ‘కార్పాసలక్ష్మి’ అనే పేరుతో ఒక వైష్ణవభక్తురాలి గాథను నాటకంగా రాశాడు. అది ముద్రణకు నోచుకోలేదు. ఆ తరువాత సోషలిజం వైపు మొగ్గడంతో ఆ సిద్ధాంతాల ప్రచారానుగుణంగా ‘అభ్యుదయ గేయాలు’ రాశా డు. వాటిని 1952 – 53 సం.లో శ్రీ జువ్వాడి గౌతమరావు ఆధ్వర్యంలో ముద్రించాడు. 1968 సం.లో హుజురాబాద్ తాలుకాలోని ఇల్లంద కుంటలోని శ్రీ సీతారామచంద్రస్వామిపై సంస్కృతంలో ‘శ్రీ ఇల్లిందకుంట రఘురాట్ తవ సుప్రభాతమ్ ’ సరళసుందర శైలిలో రామాయణ పద్ధతిలో రాశాడు.

1971 లో శ్రీ జువ్వాడి ప్రభాకరరావు గారి ద్రవ్య సహాయంతో గోదాదేవి రచనయైన ‘తిరుప్పావై’ ను తమిళం నుండి తెలుగులోకి ’శ్రీవ్రతగీతి’ అనే పేరిట గేయాలుగా రాసి తన తమ్ముడు వరదాచార్య భార్య అయిన శ్రీమతి వైదేహి గారికి అంకితం చేశాడు.ఆవిధంగా కాల్వ శ్రీరాంపురంలో అధ్యాపకునిగా పనిచేస్తూ దగ్గరలోని ’కమాన్ పురం’లో వెలసిన ఆది వరాహస్వామి గూర్చి ‘ఆది వరాహ అష్టోత్తరశతి’ అని పంచపాదిగా మొత్తం ఉత్పలమాలావృత్తంలో రాశాడు. వరాహమూర్తిని దర్శిం చి,ఆనంద హృదయంతో ‘ద’ కారైక ప్రాసతో రాయబడిన శతకమిది.ఇంకా గణేశస్తుతి అనే శతకమొకటి రాశాడు. మాండలికాలు, ఆంగ్లపదాలు వాడుతూ రాయబడిన శతకమిది. కాని నేడిది అలభ్యం. హరికథాకాలక్షేపాల కాలంలో తమ్ముడు వరదాచార్యతో కలిసి ‘తులసీ రామాయణాన్ని‘హరికథగా, ‘జగదీశవరకవులు’ అన్న జంటపేరుతో రాశారు.ఇది కూడా నేడు అలభ్యమే. పిల్లల్లో దేశభక్తిని పెంచుతూ ‘తెలుగుబిడ్డ శతకం’ రెండు భాగాలుగా రాశాడు. ఇది కూడా ముద్రణకు నోచుకోలేదు.

ఆ తరువాత కొన్నేళ్లు వ్యవసాయం చేస్తూ రైతుశ్రమను,దేశానికి రైతు వల్ల ఉన్న లాభాలను తెల్పుతూ 3000 పద్యాలతో ‘రైతు రామాయణం’ అనే మహాకావ్యాన్ని రాశాడు.శ్రీ మద్రామాయణాన్ని తలపించేలా గ్రామీణ ప్రాంతంలోని రైతు జీవిత గాథను రామాయణంగా మలచుకుని పాత్రచిత్రణలో గాని,కథా సంవిధానంలోను విశేషమైన ప్రతిభ కనబరిచాడు జగన్నాథాచార్య.ఇందులో రైతును రాముడిగా చిత్రించాడు. ఈ రైతు రామాయణాన్ని ఆరు కాండలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు కవి.శిశు,శిక్షణ,కల్యాణ,కృషి,నిర్బంధ,విజయ కాండలుగా కావ్యాన్ని రచించాడు.

‘పల్లె అనగానే కవిగారి కలం విల్లు వలె మారి పూవుటమ్ముల జల్లు కురుస్తుంది.భారతమాత పల్లెలో ఉంటుందన్న మహాత్ముని మాటను కవితారూపమున తెలిపిన కవీశ్వరుడు మా జగ్గన్న’ అని అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి,మహాకవి దాశరథి ఈకావ్యానికి పీఠిక రాస్తూ ప్రశంసించాడు.జగన్నాథాచార్యుల పదసౌందర్యం కూడా ఈ పద్యాల్లో ఎంతో మధురంగా గోచరిస్తుంది.మచ్చుకు ఒకటి,రెండు పద్యాలను పరికిద్దాం.

పల్లెపడుచు వరిపంపు నాటడానికి వెళ్లటాన్ని జగన్నాథాచార్య ఎంతో కమనీయంగా చెప్పాడో ఈక్రింది సీసపద్యంలో చూద్దాం.
’చిటుకు మెట్టియలతో చిలిపిగాజుల జతల్
లయగల్పి ప్రక్క తాళములు వేయ
గజ్జెలందియలతో కాల్కడియాల్ జతై
టక్కు టిక్కుల చెమ్మచెక్కలాడ
గుండు పోగుల జతల్ క్రొంజెక్కుటద్దాల
పసిడి చిందుల జంట భరతమాడ
తనతొల్త పెండ్లి కొత్తలనాటి ముత్యాల
ముకుపోగు ముద్దుల మూట విప్ప’
పచ్చచేమంతి పూదోట పసిడి కోట
పడుచు పరువాల పాల మీగడలతేట
చిలిపి సిగ్గు సింగారాల జిలుగుమూట
పల్లె చెలియోర్తు జను వరివంపు నాట’
అంటూ వరివంపు నాటడానికి వెళ్లే పల్లెపడుచు పరువాల నిగారింపులను గూర్చి ఎంతో సుమనోహరంగా వర్ణించాడు.

‘పంటలక్ష్మికి తొలియాటపట్టు
బక్క కాపు జనముల పాలి బంగారుగట్టు
కదుపు మొత్తాలు పురికట్టు
కాటకాలు కరువులరికట్టు
అది పెరటి కల్పకపు చెట్టు
పట్టణముల యాయువుపట్టు పల్లెపట్టు
అదియె లేక నగరజీవి ఆటకట్టు’.
పట్టణాలకు పల్లెటూళ్లే ఆధారమని,అవే లేకపోతే నగరంలో నివసించే ప్రజల జీవితాల ఆటకట్టవుతుందంటాడు.అయితే ఈ కావ్యాన్ని అప్పటి ముఖ్యమంత్రి,బహుభాషాకోవిదులు శ్రీ పి.వి.నరసింహారావు గారికి అంకితం చేయాలనే ఉద్దేశ్యంగలవారై వారు కరీంనగర్ వస్తున్నారని తెలిసి కేవలం 15 రోజుల్లోనే ముద్రణ బాధ్యతను వహిస్తూ తొందరలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అక్షరదోషాలు,పద్యాల విరుపులో క్రమపద్ధతి,పేజీల వరుసల ముద్రణ మొ.దోషాలతో ఈ గ్రంథం ప్రచురితమైంది.అయినా అందలి పద్యాలు అప్పటికే ప్రజల నోళ్లలో నాట్యం చేశాయి.ఈ కావ్యాన్ని పి.వి గారికి అంకితం చేస్తూ జగన్నాథాచార్య అన్న మాటలివి.

’ఆర్య పాములపర్తి వంశాబ్ధి చంద్ర
ప్రాచ్య పాశ్చాత్య విజ్ఞ విద్వభివంద్య
సద్యశస్సాంధ్ర విజ్ఞానశాస్త్రకేంద్ర
బుధులపాలిటి చలివేంద్ర పురుషసింహ!’

అనే పద్యంలో జగన్నాథాచార్యుల కవితా ప్రతిభ, రాజకీయ,సాహిత్య,విజ్ఞాన శాస్త్రాలలో పి.వి.నరసింహారావు గారికున్న ప్రతిభ ప్రస్ఫుటమవుతాయి.
కరీంనగర్ లోని శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఎస్ .ఆర్ .ఆర్ ) ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు మహాకవి విశ్వనాథ సత్యనారాయణ ఈ పద్యాలను చదివి ఎంతో ప్రశంసించారు.ఈ గ్రంథానికి మహాకవి దాశరథి,కాళోజి,పల్లా దుర్గయ్య, డా.సి.నారాయణరెడ్డి,గోవిందవరం మురహరిశర్మ మొ.వారు పీఠికలు రాశారు.ఈ కావ్యానికి ’జాళువపంట’ పేరుతో పీఠిక రాస్తూ డా.సి.నారాయణరెడ్డి ఇలా అన్నారు.’మాండలికాలను బండ్లకెత్తడం వీరి వినూత్నస్వరం తెలంగాణ గ్రామజీవనం ఎన్నెన్ని అంచులు తీర్చుకున్నది! పల్లీయుల ప్రాకృతిక స్వచ్ఛత ఎన్ని మీగడలు పేర్చుకున్నది!జగన్నాథాచార్యుల వారి దర్శనశక్తి ఎంతో సుసూక్ష్మమో వారి వర్ణనాశక్తి అంత విహాయసవిపులం’ అంటూ అభివర్ణించాడు.

జగన్నాథాచార్య అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా ’తెలుగు పదసాహిత్యసమితి’,’శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం’,‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’, కరీంనగర్ లోని కళాభారతి మొ. సాహితీ సంస్థలు ఆయనను ఘనంగా సన్మానించాయి.రైతు రామాయణాన్ని ‘మాండలిక పదకోశం’గా భావించి తెలుగు పదసాహిత్యసమితి నెల్లూరు వారు ఆయనను ‘రైతువాల్మీకి’ బిరుదుతో సత్కరించి గౌరవించారు. అయినా ఆయన చేసిన సాహిత్యకృషికి రావల్సినంత పేరు రాకపోవడం శోచనీయం. ఇంతటి సాహిత్యకృషి చేసిన జగన్నాథాచార్యులు 1995 సం. జూన్ 28 న పరమపదించాడు.అయినా తెలుగు వారి హృదయాల్లో రైతువాల్మీకి గా సుస్థిరస్థానం పొందాడు.

Article about Farmer Valmiki Jagannath Acharyulu

Telangana Latest News